సోమవారం 01 మార్చి 2021
Karimnagar - Jan 14, 2021 , 01:15:01

వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం

వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం

16న లాంఛనంగా ప్రారంభిస్తాం

వైద్యశాఖ పూర్తి సిద్ధంగా ఉంది

అందరూ సహకరించాలి

మంత్రి గంగుల కమలాకర్‌

వైద్యాధికారులతో సమీక్ష

విద్యానగర్‌, జనవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మేయర్‌ వై సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, వైద్యాధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. బుధవారం రాత్రిలోగా వ్యాక్సిన్లు జిల్లాకు చేరుతాయన్న ఆయన, వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు హెల్త్‌ కేర్‌ వర్కర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్య సిబ్బందికే మొదటి డోస్‌ అందిస్తామని, ఇందులో వైద్యులు, వైద్య సిబ్బంది, హెల్త్‌ వర్కర్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు ఉంటారని చెప్పారు. 28 రోజుల తర్వాత రెండో డోస్‌ ఉంటుందని తెలిపారు. రెండో విడత టీకాపై వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ నెల 18 నుంచి కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన 31 సెంటర్లు ప్రారంభిస్తామన్నారు. టీకా వేశాక అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని, ప్రతికూల ప్రభావాలు తలెత్తితే ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రజా ప్రజాప్రతినిధులంతా భాగస్వాములై, ప్రజలకు భరోసా ఇస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 12,419 మంది హెల్త్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించామని, వీరిలో 4,243 మంది ప్రభుత్వ దవాఖానల హెల్త్‌ కేర్‌ వర్కర్లు, 8,176 మంది ప్రైవేట్‌ హెల్త్‌ కేర్‌ వర్కర్లు ఉన్నారని చెప్పారు. మొదటి రోజు కరీంనగర్‌ జిల్లా ప్రధాన దవాఖాన, బుట్టిరాజారాంకాలనీ, హుజూరాబాద్‌ ప్రభుత్వ దవాఖానతోపాటు తిమ్మాపూర్‌ పీహెచ్‌సీలో 30 మంది చొప్పున మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ ఉండబోదని, ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని కోరారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌తో ఏమైనా ఇబ్బందులు, చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించినా ఎదుర్కొరేందుకు వైద్యులతో పాటు సకల సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ నెల 16న కరీంనగర్‌లో తాను, తిమ్మాపూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రారంభిస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వ్యాక్సిన్‌కు ఎలాంటి ఫీజు లేదని, అన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ డీఎంఅండ్‌హెచ్‌ఓ జీ సుజాత, డీఐఓ డాక్టర్‌ సాజీద, సూపరింటెండెంట్‌ రత్నమాల, ఆర్‌ఎంఓ శౌరయ్య, వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జిలు డాక్టర్‌ నాగ శేఖర్‌, డాక్టర్‌ జువేరియా, డాక్టర్‌ వసీం, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ నరేందర్‌, డాక్టర్‌ అలీం, డాక్టర్‌ నవీణ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సులోచన, ఏఓ నజీముల్లాఖాన్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ పుల్లెల సుధీర్‌, అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo