గురువారం 28 జనవరి 2021
Karimnagar - Dec 05, 2020 , 01:15:49

కొవిడ్‌ లక్షణాలా... సీజనల్‌ వ్యాధులా?

కొవిడ్‌ లక్షణాలా... సీజనల్‌  వ్యాధులా?

  • చలికాలంలో పెరిగిన దగ్గు, జ్వరం, జలుబు సమస్యలు
  • నిర్ధారణ పరీక్షలకు ప్రజలు వెనుకడుగు
  • సొంత వైద్యానికి మొగ్గు
  • నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు

హుజూరాబాద్‌ రూరల్‌: ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సమయంలో దగ్గు, జలుబు, జ్వరం రావడం సాధారణం. అందులో చలికాలంలో మరీ ఎక్కువ. అయితే ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు కరోనా లక్షణాలు ఒకేలా ఉండడంతో ప్రజలు ఎటు తేల్చుకోలేక సతమతమవుతున్నారు. అలాగని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు కొందరు ముందుకు రావడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా సొంత వైద్యం చేసుకుంటూ నిర్లక్ష్యం చూపుతున్నారు.

దవాఖానలో తగ్గిన రోగులు

గతంలో ఈ సీజన్‌లో వైద్యశాలలు రోగులతో కిటకిటలాడాయి. హుజూరాబాద్‌ ప్రాంతీయ దవాఖానలో సుమారు 300 నుంచి 400 వరకు ప్రతి రోజూ రోగులు వచ్చి చికిత్స చేయించుకునే వారు. అలాగే చెల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వందకుపైన, దాని పరిధిలోని ఐదు సబ్‌ సెంటర్లలో ప్రతి రోజూ 20 నుంచి 30మంది వరకు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని వెళ్లేవారు. కానీ ప్రస్తుతం కొవిడ్‌ భయంతో హుజూరాబాద్‌ దవాఖానలో రోజుకు ఓపీ సంఖ్య 150 దాటకపోవడం గమనార్హం. ఇక చెల్పూర్‌ ఆరోగ్య కేంద్రంలో ఓపీ సైతం భారీగా తగ్గింది.

అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

సీజనల్‌ వ్యాధులు, కరోనాపై ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరిలో అవగాహన లోపం, నిర్లక్ష్యం కనిపిస్తున్నది. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినా ఎవరికీ చెప్పకుండా ఆర్‌ఎంపీ వద్ద లేదా ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తికి కారణమై తోటి వారిని ప్రమాదంలోకి నెట్టుతున్నారు.

సొంత వైద్యం వద్దు

సీజనల్‌ వ్యాధులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సీజనల్‌ సమస్యలు, కరోనాకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. కరోనా బాధితులపై వివక్ష చూపొద్దు. అనారోగ్యం పాలైతే దవాఖానకు వచ్చి తగిన వైద్యం చేయించుకోవాలి. కరోనాకు తగిన చికిత్స పొందకపోతే ప్రాణానికే ముప్పు ఉంటుంది.

-డాక్టర్‌ రమేశ్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ దవాఖాన, హుజూరాబాద్‌


logo