సోమవారం 18 జనవరి 2021
Karimnagar - Dec 01, 2020 , 03:09:26

కాల్చోద్దు..కలియదున్నుద్దాం

కాల్చోద్దు..కలియదున్నుద్దాం

 • కొయ్యకాలుకు నిప్పుపెడితే అనర్థాలు
 • నేల సమతుల్యతకు ప్రమాదం
 • భూసారం దెబ్బతినే ముప్పు 
 • పచ్చిరొట్ట, జీలుగతో అనేక లాభాలు

ప్రకృతిని నమ్ముకొని సేద్యం చేసే రైతన్న పర్యావరణానికి కీడు చేయడం ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. వరి కోతల తర్వాత కొయ్యకాలుకు నిప్పు పెట్టడం ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నది. నేలకు సారాన్ని చేకూర్చే క్రిమికీటకాలు నశించిపోవడంతోపాటు వాయు కాలుష్యం పెరిగిపోతున్నది. భూ సమతుల్యత దెబ్బతింటూ, మరో పంటపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కర్షకుడికి తెలియకుండానే తీరని నష్టాన్ని మిగులుస్తుండగా, తగులబెట్టకుండా పొలంలో కలియదున్నితో ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ చెబుతున్నది.

- గంగాధర/ కోనరావుపేట/ హుజూరాబాద్‌టౌన్‌

 గతంలో వరిని కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా, వరిసాగు తక్కువ ఉండడంతో పశుగ్రాసాన్ని కుప్పలు (గడ్డివాములు) పెట్టుకునేవారు. కానీ, ప్రస్తుతం సాగు విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. యంత్రాలను విరివిగా వినియోగిస్తుండడంతో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మిషన్‌తో హార్వెస్టింగ్‌ చేసే సమయంలో పైకి కోయడం ద్వారా కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొద్దో గొప్పో గడ్డిని తెచ్చుకోవడం, మిగిలిన దానిని అక్కడే వదిలివేస్తున్నారు. దీంతో దున్నేటప్పుడు నాగండ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు కాలబెడుతున్నారు. దీని వల్ల నష్టాలే తప్ప లాభం ఏమాత్రం ఉండదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. 

ఎనిమిది రోజులు ముందుగా దున్నాలి..

చాలా మంది రైతులు వరి నాటు వేసే సమయంలో మొదటి దఫా దున్నుడుకు, రెండో దఫా దున్నుడుకు మధ్య నాలుగు నుంచి ఐదు రోజుల సమయం మాత్రమే తీసుకుంటున్నారు. దీని వల్ల కొయ్యకాలు, గడ్డి త్వరగా కుళ్లిపోవు. ఇలాంటి సమయంలో కొయ్యకాళ్లను కాలబెట్టకుండా అందులోనే కలియదున్ని కనీసం ఎనిమిది రోజుల సమయం తీసుకొని రెండో దఫా దున్నాలి. వీలైతే మొదటి దఫాలో ఒకసారి రొటోవేటర్‌తో దున్నితే గడ్డి, కొయ్యకాలు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మారు దున్నినప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. దున్నే ముందు ఎకరానికి 100 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌ చల్లితే కొయ్యలు, గడ్డి త్వరగా కుళ్లిపోతాయి. జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు వేసి ఏపుగా పెరిగిన తర్వాత కలియదున్నితే భూమి సారవంతంగా మారుతుంది.

కాల్చితే నష్టాలే..

 • కొయ్యకాలును కాల్చితే నష్టాలే తప్ప ఎలాంటి ప్రయోజనాలూ లేవు. 
 • విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్‌ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. దిగుబడి పోతుంది. 
 • భూమికి పీచు పదార్థంగా ఉపయోపగడే అవశేషాలు కాలిపోతాయి. 
 • పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి.
 • పొలాల్లో పాములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. 
 • గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు అగ్నికి బుగ్గవుతుండడంతో పర్యావరణానికి తీరని హాని కలుగుతుంది. 
 • మరో ముఖ్య విషయం ఏమిటంటే అలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

కలియ దున్నితే ప్రయోజనాలు..

 • వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కార్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశమున్నది.
 • దుక్కిదున్నే సమయంలో సూపర్‌ ఫాస్పేట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది.
 • కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది.
 • మొక్కలకు 2 శాతం నత్రజని(యూరియా), 4 శాతం పాస్పరస్‌ అదనంగా అందిస్తుంది.
 • జింక్‌, మాంగనీస్‌, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి.
 • నేలలో కరుగని మూలకాలనూ పంటకు అనుకూలంగా మార్చుతుంది. 
 • నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది.