సోమవారం 08 మార్చి 2021
Karimnagar - Jan 25, 2021 , 02:16:31

జోరుగా వరిసాగు

జోరుగా వరిసాగు

  • మెట్టప్రాంతంలో పెరిగిన భూగర్భజలాలు
  • ఇప్పటికే తొమ్మిది వేల ఎకరాల్లో నాట్లు
  • మొత్తం విస్తీర్ణం 15,500 ఎకరాలకు పెరిగే అవకాశం

 సైదాపూర్‌, జనవరి 24; మెట్టప్రాంతమైన మండలంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడం, భూగర్భ జలాలు పెరుగడంతో యాసంగి వరి సాగు జోరందుకున్నది. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతాంగం నాట్లు వేయడంలో నిమగ్నమవగా, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నది. కాగా, వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత యాసంగిలో మండలంలో 12,300 ఎకరాల్లో వరి సాగుకాగా, ప్రస్తుతం ఇప్పటి వరకే సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో నాట్లు వేశారు. మరో 3,200 ఎకరాల్లో రైతులు వరి వేసేందుకు సిద్ధంగా ఉండగా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం 15,500 ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది. నీటి లభ్యత పెరుగడంతో రైతులు ఎక్కువగా వరి పండించేందుకే మొగ్గు చూపుతున్నారు. కాగా, గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత నెలకొన్నది. ఈ క్రమంలో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేలా తోడ్పాటునందిస్తున్నారు. ఏఈవోలు తమ క్లస్టర్‌ పరిధిలోని రైతులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు.

పండ్ల తోటలను తొలగించి..

గతంలో మండలంలోని రైతులు వరితో పాటు మక్కజొన్న, పత్తి పంటలు సాగు చేసేవారు. కానీ ఇటీవల భూగర్భజలాలు పెరుగడంతో పండ్ల తోటలను సైతం తొలగించి వరి సాగుకు అనుకూలంగా అచ్చుకట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగుబడి అధికంగా వస్తుండడంతో రైతులు ఎక్కువగా వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారు.

సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది

మండలంలో గతేడాది కంటే వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. భూగర్భ జలాలు పెరుగడం, దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. సాగులో వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నాం. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం.

- వైదేహి, మండల వ్యవసాయాధికారి (సైదాపూర్‌)


VIDEOS

logo