శనివారం 06 మార్చి 2021
Karimnagar - Jan 27, 2021 , 02:45:33

జయహే

జయహే

  • ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు
  • వాడవాడనా త్రివర్ణ పతాక రెపరెపలు
  • జెండాలు ఎగురవేసిన మంత్రి గంగుల, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు 
  • స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
  • ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు
  • ఆకట్టుకున్న వివిధ శాఖల స్టాళ్లు
  • ప్రత్యేక ఆకర్షణగా మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిళ్లు

ఉమ్మడి జిల్లాలో ‘గణ’తంత్ర వేడుకలు అంబరాన్నంటాయి.. వాడవాడనా త్రివర్ణ పతాకాలురెపరెపలాడాయి.. మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లోని కేసీఆర్‌ భవన్‌, తన కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేశారు. కరీంనగర్‌లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌, జగిత్యాలలోని ఖిల్లా, రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శశాంక, గుగులోత్‌ రవి, కృష్ణభాస్కర్‌, పెద్దపల్లి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, ఉత్తమ సేవలు అందించిన అధికారులకుప్రశంసాపత్రాలు అందజేశారు. వివిధ శాఖల స్టాళ్లు ఆకట్టుకోగా, ఆయాచోట్ల ఆహూతులకు మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిళ్లు అందించారు. కరోనా నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్క జగిత్యాల మినహా ఎక్కడా నిర్వహించలేదు. 

- కరీంనగర్‌, జనవరి 26(నమస్తే తెలంగాణ)/కమాన్‌చౌరస్తా

ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్రాభివృద్ధి

  • అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత  
  • అనుక్షణం శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం 
  • కరీంనగర్‌ కలెక్టర్‌ కే శశాంక

కరీంనగర్‌, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో సంక్షేమం, సమగ్రాభివృద్ధి సాధిస్తున్నామని, అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్‌ కే శశాంక పేర్కొన్నారు. కరీంనగర్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి అనుక్షణం శ్రమిద్దామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మనందరం కోరుకునే బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నదని, రైతుబంధు కింద యాసంగిలో ఇప్పటివరకు 1,67,941 మంది రైతుల ఖాతాల్లో 174.68 కోట్ల సాయాన్ని జమ చేసినట్లు చెప్పారు. రైతుబీమా కింద 176 కుటుంబాలకు 8.08కోట్లు అందించామని, 16.72 కోట్లు వెచ్చించి 76 రైతు వేదికలు నిర్మించినట్లు వివరించారు. 726 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు 2.15 కోట్ల చేప విత్తనాలను అందించామని, ఈ యేడాది 6,060 టన్నుల చేపల ఉత్పత్తే లక్ష్యంగా మత్స్య శాఖ పని చేస్తున్నదని చెప్పారు. ఎల్‌ఎండీలో రొయ్యల ఉత్పత్తి జరుగుతున్న విషయాన్ని కలెక్టర్‌ గుర్తు చేశారు. జిల్లాలో 118 మంది మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించామన్నారు. జిల్లాలోని వాగులపై ఇప్పటివరకు 59 కోట్లతో 11 చెక్‌ డ్యాంలు పూర్తి చేశామని, మరో 290 కోట్లతో 36 చెక్‌ డ్యాంలు మంజూరు చేశామని వెల్లడించారు. కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయిన 21,410 మంది వీధి వ్యాపారులకు ఆత్మ నిర్భర్‌ నిధి నుంచి బ్యాంకుల ద్వారా రుణాలు అందించామన్నారు. జిల్లాలో 1,202 కోట్లతో 1,683 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చామని, స్మార్ట్‌ సిటీగా ఎంపికైన కరీంనగర్‌లో 1,878 కోట్లలో మొదటి విడుతగా మంజూరైన 267 కోట్లతో 12 ప్రాజెక్టుల పనులు త్వరలో పూర్తి కావస్తున్నాయన్నారు. సీఎం హామీ పథకం కింద వచ్చిన 347 కోట్ల నిధులతో నగరంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, 10 మండలాల్లో పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మేయర్‌ సునీల్‌ రావు, సీపీ కమలాసన్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ క్రాంతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.


VIDEOS

logo