శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Karimnagar - Feb 23, 2021 , 03:14:34

చీడ పీడల నుంచి కాపాడుకుందాం

చీడ పీడల నుంచి కాపాడుకుందాం

యాసంగి వరి నాట్లు పూర్తయి దాదాపు నెల దాటింది. మరికొన్ని రోజుల్లో పొట్టదశకు రానున్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వచ్చే చీడ పీడలతో పంట నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు   ఎస్‌ శ్రీధర్‌, దేవ అనిల్‌ వివరిస్తున్నారు.      

 కాల్వశ్రీరాంపూర్‌, ఫిబ్రవరి 22:ప్రస్తుతం వరి పైర్లు కొన్ని ప్రాంతాల్లో పిలకలు వేసే దశ నుంచి దుబ్బుకట్టే దశలో, కొన్ని ప్రాంతాల్లో దుబ్బుకట్టిన దశ నుంచి పూత దశలో ఉన్నాయి. కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ (15 డిగ్రీల సెల్సియస్‌), పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుండడం వల్ల వివిధ దశల్లో ఉన్న వరి పైర్లు ఎర్రబడడం, ఎదగక పోవడం, పిలకలు వేయకపోవడం, జింకుధాతులోపం, అగ్గి తెగులు వంటి ప్రధాన సమస్యలు కనిపిస్తాయి. వీటికి అదనంగా కొన్ని ప్రాంతాల్లో కాండం తొలిచే పురుగు, రెల్లరాల్చే పురుగు ఆశిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని రైతులు కొన్ని మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు పొందే అవకాశముంటుంది.  

తెగుళ్లు.. నివారణ చర్యలు

వరి పైర్లు ఎర్రబడడం : చలి ఉధృతి వల్ల నేల నుంచి పోషకాలు అందక మొక్కలు ఎర్రబడుతాయి. దీని నివారణకు కార్బండిజమ్‌+మ్యాంకోజెబ్‌ 2.5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి, 7-10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

తుప్పురంగు మచ్చలు : జింకు లోపం వల్ల వరి ఆకుల మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి ఎదుగుదల లోపిస్తుంది. దీని నివారణకు 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. సాయంత్రం వేళల్లో పొలానికి నీళ్లు పెట్టి, ఉదయం తీసివేసి కొత్తనీరు పెట్టాలి.

అగ్గితెగులు: ప్రస్తుతం వరి పైర్లు పిలకలు వేసే దశ నుంచి దుబ్బు చేసే దశలో ఉన్నందున అగ్గి తెగులు లక్షణాలు కనిపిస్తాయి. వెన్నులు బయటకు వచ్చిన తర్వాత గింజలు పాలు పోసుకునే సమయంలో మెడవిరుపు తెగులు ఆశించే అవకాశముంది. ముఖ్యంగా ఆకుల పైన నూలుకండె ఆకారంలో మచ్చలు ఏర్పడి, ఆ మచ్చల అంచులు ముదురు గోధుమరంగు లేదా నలుపురంగులో ఉండి, మచ్చల మధ్య భాగం బూడిద లేదా తెలుపురంగులో ఉంటుంది. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి, దూరం నుంచి చూస్తే తగలబడినట్లు కనిపిస్తుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్‌ +మ్యాంకోజెబ్‌ 2.5 గ్రాములు లేదా ఐసోప్రోథాయొలిస్‌ 1.5 మిల్లీ లీటర్లు, కాసుగామైసిస్‌ 2.5 మి.లీ, లీటరు నీటి 10-15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

కాండం తొలిచే పురుగు (మొగిపురుగు): వరిపైర్లు పిలకలు వేసే దశ నుంచి దుబ్బు చేసే దశలో ఉన్నప్పుడు మొగిపురుగు ఉధృతి ఉంటుంది. దీని నివారణకు పిలకల నుంచి దుబ్బు చేసే దశలో ఉన్న వరి పైర్లలో నాటిన 30 రోజుల్లోపు కార్బోప్యూరాన్‌ 3జీ గుళికలు 10 కిలోలు లేదా కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 4 జీ 8 కిలోలు లేదా, క్లోరాంతోనిలిప్రోల్‌ 0.4జీ గుళికలు 4 కిలోలు నీరు పలుచగా ఉంచి పొలం అంతటా సమానంగా చల్లాలి. 40-45 రోజులు దాటిన వరి పైర్లలో అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఉన్న చోట కాండం తొలిచే పురుగు ఆశిస్తే కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌పీ రెండు గ్రాములు లేదా, క్లోరాంతోనిలిప్రోల్‌ 20 ఎస్‌పీ 0.3 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

రెల్లరాల్చుపురుగు : కొన్ని ప్రాంతాల్లో పిలకలు వేసే దశలో ఇది ఆశిస్తుంది. 3-4 దశల్లోని లార్వాలు రాత్రిపూట ఆకులను ఆశించి నష్టపరుస్తాయి. దీనివల్ల పొలంలో ఆకుల చివర్లు నీటిలో తేలియాడుతూ కనిపిస్తాయి. ఈ పురుగు నివారణకు క్లోరో ఫైరిఫాస్‌ 50 ఈసీ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఫ్లుబెండమైడ్‌ 0.1మిల్లీ లీటరు లేదా, ప్రొఫెనోఫాస్‌ 2 మిల్లీ లీటర్లు లేదా, క్లోరాంతోనిలిప్రోల్‌ 20 ఎస్పీ 0. 3మిల్లీ లీటర్లను లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. వరి వేసిన రైతులు తెగుళ్లను ఎప్పటి కప్పుడు గమనిస్తూ ఉండాలి.

VIDEOS

logo