శుక్రవారం 22 జనవరి 2021
Karimnagar - Dec 02, 2020 , 00:29:33

స్వచ్ఛత వైపు అడుగులు

స్వచ్ఛత వైపు అడుగులు

  • పారిశుధ్య నిర్వహణలో పెరుగుతున్న యాంత్రీకరణ
  • సపాయి మిత్ర సురక్ష చాలెంజ్‌కు సిద్ధమవుతున్న మున్సిపాలిటీలు
  • ప్రోత్సాహకాలను అందిస్తున్న కేంద్రం

కార్పొరేషన్‌ : స్వచ్ఛ పట్టణాలు, నగరాలే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ముందుకు సాగుతున్నాయి. ఈ దిశగా పరిశుభ్రతను పెంచడం తోపాటు, పారిశుద్ధ్య పనులను మరింతగా మెరుగుపర్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ కింద పారిశుద్ధ్య పనుల్లో ఫలితాలను చూపిస్తున్న మున్సిపాలిటీలకు ఏటా ర్యాంకులను ప్రకటిస్తున్నది. వీటితో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌, ఆర్థిక సంఘం కింద కేంద్రం మంజూరు చేసే నిధుల్లోనూ ఎక్కువగా పారిశుద్ధ్యం మెరుగుదల కోసం చేపట్టే కార్యక్రమాలకే ప్రాధాన్య మి స్తున్నారు. ఈ నిధులను ప్రధానంగా పారిశుద్ధ్య ప నుల వాహనాలు కొనుగోలు చేసేందుకు విని యోగిస్తున్నారు.  ఈ విషయంలో అన్ని మున్సిపాలిటీలు కూడా పారిశుద్ధ్య పనులకు వాహనాలు వాడేలా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భా గంగా మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు మానవులకు బదులుగా యం త్రాలను వినియోగిస్తున్న మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహక బహుమతులను అందిస్తున్నది. ఇందుకుగాను సపాయిమిత్ర సురక్ష చాలెంజ్‌ను తీసుకువచ్చింది. ఈ చాలెంజ్‌లో దేశంలోని అన్ని మున్సిపాలిటీలు పాల్గొనాలని సూచించింది. వా టి జనాభాను అనుసరించి విభాగాలు చేశారు. పది లక్షల కన్నా ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీ లు, 3 నుంచి 10 లక్షలలోపు ఉన్నవాటికి మొదటి బహుమతి కింద రూ. 10 కోట్లు, రెండో బహుమతిగా రూ.5 కోట్లు, మూడో బహుమతిగా రూ. 2.5 కోట్లు అందించనున్నారు. మూడు లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల విభాగంలో మొదటి బహుమతి రూ. 8 కోట్లు, రెండో బహుమతి రూ. 4 కోట్లు, మూడో బహుమతి రూ.2 కోట్లుగా ప్రకటించారు. ఈ చాలెంజ్‌లో పాల్గొనేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 

దృష్టి సారించిన మున్సిపాలిటీలు

ఈ చాలెంజ్‌లో పాల్గొనేందుకు ఆయా మున్సిపాలిటీలు చర్యలు మొదలుపెట్టాయి. ప్రధానంగా అన్ని మున్సిపాలిటీలు ఈ చాలెంజ్‌లో భాగస్వాములు కావాలంటూ సీడీఎంఏ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే జిల్లాలోని కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటుగా హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల శుభ్రం చేసేందుకు ఎక్కువగా యంత్రాలనే వినియోగిస్తున్నారు. ఈ పోటీలో పా ల్గొనే మున్సిపాలిటీలు నవంబర్‌ 20 నుంచి మార్చి 2021 వరకు సిద్ధంగా ఉండాలి. ఏప్రిల్‌ 2 నుంచి 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. మే 1 నుంచి జూన్‌ 30లోగా కేంద్ర బృందాలు ఆయా మున్సిపాలిటీల్లో పర్యటించి పరిశీలన చేస్తాయి. ఈ పోటీల విజేతల వివరాలను 2021 ఆగస్టు 15న ప్రకటిస్తారు. కాగా ఇప్పటికే జిల్లాలోని ము న్సిపాలిటీల్లో మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో యంత్రాల వినియోగమే ఎక్కువగా సాగుతున్నది. వీటిని రీసైక్లింగ్‌ విషయంపై ఆయా మున్సిపాలిటీలు దృష్టి సారిస్తున్నాయి. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోని ఎస్‌టీపీ (స్టీమ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) కు సెప్టిక్‌ క్లీనింగ్‌ వాహనాలను అనుమతి ఇస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్‌ క్లీనింగ్‌ వాహనాలు నగరంలో సెప్టిక్‌ ట్యాంకులను క్లీన్‌ చేసినప్పుడు వాటి వ్యర్థాలను ఎస్‌టీపీలోనే వేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ మేరకు ఈ పనులు సాగుతున్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల పరిధిలో సెప్టిక్‌ ట్యాంకులను వాహనాల ద్వారానే క్లీనింగ్‌ చేస్తున్నా వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడంలో సరైన వ్యవస్థలు లేకుండా పోయాయి. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వాహనాలను కరీంనగర్‌ ఎస్‌టీపీకి తరలించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. మిగిలిన మున్సిపాలిటీలు కూడా  ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి. 

పారిశుద్ధ్య నిర్వహణలోనూ పెరుగుతున్న యంత్రీకరణ

మున్సిపాలిటీలు పారిశుద్ధ్య నిర్వహణకు యంత్రీకరణ వైపే అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇంటింటా చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలను వినియోగిస్తున్నారు. రోడ్లను శుభ్రం చేసేందుకు స్వీపింగ్‌ యంత్రాల కొనుగోలుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలో రెండు స్వీపింగ్‌ యంత్రాలు ఉండగా, చెత్త తరలింపునకు కూడా ఆధునిక యంత్ర వాహనాలను తీసుకువచ్చారు. మిగిలిన నాలుగు మున్సిపాలిటీలు కూడా ఈ దిశగా ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి..  


logo