అనేక రికార్డులతో ప్రపంచ దేశాల దృష్టి
రెండేళ్ల క్రితం న్యూయార్క్ టైమ్స్‌లో ప్రత్యేక కథనం
ప్రాజెక్టు విశిష్టతలపై మూడు రోజులపాటు ప్రసారం
తాజాగా ప్రఖ్యాత డిస్కవరీ చానెల్లో ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట డాక్యుమెంటరీ
ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు,సర్కారు కృషిపై నేడు టెలీకాస్ట్
తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా ఆరు ప్రాంతీయ భాషల్లో గంటపాటు ఎపిసోడ్
ఉమ్మడి జిల్లావాసుల హర్షం
కరీంనగర్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు అందుకున్నది. 20కిపైగా రిజర్వాయర్లు.. పంప్‌హౌస్‌లు.. భూగర్భంలో భారీ సర్జ్‌పూల్‌లు.. ఆసియాలోనే అతిపెద్ద మోటార్లు.. నీటి ఎత్తిపోసేందుకు వందలాది పంపులు.. తరలింపునకు టన్నెళ్లు, కాలువలు.. ఇదీ ‘కాళేశ్వరం ఎత్తిపోతల’ సమాహారం. దిగువకు పారే గో‘దారి’ని రాష్ట్రంలోని 13 జిల్లాలకు మళ్లించి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిలా మార్చే బృహత్తర లక్ష్యంతో పురుడుపోసుకున్న వరప్రదాయినీ ఇప్పటికే అనేక రికార్డులు సొంతం చేసుకున్నది. తాజాగా ప్రాజెక్టు విశిష్టతపై ప్రఖ్యాత డిస్కవరీ చానెల్ నేడు ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట డాక్యుమెంటరీని ప్రసారం చేయబోతున్నది.
తాజాగా ‘డిస్కవరీ’లో ఎపిపోడ్..
ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అతి భారీ పంపులు, మోటర్లు, ఇంజినీర్లు కార్మికుల శ్రమ అన్నింటికీ మించి ప్రజల కలల ప్రాజెక్టు సాకారానికి రాష్ట్ర సర్కారు చేసిన కృషిపై డిస్కవరీ చానెల్ తాజాగా ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించింది. అన్ని దేశాల్లో తన మీడియా వ్యవస్థల ద్వారా ప్రోమోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. 2017లో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిచేసిన నిర్మాణాలను చూపుతూనే, నీటిని ఆయకట్టుకు తరలించే క్రమంలో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీలో చూపనున్నది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల దాకా తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా ఆరు ప్రాంతీయ భాషల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రసారం కానుండగా, మనుషులు, మెషీన్లు కలిసి అసాధ్యమనుకున్న కార్యాన్ని ఏ విధంగా సుసాధ్యం చేశాయో తెలుసుకోవాలంటే వీక్షించాలని చెబుతున్నది.
న్యూయార్క్ టైమ్స్‌లో ఘనకీర్తి..
మానవ అద్భుత నిర్మాణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకున్నది. అందులో భాగంగా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో భూగర్భంలో గాయత్రీ పంప్‌హౌస్ నిర్మాణమైంది. ప్రపంచంలో అతిపెద్దవైన 139 మెగావాట్ల బాహుబలి మోటర్లతో 111 మీటర్లకు ఎత్తిపోస్తుండగా, గాయత్రీ పంప్‌హౌస్ ఘనతను 2019 ఆగస్టు 17న న్యూయార్క్ టైమ్స్ ప్రపంచానికి తెలిపింది. న్యూయార్క్ కూడలిలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై మూడు రోజులపాటు రోజుకు ఐదు సార్లు చొప్పున కథనాల్ని ప్రసారం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని, గాయత్రీ పంప్‌హౌస్ ఘనతను, విశిష్టతలను వివరించింది. ప్రపంచంలో గొప్ప ఇంజినీరింగ్ కళాఖండమని వర్ణించింది.