అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్
వివిధ శాఖల అధికారులతో సమీక్ష
కరీంనగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే సమ్మక-సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేవాదాయ, నగరపాలక సంస్థ, వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమ్మక-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 16 ప్రదేశాల్లో సమ్మక-సారలమ్మ జాతర జరుగుతుందన్నారు. ప్రధానంగా రేకుర్తి, హుజూరాబాద్, వీణవంక, కేశవపట్నంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుందని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతర ప్రదేశాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలన్నారు. సమ్మక జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు లోటు లేకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జాతర ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, మాసులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. మూత్రశాలలు, తాతాలిక మరుగుదొడ్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని, శానిటేషన్ చేయించాలని, బారీ కేడ్లు, అమ్మవార్ల గద్దెల చుట్టూ రేలింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు, హెల్ప్ డెస్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక కేంద్రాలు అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేయాలని, జనరేటర్లు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే దారిలో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను, పొదలను తొలగించాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. జాతరకు బస్సులు నడిపించాలని, రిక్వెస్ట్ స్టాపులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రేకుర్తిలోని కెనాల్ శుభ్రం చేయించడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్ ఇన్చార్జి ఆర్డీవో మయాంక్ మిట్టల్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, డీసీపీ శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్ డాక్టర్ జువేరియా, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఈఈ కిష్టప్ప, డిప్యూటీ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.