నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు

హాక్ఐ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
సీపీ కమలాసన్‌రెడ్డి
రాంనగర్, జనవరి 2: కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీరామనగర్‌లో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ఆయన కార్పొరేటర్, కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, రోడ్డు ఆవరణ, వెనుక వైపు ప్రాంతాలు కనిపించేలా ప్రతి ఇంటికి రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇంట్లో లేకున్నా నేర ఘటనలు జరిగితే నిక్షిప్తం అవుతాయన్నారు. ఇంటర్నెట్ ప్రొటక్షన్ బేస్డ్ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తామన్నారు. 40 ఇండ్లు ఉన్న శ్రీరాంనగర్ కాలనీవాసులు 30 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ హాక్ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. కార్పొరేటర్ గంట కల్యాణిశ్రీనివాస్, అదనపు డీసీపీ శ్రీనివాస్, టౌన్ ఏసీపీ అశోక్, ఇన్స్పెక్టర్లు విజ్ఞాన్‌రావు, విజయ్‌కుమార్, లక్ష్మణ్‌బాబు, ఎస్ఐలు రాము, అన్వర్, నరేశ్‌కుమార్, బ్లూకోల్డ్స్ పోలీసులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులున్నారు.