శుక్రవారం 05 మార్చి 2021
Karimnagar - Dec 08, 2020 , 01:23:29

వ్యవసాయ చట్టంతో రైతులకు నష్టం

వ్యవసాయ చట్టంతో రైతులకు నష్టం

  • భారత్‌ బంద్‌కు నాయకుల పిలుపు
  • చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు

కొత్తపల్లి: నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జడ్పీ మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కొత్తపల్లి బస్టాండ్‌ వద్ద ప్రధాని దిష్టిబొమ్మను రైతులతో కలిసి దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టం అమలైతే వ్యవసాయం కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లి నిత్యావసర ధరలు పెరుగుతాయన్నారు. నూతన చట్టాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, కేంద్రం వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బస్టాండ్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ చట్టాలను రద్దు చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి నాయకులు వెంకట్‌రెడ్డి, లింగారెడ్డి, కొత్త రాజయ్య, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కౌన్సిలర్లు మొండయ్య, రాంబాబు, వేణు, నజియా బాబా, సత్యనారాయణరెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ ఫక్రుద్దీన్‌, రైతులు పాల్గొన్నారు. 

భారత్‌ బంద్‌కు వ్యాపారుల సంఘం మద్దతు

కరీంనగర్‌ హెల్త్‌ : భారత్‌ బంద్‌కు వ్యాపారుల సంఘం మద్దతు ప్రకటిస్తున్నట్లు సిటీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు బంద్‌ చేసి రైతులకు మద్దతు తెలుపుతామన్నారు. 

ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం మద్దతు

కరీంనగర్‌ హెల్త్‌: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు రెండు నెలలుగా పోరాటాలు చేస్తున్నారని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కరీంనగర్‌ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్‌, ఆర్‌వీ రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టగా వారి శాంతియుత నిరసనలను కేంద్రం నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

టీజేఏసీ మద్దతు

తెలంగాణచౌక్‌:  భారత్‌ బంద్‌కు టీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తునట్లు జిల్లా చైర్మన్‌ జక్కోజు వెంకటేశ్వర్లు, కన్వీనర్‌ రవీందర్‌, కో-ఆర్డినేటర్‌ మాడుగల రాములు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ప్రజా వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. భారత బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. 

VIDEOS

logo