ఆదివారం 07 మార్చి 2021
Karimnagar - Jan 26, 2021 , 04:21:22

తీరొక్క పంట యంత్ర సేద్యం

తీరొక్క పంట యంత్ర సేద్యం

 • ఉమ్మడి జిల్లా రైతుల సదస్సులో అందరి మాటా ఇదే..
 • సమీకృత సేద్యం, యాంత్రీకరణ,  పాడి, ఇతర ఆదాయ రంగాలపై లోతైన చర్చ
 • క్షేత్రస్థాయి అంశాలపై వివరించిన వ్యవసాయ విద్యార్థులు
 • అనుభవాలను పంచుకున్న కర్షకులు
 • వరి తగ్గించి, తీరొక్క పంటలు వేసుకోవాలని సలహా
 • పాడి, ఇతర రంగాలతో అదనపు ఆదాయం పొందాలని సూచన
 • ‘సాంకేతికత’ను జోడించాలన్న అధికారులు
 • అధునాతన యంత్రాలను చూసి అబ్బురపడిన రైతులు

ఎవుసమంటే వరి ఒక్కటే కాదు.. మూస పద్దతి అంతకన్నా కాదు.. తీరొక్క పంటల మేళవింపు.. ఇది అనుభవజ్ఞులైన రైతులు, బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట! ఉమ్మడి జిల్లా రైతులు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల విద్యార్థులతో కరీంనగర్‌లోని ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థానంలో సోమవారం నిర్వహించిన రైతు సదస్సులో ఇదే ముచ్చట వినిపించింది. సమీకృత సేద్యం, యాంత్రీకరణ, పాడి, ఇతర ఆదాయ రంగాలపై లోతైన చర్చ జరగ్గా, రైతులు, విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. వరి సాగు తగ్గించి తీరొక్క పంటలు వేసుకోవాలని, అదనపు ఆదాయం కోసం అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని ఇతర రైతులకు సూచించారు. సరికొత్తగా సాగాలని, సాంకేతికతను జోడించి సేద్యం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని అధికారులు అవగాహన కల్పించారు.

- కరీంనగర్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/ కొత్తపల్లి


కరీంనగర్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/కొత్తపల్లి: కరీంనగర్‌లోని పద్మనగర్‌లో గల వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ అనుభవాలను వివరించగా, బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థులు క్షేత్ర స్థాయిలో వారు తెలుసుకున్న అంశాలను తెలిపారు. అధికారులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకుముందు వరి నాటు యంత్రం, డ్రోన్‌ స్ప్రేయర్‌, భూమ్‌ స్ప్రేయర్‌ తదితర యంత్రాలను సదస్సులో ప్రదర్శించారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని తెలియజేస్తూ పలు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వ్యవసాయ యంత్రాలు, స్టాల్స్‌ రైతులను ఆకట్టుకున్నాయి. 

సేంద్రియ  సేద్యంతో లాభం.. 

సేంద్రియ సేద్యం ద్వారా రైతులు పెట్టుబడులు తగ్గించుకోవడంతోపాటు అధిక దిగుబడి సాధించే అవకాశమున్నది. దీనిపై ఫీల్డ్‌ ట్రైనింగ్‌లో రైతులకు పూర్తి అవగాహన కల్పించాం. సేంద్రియంగా తయారు చేసుకున్న వర్మి కంపోస్టు ద్వారా నేల కలుషితం కాదు. రైతులు తమ పొలం వద్దే సులభంగా ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇది ఉద్యానవన పంటలకు బాగా పనిచేస్తుంది. పంట కోతల తర్వాత పొలంలో మిగిలిన గడ్డి, పెంటను ఉపయోగించి ఎరువును తయారు చేసుకుంటే తర్వాత పంటకు ఉపయోగపడుతుంది. 

- ఏ తనూజ, వ్యవసాయ కళాశాల (జగిత్యాల) 

జంట సాళ్ల పద్ధతి ఎంతో మేలు

మక్కపంటలో జంట సాళ్ల పద్ధతిని పాటిస్తే రైతులు మరింత దిగుబడిని సాధించే అవకాశాలు ఉంటాయి. 20 మీటర్ల పరిధిలో రెండు వరుసల్లో విత్తనాలు నాటుకోవడం, ఆ తర్వాత 90 సెంటీమీటర్ల పరిధిలో మరో రెండు వరుసల్లో విత్తనాలు వేసుకోవడం వల్ల మొక్కలన్నింటికీ సూర్యరశ్మి బాగా తగిలి కీటకాలు నశిస్తాయి. ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. ఈ పద్ధతిలో మొక్కలకు ఫర్టిగేషన్‌ (మందులను చల్లడం) సులభంగా మారుతుంది. కూలీల సంఖ్య చాలా తగ్గుతుంది. 

- కే సుమ, వ్యవసాయ కళాశాల (రాజేంద్రనగర్‌) 

అగ్రగామిగా కరీంనగర్‌ జిల్లా

కరీంనగర్‌ జిల్లా వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్నది. కుటుంబాల అభివృద్ధి, ఆదాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. సాగుకు సాంకేతికత జోడించి, రైతులను రాజులుగా మార్చడంలో వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయం. నెలల తరబడి కష్టపడి మంచి వంగడాలను అందించడంలో వారి శ్రమ మరువలేనిది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గతంలో కంటే రెండింతలు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం గర్వకారణం. శాస్త్రవేత్తలు జరిపే పరిశోధనలను సద్వినియోగం చేసుకొని జిల్లాకు చెందిన రైతులు ఇతర జిల్లాలకు వెళ్లి వ్యవసాయ పద్ధతులు నేర్పించే స్థాయికి చేరడం అభినందనీయం. రైతులు సాగులో సేంద్రియ పద్ధతులను పాటించి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న క్రమంలో శ్రమ, కూలీల సంఖ్యను తగ్గించేందుకు యంత్రాల వినియోగం పెరుగాల్సి ఉన్నది. ఇతర దేశాలు, రాష్ర్టాలకు చెందిన రైతులతో పోటీ పడి ఆర్థికంగా మన రైతులు వృద్ధి చెందాలి. 

- కె శశాంక, కలెక్టర్‌, కరీంనగర్‌ జిల్లా.

మెకానికల్‌ ప్లాంటర్‌ 

పల్లి, శనగ, మక్క, పెసర, బబ్బెర ఇలా అనేక రకాల ఆరుతడి పంటలు విత్తుకునేందుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. జాన్‌డీర్‌ కంపెనీ రూపొందించిన ఈ యంత్రం  మార్కెట్లో 84 వేలకు దొరుకుతుంది.

వరి నాటు యంత్రం 

వరి సాగుకు కూలీల కొరత విపరీతంగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు డ్రమ్‌ సీడర్‌ వినియోగిస్తుండగా, మరి కొందరు వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వరి నాటు యంత్రాలు అందుబాటులోకి రాగా, కోరమాండల్‌ కంపెనీ యాన్మార్‌ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది నేల స్వభావాన్ని బట్టి గంటన్నర నుంచి 2 గంటల్లో ఎకరం నాటు వేస్తుంది. మార్కెట్‌లో దీని విలువ 13.50 లక్షలు.

మంకీ గన్‌ 

ఇప్పుడు ఎక్కడ చూసినా కోతుల బెడద ఉంది. దీంతో రైతులు అపరాలు, కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగుకు ముందుకురావడం లేదు. ఈ క్రమంలో కోతులను తరిమేందుకు మంకీ గన్‌ అందుబాటులోకి వచ్చింది. దీని ధర 5,500.

డ్రోన్‌ స్ప్రేయర్‌ 

ప్రస్తుతం రైతులు తైవాన్‌, ఇతర స్ప్రేయర్ల వెన్నుకు తగిలించుకుని పిచికారీ చేస్తున్నారు. ఇలా చేస్తే ఎకరానికి గంటల తరబడి సమయం వెచ్చించడమే కాకుండా, అనేక ఇబ్బందులు ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు కంపెనీలు డ్రోన్‌ స్ప్రేయర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ డ్రోన్‌ స్ప్రేయర్‌ మారుట్‌ కంపెనీ రూపొందించింది. దీని ధర 5 లక్షలు. ఇది గంటలో ఎకరం కంటే ఎక్కువ స్ప్రే చేస్తుంది. 

భూమ్‌ స్ప్రేయర్‌ 

చేనులో పురుగు మందుల పిచికారీకి ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమ్‌ స్ప్రేయర్‌ను సదస్సులో ప్రదర్శించారు. శక్తిమాన్‌ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన ఈ యంత్రం ఖరీదు 2 లక్షలు. నేల స్వభావాన్ని బట్టి గంటలో నాలుగైదు ఎకరాల్లో స్ప్రేచేసే శక్తి సామర్థ్యం ఈ యంత్రానికి ఉంది.

రైతుల అనుభవాలు..

 • చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లికి చెందిన రైతు మల్లికార్జున్‌ సమీకృత వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని, తన క్షేత్రంలో ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్లు చెప్పారు. ఎంత సేపు వరి సాగుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట నష్టపోయినా అనుబంధ వ్యవసాయం ఆదుకునే విధంగా ప్రణాళికలు రూపొందించు కోవాలని, దీని కోసం గొర్రెలు, మేకలు, పశువు లు, కోళ్ల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు.
 • తాను 120 దేశవాళీ వరి వంగడాలతో ప్రయోగాలు చేస్తున్నానని ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన రైతు శ్రీకాంత్‌ చెప్పారు. మెడిసిన్‌ వాల్యూమ్స్‌ ఉన్న వంగడాలతో సమాజానికి మేలు జరుగుతుందని, అందులో ప్రధానమైనది మ్యాజిక్‌ రైస్‌ అని తెలిపారు.
 • వ్యవసాయ రంగంలో వరి నాటు యంత్రాలు తీసుకురావాలని, వెద జల్లే విధానాన్ని ప్రోత్సహించాలని గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన రైతు కిషన్‌ కోరారు. విద్య, పరిశోధన, విస్తరణ నినాదంతో వ్యవసాయం    చేయాలని, పరిశోధనా ఫలితాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని మరో రైతు వెంకటరెడ్డి సూచించారు.

అధికారుల సలహాలు సూచనలు..

 • జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (రీసెర్చ్‌) డాక్టర్‌ పీ జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ, ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా భూములు నల్లబారుతున్నాయని, నేలపై గడ్డిని కాల్చడం వల్ల కొన్ని కోట్ల సూక్ష్మజీవులు నశించి పోతున్నాయన్నారు. 
 • కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త కే వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ, రైతులు తమ అనుభవానికి శాస్త్ర సాంకేతికతను జోడించాలని సూచించారు. విద్యార్థులు దేశ రైతాంగానికి అండగా ఉండాలని కోరారు. 
 • కరీంనగర్‌ డీఏవో వాసిరెడ్డి శ్రీధర్‌ మాట్లాడుతూ, వరి సాగును తగ్గించుకోవాలని, ఏ పంట వేసుకుంటే అమ్ముకోగలుగుతామో ఆలోచించాలని రైతులకు సూచించారు. అపరాలు, నూనె గింజల సాగు లాభసాటిగా మారబోతున్నదని చెప్పారు. సాగులో యాంత్రీకరణను పెంచేందుకు వచ్చే బడ్జెట్‌లో కస్టమ్స్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్నారు.

పరిశోధనలు మరింత పెరగాలి..

వ్యవసాయరంగంలో కొత్త కొత్త పద్ధతులు తీసుకురావడం సంతోషకరం. సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించడం ద్వారా తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి ద్వారా ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఇదే సమయంలో ఫలాలపై పరిశోధనలు జరుగాలి. ఇప్పటికీ పాత కాలంలోని పంటల సాగుపైనే మనం ఎక్కువగా దృష్టిసారించాం. మామిడిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడులు వచ్చే కొత్త వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు దృష్టిసారించాలి. వాణిజ్య పంటల సాగుతో రైతులు అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.

- మంద రాయమల్లు, రైతు సంఘం నాయకుడు గోపాల్‌పూర్‌ (కరీంనగర్‌ మండలం) 

సదస్సులతో రైతులకు మేలు

వ్యవసాయ అధికారులు, శాస్త్ర సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తల సమక్షంలో జరిగిన ఇలాంటి సదస్సులు రైతులకు మేలు చేస్తాయి. ఎందుకంటే వ్యవసాయంలో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులే పాటిస్తున్నాం. శాస్త్ర సాంకేతికంగా వచ్చిన ఎన్నో విధానాలపై రైతులకు సరైన అవగాహన ఉండడం లేదు. కొత్తగా వచ్చిన యంత్రాలతో వ్యవసాయం చాలా సులువవుతుందని తెలిసింది. ఇక్కడికి రావడం వల్లే అలాంటి యంత్రాలున్నాయని తెలిసింది. మండలాల వారీగా రైతులతో ఇలాంటి ప్రదర్శనలు చేస్తే బాగుంటుంది. కొత్తగా వచ్చిన యంత్రాలతో కూలీలు చాలా తక్కువగా అవసరమవుతారు. సమయం కూడా వృథా కాదు. 

- నారదాసు భూమారావు, మొగిలిపాలెం (తిమ్మాపూర్‌ మండలం) 

యాంత్రీకరణను స్వాగతిస్తున్నాం

వ్యవసాయంలో కొత్తగా వస్తున్న యాంత్రీకరణను రైతులుగా మేం స్వాగతిస్తున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్‌, అందుబాటులో సాగునీరు ఉండడంతో గత ఐదేళ్ల నుంచి వ్యవసాయరంగానికి పూర్వవైభవం వచ్చింది. వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. పంటల దిగుబడి సైతం రెండింతల నుంచి ఐదింతలు పెరిగింది. సాగు విస్తీర్ణం పెరిగిన కారణంగా యాంత్రీకరణ వినియోగం కూడా తప్పకుండా పెరగాలి. పెరిగిన విస్తీర్ణానికి కూలీలు ఏ మాత్రం సరిపోరు. అప్పుడే నిర్ణీత సమయంలో నాట్లు, ఎరువుల వాడకం, పంట కోత తదితర పనులు సకాలంలో జరిగి దిగుబడులు మరింత పెరుగుతాయి. ఇప్పుడిప్పుడే రైతుల యాంత్రికీకరణవైపు ఆసక్తి చూపుతున్నారు. 

- వరాల సుధాకర్‌, తాడిజెర్రి (గంగాధర మండలం)


VIDEOS

logo