బుధవారం 03 మార్చి 2021
Karimnagar - Jan 24, 2021 , 04:01:31

ఉనికిలోకి ట్రిబ్యునల్‌

ఉనికిలోకి  ట్రిబ్యునల్‌

భూసమస్యల పరిష్కారానికి శ్రీకారం 

రెండు రోజులుగా 40 కేసుల విచారణ 

ప్రత్యేక చొరవ తీసుకుంటున్న కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక 

పరిష్కారమయ్యే వరకు నిరంతరం కొనసాగింపు

కరీంనగర్‌, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : భూ సమస్యలను సత్వరం పరిష్కరించి, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతకు ముందు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఇది వరకు ఆర్డీవోలు, జాయింట్‌ కలెక్టర్లు, కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ కోర్టులను రద్దు చేసింది. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. ఈ ప్రక్రియ తహసీల్‌ కార్యాలయాల్లో నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, పలు స్థాయిల్లోని రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు చైర్మన్లుగా, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సభ్యులుగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చట్టంలోని సెక్షన్‌ 16, 17 ప్రకారం ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసులను నెల వ్యవధిలో పరిష్కరించాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు ఇచ్చింది. కొత్త చట్టంలోని సెక్షన్‌-13 ప్రకారం ఈ కేసులను విచారించే అధికారాన్ని ట్రిబ్యునల్‌కు అప్పగించింది.

రెండు రోజులుగా విచారణ

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్‌ ప్రారంభమైంది. కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ రెండు రోజులుగా గతంలో రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను విచారిస్తున్నారు. శుక్రవారం 20, శనివారం మరో 20 కేసులను విచారించారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న ఇరు పక్షాలతోపాటు వారి తరుఫు న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇరు పక్షాలను విచారించి సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 35 ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని కేసులు ట్రిబ్యునల్‌ ముందుకు వచ్చాయి. వీణవంక మండలం చల్లూరుకు చెందిన చల్లూరి శ్రీహరి అనే రైతు ఇదే విషయాన్ని చెప్పారు. తమ 50 గుంటల భూమి పరిష్కారం కోసం ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులకు 35 ఏండ్ల నుంచి తిరుగుతున్నామని, ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో తమ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొన్ని ఉమ్మడి ఆస్తుల విషయంలో కూడా గతంలో రెవెన్యూ కోర్టుల్లో విచారణలు జరిగాయి. అలాంటి కేసులు కూడా ఇపుడు ట్రిబ్యునల్‌కు చేరాయి. నేరుగా కలెక్టర్‌ స్థాయి అధికారి విచారిస్తున్న నేపథ్యంలో తమ సమస్యలు తక్షణం పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని విచారణకు హాజరైన రైతులు హర్షం వ్యక్తం చేశారు.. 

పదేండ్లసంది తిరుగుతున్న

.. ఇతని పేరు జూనూతుల నారాయణరెడ్డి. వీణవంక మండలం బొంతుపల్లికి చెందిన ఇతనికి 12.10 ఎకరాలు ఉండగా, అందులో నుంచి 11.30 ఎకరాలు 1999లో అమ్ముకున్నాడు. అది పోఆగా మిగతా 20 గుంటలు అతని పేర ఉండాలి. కానీ, 10 గుంటలు మాత్రమే ఉన్నదని రెవెన్యూ రికార్డుల్లో ఉండడంతో 2012లో అప్పటి ఆర్డీవో కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఇక్కడ తిరుగుతుండగానే హుజూరాబాద్‌లో రెవెన్యూ డివిజనల్‌ ఏర్పాటు చేయడంతో కేసును అక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అక్కడా కొద్ది రోజులు తిరిగిన తర్వాత అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత జేసీ కోర్టుకు వెళ్లగా, అక్కడ విచారణ జరిగింది. తీర్పు వస్తుందనుకునే సమయంలో కరోనా రావడం, ఆ తర్వాత కొత్త చట్టం రావడంతో వాయిదా పడింది. ఇప్పుడు ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయడంతో విచారణ కోసం నారాయణరెడ్డి విచారణకు హాజరయ్యాడు. పది గుంటల భూమి కోసం పదేండ్లుగా తిరుగుతున్నానని, ట్రిబ్యునల్‌ ఏర్పడిన తర్వాత ఇప్పుడు నేరుగా కలెక్టర్‌ విచారిస్తున్నందున ఇప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నెల రోజులల్ల ఆర్డరిస్తమన్నరు 

నా కేసు విషయంల గతంల రెవెన్యూ కోర్టులో తప్పు జరిగింది. న్యాయం కోసం ఇంకో రెవెన్యూ కోర్టును ఆశ్రయించిన. కేసులకు వస్తుండంగనే కరోనా వచ్చింది. ఇప్పుడు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసిండ్రు. కలెక్టర్‌కు అప్పజెప్పుడు మంచి నిర్ణయం. ఆర్డీవో దగ్గర కొన్నేండ్లు, జేసీ దగ్గర కొన్నేండ్లు కేసు తెగకుండా ఉంచుడు మంచిదిగాదు. ఇప్పుడు కలెక్టర్‌ ఉంటరు. న్యాయం జరుగుతదన్న నమ్మకం పెరిగింది. నెల రోజుళ్ల ఆర్డరిస్తమన్నరు.

- కామిశెట్టి రమేశ్‌, జమ్మికుంట

VIDEOS

logo