e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home కరీంనగర్ టూరిజం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

టూరిజం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

టూరిజం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

కరీంనగర్‌పై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం
నగర రూపురేఖలు మారుస్తున్నాం
ఏడేండ్లలోనే యాభైఏండ్ల అభివృద్ధి
ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు స్పెషల్‌ డ్రైవ్‌
మంత్రి గంగుల కమలాకర్‌

నాకా చౌరస్తా, తెలంగాణచౌక్‌, ఐబీ చౌరస్తాల్లో సుందరీకరణ పనులకు శ్రీకారం
కార్పొరేషన్‌, జూన్‌ 23: సమీప భవిష్యత్‌లో కరీంనగర్‌ను టూరిజం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. నాకా చౌరస్తా, తెలంగాణ చౌక్‌, ఐబీ చౌరస్తాలో రూ. 50 లక్షలతో చేపడుతున్న సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బల్దియా ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన ప్రతిహామీని నెరవేర్చేందుకు కర్తవ్యదీక్షతో పనిచేస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమాభిమానం ఉన్నదని, అడిగిన వెంటనే నిధులు ఇస్తున్నారని కొనియాడారు.
2014కు ముందు నగరం ఎలా ఉన్నది.. ఇప్పుడు ఎట్లా ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమైక్య పాలనలో ఎప్పుడో ఒకసారి నిధులు వచ్చేవని, వీటితో ఒకటి, రెండు పనులు మాత్రమే చేసే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.
ఉద్యమ నేతే ముఖ్యమంత్రి కావడం అదృష్టం
రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమన్నారు. ఏడేండ్లలో వేల కోట్లు నిధులిచ్చి నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. నగరంలోని 14 కిలోమీటర్ల మేర గల ప్రధాన రహదారులన్నీ కళకళలాడుతున్నాయన్నారు. డివిజన్లలోని అంతర్గత రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. మరో 20 ఏండ్ల దాకా ఇబ్బంది ఉండదన్నారు. అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి తెలంగాణ చౌరస్తాను సుందరీకరిస్తున్నామని పేర్కొన్నారు.
అభివృద్ధితో సమాధానం చెబుతాం..
చిత్తశుద్ధితో ప్రగతి పనులు చేపడుతున్నామన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని, అభివృద్ధితోనే వారికి సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. నిత్యం నీరందించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని చెప్పారు. కేబుల్‌ బ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్‌ పనుల్లో వేగం పెంచి సత్వరమే పూర్తి చేస్తామన్నారు. అధికారమిచ్చిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయబోమని చెప్పారు. మట్టి రహిత రోడ్లే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
నగరం నడిబొడ్డున పీవీ విగ్రహం..
మన జిల్లాకు చెందిన మాజీ ప్రధానీ పీవీ నర్సింహారావు దేశం గర్వించే వ్యక్తి అని మంత్రి గంగుల కొనియాడారు. ఆయన గౌరవాన్ని ఇనుమడింపజేసేవిధంగా నగరం నడిబొడ్డు( తెలంగాణచౌక్‌)న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీవీ జయంతి సందర్భంగా ఈ నెల 28న భూమిపూజ చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడం..
తెలంగాణ ప్రయోజనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీపడబోరని స్పష్టం చేశారు. ఇరు రాష్ర్టాలు గోదావరి నీటిని పరిపూర్ణంగా వినియోగించుకొందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి చెప్పారని, అయినా వినకుండా ఆర్డీఎస్‌ నుంచి దౌర్జన్యంగా నీటిని తరలించడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం దిగిరాకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు వాల రమణరావు, బోనాల శ్రీకాంత్‌, దిండిగాల మహేశ్‌, కంసాల శ్రీనివాస్‌, బుచ్చిరెడ్డి ఉన్నారు.
‘స్మార్ట్‌’ పనుల్లో వేగం పెంచాలి
కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో స్మార్ట్‌సిటీ పనులు, పట్టణ ప్రగతి, హరితహారంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. రాజీవ్‌చౌక్‌ నుంచి గాంధీరోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, రాజా థియేటర్‌ నుంచి బొమ్మ వెంకన్న ఇంటి వరకు ఉన్న రోడ్డు పనులు , కలెక్టరేట్‌, స్టేడియం, శాతవాహన యూనివర్సిటీ రోడ్లలో మిగిలిన పనులను సత్వరమే పూర్తిచేయాలన్నారు. చౌరస్తాల సుందరీకణ పనుల్లో వేగం పెంచాలని కోరారు. స్లాటర్‌ హౌస్‌ను మరోచోటకు తరలించాలని సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటవెంటనే చెల్లించాలన్నారు. డంప్‌యార్డ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రోడ్లపై చిన్న చిన్న పనులను అసంపూర్తిగా వదిలేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈవిషయంపై దృష్టి పెట్టాలని సూచించారు. నగరానికి మంజూరైన మూడు సమీకృత మార్కెట్ల పనులను ప్రారంభించాలని, పార్కుల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. స్మార్ట్‌సిటీ-2 పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. వానకాలంలో రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలన్నారు. హరితహారంలో గుర్తించిన చోట్ల మొక్కలు నాటి నగరాన్ని పచ్చలహారంగా తీర్చిదిద్దాలని చెప్పారు. రోడ్ల డివైడర్లలో కోనా కార్పస్‌ మొక్కలు నాటాలన్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు నెలపాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రెండు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు, కూరగాయాలను నిర్ణీత మార్కెట్లలోనే అమ్ముకునేలా చర్యలు చేపట్టాలన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టూరిజం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం
టూరిజం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం
టూరిజం, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

ట్రెండింగ్‌

Advertisement