బుధవారం 03 మార్చి 2021
Karimnagar - Feb 23, 2021 , 03:14:00

మల్లికార్జున్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి

మల్లికార్జున్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి

  • సేంద్రియ సాగుతో అధిక దిగుబడి 
  • సాఫ్ట్‌వేర్‌ రైతును సన్మానించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

చొప్పదండి, ఫిబ్రవరి 22: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్న మల్లికార్జున్‌రెడ్డిని యువరైతులు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. మండలంలోని పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన మావురం  మల్లికార్జున్‌రెడ్డి జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక కాగా  సోమవారం ఎమ్మెల్యే వెళ్లి సన్మానించారు. మల్లికార్జున్‌రెడ్డి చేస్తున్న సేంద్రియ సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సేంద్రియ పద్ధతిలో తీరొక్క పంటలు సాగు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. యువరైతు జాతీయ స్థాయి అవార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. సమీకృత వ్యవసాయంతో పాటు అంజీర, డ్రాగన్‌ ఫ్రూట్స్‌, అరటి, బొప్పాయి తదితర పంటలు సాగు చేయడంతో పాటు ఆవులు, మేకలు, బర్రెలు, చేపలు పెంచుతూ పాతరోజులను గుర్తుకు తెచ్చాడని అభినందించారు.  నియోజకవర్గంలోని రైతులు  మల్లికార్జున్‌రెడ్డి సలహాలు పాటిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏడీఏ రామారావు, సింగిల్‌విండో చైర్మన్‌ మినుపాల తిరుపతిరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, నాయకులు మాచర్ల వినయ్‌, కళ్లెం రవీందర్‌రెడ్డి, మావురం మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సన్మానం

పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు మావురం మల్లికార్జున్‌రెడ్డిని కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మల్లికార్జున్‌రెడ్డి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. 


VIDEOS

logo