శుక్రవారం 22 జనవరి 2021
Karimnagar - Dec 04, 2020 , 00:44:01

అందరి చూపూ..గ్రేటర్‌ వైపు

అందరి చూపూ..గ్రేటర్‌ వైపు

జమిలీ’ని తలపించిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికలు జీహెచ్‌ఎంసీవే అయినా.. ఉమ్మడి జిల్లాలో ఆసక్తిగా మారింది. ఇక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు 21 డివిజన్లలో ప్రచార బాధ్యతలు నిర్వహించగా.. వాటి ఫలితాలు ఎలా ఉంటాయోనన్న దానిపై అనేక రకాల చర్చోపచర్చలు నడుస్తున్నాయి. నేతలు గ్రేటర్‌ను వీడి జిల్లాకు వచ్చినప్పటికీ ప్రచార బాధ్యతలు నిర్వహించిన ప్రాంతాల నుంచి ఓటింగ్‌ లెక్కలు తెప్పించుకొని.. రెండురోజులుగా జమలు, తీసివేతల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు ఆశించిన స్థాయిలో పోలింగ్‌ జరగని నేపథ్యంలో.. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న దానిపై పార్టీల్లో అంతర్మథనం నెలకొనగా, గులాబీ నాయకులు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

  • 21 డివిజన్లలో ఉమ్మడి జిల్లా నేతల ప్రచారం
  • రిజల్ట్స్‌పై జోరుగా చర్చలు
  • రెండురోజులుగా అంచనాల్లో తలమునకలు
  • ఆసక్తిగా జిల్లావాసులు

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) గతంలోనూ గ్రేటర్‌కు ఎన్నికలు జరిగాయి. కానీ, ఈ సారి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఆది నుంచి చివరి వరకు గ్రేటర్‌ ఎన్నికల తీరు వాడీవేడిగానే ఉంటూ వచ్చింది. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. విశ్వనగరంగా మార్చేందుకు ఆరేళ్లలో 67 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. అభివృద్ధికి కేరాఫ్‌గా హైదరాబాద్‌ను నిలిపింది. ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రజలకు వివరించి ఓట్లు అడిగారు. గడిచిన ఆరేళ్లలో ఏం చేశాం?, రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తాం? అన్నది ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. మరోవైపు పూర్తి స్థాయి బాధ్యతను తన భుజాన ఎత్తుకొని హైదరాబాద్‌ విశిష్టత చెదిరిపోకుండా ఉండాలంటే ఓటర్లు అనుసరించాల్సిన మార్గాలపై పూసగుచ్చినట్లుగా దిశానిర్దేశం చేశారు. ‘చేసింది చెప్పాం.. చేసేది చెబుతున్నాం.. దమ్ముంటే ఇతర పార్టీలు హైదరాబాద్‌కు ఏమిచేశాయో.. ఏమి చేస్తాయో చెప్పాలి’ అంటూ అనేక సభల్లో కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కానీ, కేటీఆర్‌ సవాలుకు జవాబు ఇవ్వని పలు పార్టీలు.. అసత్య ప్రచారాలకు ఒడిగట్టాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసిందన్న విమర్శలు బాహాటంగానే వచ్చాయి. ఏమి చేస్తారో చెప్పకుండా.. హైదరాబాద్‌లో రోహింగ్యాలున్నారని, సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ విషప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇతర పా ర్టీలు సైతం అసత్య ప్రచారానికి పూనుకున్నాయి. చేసేది చెప్పకుండా..  ఆచరణ సాధ్యం కాని హామీ లు ఇచ్చి ఓటర్లను తమవైపు మలుచుకోవాలని ప్రయత్నాలు చేశాయి. ఇదే సమయంలో ఈ సారి ఓటింగ్‌ పెంచేందుకు ఎన్నికల సంఘం, ఇతర స్వచ్ఛంద సంస్థలు   ప్రయత్నించాయి. మంత్రి కేటీఆర్‌ కూడా.. ఓటు వేయాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేడిని బట్టి సుమారు 60 శాతం వరకు పోలింగ్‌ అవుతుందని ముందుగా అందరూ అంచనా వేశారు. కానీ, గ్రేటర్‌ ఓటర్లు మళ్లీ పాత పంథానే అనుసరించారు. ఎట్టకేలకు 45.97 శాతం నమోదైంది. అయితే గతంతో పోలిస్తే కొంత ఓటింగ్‌   పెరగడం గమనార్హం. 

సర్వత్రా ఉత్కంఠ.. 

నిజానికి ఈ ఎన్నికలు జీహెచ్‌ఎంసీకి చెందినవే అయినా.. రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. రాష్ర్టానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ బల్దియాపై జెండా మేమే ఎగురవేస్తామని ముం దునుంచి చెప్పిన టీఆర్‌ఎస్‌.. ఎన్నికలు అయ్యాక కూడా అదే పంథాను కొనసాగిస్తున్నది. ఇతర పార్టీలు తమ వాడి తగ్గించగా, ఉమ్మడి జిల్లాలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను ఉమ్మడి జిల్లాలోని నేతలకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావడంతో ప్రచార బాధ్యతలను తన భు జాలపై వేసుకున్నారు. ఇదే సమయంలో మిగిలిన ముగ్గురు మంత్రులు కీలక బాధ్యతలే నిర్వర్తించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 140వ డివిజన్‌ మల్కాజిగిరి బాధ్యతలు తీసుకోగా, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 135వ డివిజన్‌ వెంకటాపురం, మంత్రి గంగుల కమలాకర్‌ 79వ డివిజన్‌ హిమాయత్‌నగర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు 122వ డివిజన్‌ వివేకానందనగర్‌ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. వీరితోపాటు జిల్లాకు చెంది న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి మొత్తంగా 21 డివిజన్లలో ప్రచార బాధ్యతలను చేపట్టారు. ఆయా డివిజన్లు కూడా అత్యంత కీలకమైనవి కావడంతో ఎన్నికలు ముగిసిన సాయంత్రం నుంచే నాయకులు లెక్క ల్లో మునిగి తేలుతున్నారు. హైదరాబాద్‌ను వదిలి జిల్లాకు వచ్చినప్పటికీ తాము చేసిన ప్రచారం ద్వారా వచ్చిన ఓట్ల పరిస్థితి ఎలా ఉందన్న దానిపై రకరకాలుగా కూడికలు, తీసివేతల వంటివి చేస్తున్నారు. చివరగా తమ ప్రచారం సక్సెస్‌ అయిందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నా.. లోలోన మాత్రం ఒకింత ఉత్కంఠకు లోనవుతున్నారు. మరోవైపు ఆయా డివిజన్లలో ప్రచార బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో పోలింగ్‌ జరుగకపోవడం కూడా నాయకులు వేస్తున్న లెక్కల్లో పూర్తిగా క్లారిటీ రావడం లేదన్న అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుండగా, చాలా మంది నాయకులు హైదరాబాద్‌ తరలివెళ్లారు. అయితే, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎన్నికల్లో హోరెత్తించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మన జిల్లాకు చెందిన వారే. అలాగే, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఇక్కడివారే. వీరంతా ప్రచారంలో పాల్గొనడం, నేడు ఫలితాలు వస్తుండడంతో జిల్లావాసులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికలపై జోరుగా చర్చల్లో మునిగిపోయారు.logo