శుక్రవారం 22 జనవరి 2021
Karimnagar - Jan 14, 2021 , 01:14:58

అస్త్రం సిద్ధం.. ఇక కరోనా ఖతం

అస్త్రం సిద్ధం.. ఇక కరోనా ఖతం

జిల్లాలకు చేరిన టీకాలు

ఉమ్మడి జిల్లాకు 404 వాయిల్స్‌ 

కోల్డ్‌ చైన్‌ పాయింట్లలో భద్రం 

16న 14 సైట్లలో వ్యాక్సినేషన్‌  

18 నుంచి వంద సైట్లలో  రెగ్యులర్‌గా కార్యక్రమం

కరీంనగర్‌, జనవరి 13 (నమస్తే తెలంగాణ)/  విద్యానగర్‌ : కొవిడ్‌ మహమ్మారికి విరుగుడు వచ్చేసింది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌కు కొవిడ్‌ వ్యాక్సిన్‌ చేరుకున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నమే జిల్లాల వారీగా అధికారులు వ్యాక్సిన్ల కోసం హైదరాబాద్‌కు వాహనాలను పంపించారు. తిరిగి రాత్రి 11 గంటల వరకు జిల్లాకేంద్రాలకు చేరుకోగా, కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌లో వాయిల్స్‌ను భద్రపర్చారు. ఈ నెల 16న జిల్లాలోని ఎంపిక చేసిన 14 సైట్లలో వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో వాయిల్స్‌ను భద్రపరిచినట్లు కరీంనగర్‌ డీఎంహెచ్‌వో జీ సుజాత తెలిపారు. 

మొదటి రోజు 420 మందికి..

కరీంనగర్‌ జిల్లాలో 12,419 మంది, జగిత్యాలో 6,165 మంది, రాజన్న సిరిసిల్లలో 3,500 మంది, పెద్దపల్లిలో 4,700మంది.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 26,784 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు ఇప్పటి వరకు కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొదటి విడుతలో వీరికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయనున్నారు. శనివారం ఒక్కో సైట్‌లో 30 మంది చొప్పున.. మొత్తం 14 సైట్లలో 420 మందికి టీకా ఇవ్వనున్నారు. తొలి డోస్‌ ఇచ్చిన 28 రోజులకు రెండో డోస్‌ ఇస్తారు. 

18 నుంచి రెగ్యులర్‌గా..

వ్యాక్సినేషన్‌ కోసం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారంలో నాలుగు రోజులు అంటే.. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో టీకా వేయనున్నారు. శనివారం వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తారు. తర్వాత 18 నుంచి దాదాపు వంద సైట్లలో రెగ్యులర్‌గా టీకాలు వేస్తారు. ఒక్కో సైట్‌లో రోజుకు వంద మంది చొప్పున ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తికి ఇబ్బందులు తలెత్తితే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా కేటాయించిన దవాఖానలకు పంపించనున్నారు. జగిత్యాల జిల్లాలో జిల్లా ప్రధాన దవాఖానతోపాటు, మెట్‌పల్లి ఏరియా వైద్యశాలలో డిసినెటెడ్‌ ఏఈఐఎఫ్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఒక అంబులెన్స్‌తోపాటు ప్రతి కేంద్రంలో ఐదుగురు వైద్య సిబ్బంది భాగస్వాములు కానున్నారు. ప్రతి మూడు పీహెచ్‌సీలకు ఒక ప్రోగ్రాం ఆఫీసర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక కూడా మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీలకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా పొరపాట్లు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

404 వాయిల్స్‌..

మొదటి విడుతగా ఉమ్మడి జిల్లాకు 404 వాయిల్స్‌ వచ్చాయి. అందులో కరీంనగర్‌ జిల్లాకు 154, జగిత్యాల 84, పెద్దపల్లి 38, రాజన్న సిరిసిల్లకు 128 వాయిల్స్‌ చేరుకున్నాయి. ఒక్కో వాయిల్‌లో 10 డోస్‌లు ఉంటాయి. ఈ లెక్కన 4040 డోస్‌లు రాగా, ఒక్కొక్కరికీ 0.5 ఎంఎల్‌ చొప్పున ఇవ్వనున్నారు. వాయిల్స్‌ను జిల్లాల వారీగా పంపించారు. ఐస్‌లాండ్‌ రిఫ్రిజిరేటర్లలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగత్రల వద్ద వీటిని భద్రపరుస్తారు.

మొదటి రోజు వ్యాక్సినేషన్‌ సైట్లు ఇవే..

కరీంనగర్‌ జిల్లా : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన, బుట్టిరాజారాం కాలనీలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, హుజూరాబాద్‌లోని ఏరియా దవాఖాన, తిమ్మాపూర్‌ పీహెచ్‌సీ.  మొదట చల్మెడ, ప్రతిమ మెడికల్‌ కళాశాలను కూడా అనుకున్నా ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటి స్థానంలో హుజూరాబాద్‌, తిమ్మాపూర్‌ను ఎంపిక చేశారు.

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన, కోరుట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాలు.

రాజన్న సిరిసిల్ల : జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖాన, తంగళ్లపల్లి, వేములవాడ, ఇల్లంతకుంట పీహెచ్‌సీలు.  

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, గోదావరిఖని ఏరియా దవాఖాన, సుల్తానాబాద్‌ సీహెచ్‌సీ, లక్ష్మీపూర్‌(రామగుండం) యూపీహెచ్‌సీ.

నాలుగు కేంద్రాల్లో ప్రారంభిస్తాం..
వ్యాక్సినేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. తొలి దశ ప్రయోగాత్మకంగా నాలుగు కేంద్రాల్లో ప్రారంభిస్తాం. ఒక్కో సెంటర్‌లో 30 మంది చొప్పున వేస్తాం. ఈ మేరకు అవసరమైన వ్యాక్సిన్లను తెప్పిస్తున్నాం. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కారానికి ఏఈఎఫ్‌ఐ కిట్లు రెడీగా ఉంచాం. సిరిసిల్ల, వేములవాడ ఆరోగ్య కేంద్రాలలో 5 చొప్పున ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశాం. టీకా వేసే రోజు అన్ని విభాగాల వైద్యులు, నర్సులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి ఆరోగ్య కేంద్రాల్లో అంబులెన్సులు పెడుతున్నాం. 
- సుమన్‌మనోహర్‌రావు, డీఎంహెచ్‌వో (రాజన్న సిరిసిల్ల) 
సర్వం సిద్ధం చేశాం.. 
జగిత్యాల జిల్లాలో తొలిదఫా వ్యాక్సినేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే కలెక్టర్‌ రవి నేతృత్వంలో రెండు మూడు సార్లు సమీక్షా సమావేశాలు పూర్తి చేసుకున్నాం. మొదట ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేస్తున్నాం. 16న రెండు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా 60 మందికి వేస్తాం. తదుపరి 18 నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలతో పాటు, జగిత్యాల నర్సింగ్‌ కాలేజీలో టీకాలు ఇస్తాం. వ్యాక్సినేషన్‌లో పాల్గొనేందుకు సిబ్బంది, అధికారులు అందరూ ఉత్సాహంగా ఉన్నాం. 
- పుప్పాల శ్రీధర్‌, డీఎంహెచ్‌వో (జగిత్యాల)


logo