సంఘటితమై సాధించి..

- స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న కొత్తపల్లి మహిళలు
- స్వయం సహాయక సంఘాలతో ఆర్థికాభివృద్ధి
- కూలీ నుంచి మరొకరికి ఉపాధి కల్పించే స్థాయికి..
- అధికారుల ప్రశంసలు
వారందరూ సాధారణ కూలీలు.. కష్టపడితే గానీ కడుపునిండని పరిస్థితి.. రెక్కాడితేగానీ డొక్కాడని దయనీయస్థితి..అలాంటివారందరూ సంఘటితమయ్యారు. స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్నారు. చేతినిండా పనితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని అధికారులు చెప్పిన మాటలను ఆచరణలో పెట్టారు. నందీశ్వర టైలరింగ్ మగ్గం వర్క్స్ పేరిట ఓ యూనిట్‌ను స్థాపించారు. దినదినం స్వావలంబనవైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొత్తపల్లికి చెందిన మహిళలు. - తిమ్మాపూర్
కూలీ నుంచి స్వయం ఉపాధి దాకా..
కొత్తపల్లికి చెందిన కస్తూరి స్వరూప విద్యావంతురాలు. ఉద్యోగం రాకపోవడంతో కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకొనేది. ఆమెతో పాటు పులబోయిన పద్మ, పులబోయిన మౌనిక పరిస్థితి కూడా ఇంతే. మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరి లింకేజీ రుణాలు తీసుకునేవారు. చిన్నాచితక పనులకు వినియోగిస్తుండేవారు. అయినా వారిలో ఏదో తెలియని వెలితి. ఐకేపీ అధికారులు నిర్వహించిన సమావేశం వారి జీవితాల్లో పెనుమార్పులకు కారణమైంది. స్వయం ఉపాధి వైపు అడుగులు వేయించింది. వీరు మూడేళ్ల కిందట మరో ముగ్గురిని చేర్చుకుని జాయింట్ లయబులిటీ గ్రూపు (జేఏల్జీ) ఏర్పాటు చేసుకున్నారు.
జేఎల్‌జీ సంఘంలో ప్రయాణం
రెండేళ్ల క్రితం ఓ రోజు మండల సమాఖ్య సమావేశంలో ఏపీఎం రాంమోహన్, ఎస్బీఐ ఆర్‌సెట్ కో ఆర్డినేటర్ తిరుపతి ‘జీవనోపాధి- శిక్షణ’ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్బీఐ ఆర్‌సెట్)లో ఇచ్చే శిక్షణ గురించి వివరించారు. అధికారుల మాటలు కొత్తపల్లి మహిళల్లో స్ఫూర్తిని రగిలించాయి. ఇప్పటి వరకు కుట్టు శిక్షణలో అనుభవం ఉన్న స్వరూప, పద్మ, మౌనిక అదనంగా మగ్గం వర్క్ కూడా నేర్చుకుంటే బాగుంటుందని భావించి ఇదే ఎస్బీఐ ఆర్‌సెట్‌లో శిక్షణ పొందారు. వీరు ముగ్గురు కలిసి తలా 10 వేలు వేసుకుని మండలంలోని కొత్తపల్లిలో సెర్ప్ సహకారంతో ‘నందీశ్వర టైలరింగ్, మగ్గం వర్క్స్' పేరిట ఒక యూనిట్‌ను 2018లో నెలకొల్పారు. ఇందుకు మండల సమాఖ్య నుంచి 2 లక్షల రుణం తీసుకున్నారు. డ్రెస్‌లు, మగ్గం వర్క్స్, కుట్టు మిషన్, లైనింగ్ వర్క్స్ వంటి పనులు చేయడం ప్రారంభించారు. వీరు మరో ముగ్గురికి శిక్షణ ఇప్పించి యూనిట్లో చేర్చుకున్నారు. అనంతరం చుట్టు పక్కల గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు యూనిఫామ్స్ కుట్టడం కోసం కేడీసీసీ బ్యాంకు నుంచి 4 లక్షలు రుణం తీసుకుని కుట్టు మిషన్లతో పాటు పెద్ద మొత్తంలో మెటీరియల్ కొనుగోలు చేశారు. ఇప్పుడు కొత్తపల్లి ఒక్క గ్రామమే కాదు.. సమీప ఉన్న గ్రామాల నుంచి ఈ మహిళలు స్థాపించిన నందీశ్వర టైలరింగ్ గురించి తెలిసిపోయింది. ఎక్కడ పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగినా ఇక్కడికే వచ్చి మగ్గం వర్క్స్ చేయించుకుంటున్నారు. ఇది వరకు ఇలాంటి పనుల కోసం కరీంనగర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు కొత్తపల్లిలోనే ఈ పనులు సక్కబెట్టుకుంటున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు.
బతుకుల్లో వెలుగులు..
నందీశ్వర టైలరింగ్ స్థాపించిన మహిళలు ఇప్పుడు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూలి చేసుకుని జీవించే వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నిండుతున్నాయి. ఒక్కరుగా సాధించలేనిది సంఘటితంగా సాధించవచ్చని నిరూపించిన ఈ మహిళలు మొదట తమ సంఘం నుంచి కొంత మొత్తాన్ని తర్వాత మండల సమాఖ్య మరికొంత సొమ్ము, తదనంతరం బ్యాంకు నుంచి రుణం తీసుకుని మిషనరీ కొనుగోలు చేశారు. ఇందులో 2018లో 2 లక్షలతో కుట్టు మిషన్ కొనుగోలు చేశారు. అలాగే, 2019లో 4 లక్షల రుణంతో ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనుగోలు చేశారు. వీటిలో నెలకు 30 వేలు, సీజన్లో లక్ష వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలా క్రమంగా వచ్చిన ఆదాయంతో ప్రస్తుతం 20 లక్షల వ్యయం వరకు మరేదైనా కొనుగోలు చేసే స్థాయికి చేరారు. ఇప్పటి వరకు చుట్టుపక్కల గ్రామాల్లోని 20 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పలువురి అభినందనలు
ఈ యూనిట్‌ను ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు రూపొందిస్తున్న డిజైనర్ డ్రెస్సెస్, మగ్గం వర్క్స్లను పరిశీలించి వారిని అభినందించారు.
గార్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఉంది..
చదువుకుంటూ స్వతహాగా ఎదగాలనే ఆకాంక్షతో ఈ యూనిట్‌ను నెలకొల్పాం. దీని ప్రారంభానికి ముందు ఎల్ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ తీసుకుని ఇంటి వద్ద పని చేసుకున్నా. ఇప్పుడు మరికొందరికి శిక్షణ ఇవ్వడంతో పాటు మేం కూడా ఉపాధి పొందుతున్నాం. సర్కారు చేయూతనందిస్తే గార్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
- కస్తూరి స్వరూప, యూనిట్ నిర్వాహకురాలు
చదువుకుంటూనే శిక్షణ తీసుకుంటున్న
నాకు డిజైనింగ్, డ్రెస్సెస్, మగ్గం వర్క్స్‌పై ఉన్న మక్కువతో ఓ వైపు చదువుకుంటూ మరోవైపు శిక్షణ తీసుకుంటున్న. శిక్షణ పూర్తయితే భవిష్యత్‌లో సొంత కాళ్లపై నిలబడాలని ఉంది. కుట్టు మిషన్ పూర్తిగా నేర్చుకుంటే ఇంట్లో కూడా స్వయం ఉపాధి పొందవచ్చు. నాలా మరికొంతమంది శిక్షణ తీసుకుంటున్నారు.
- నోముల శ్రావణి, శిక్షకురాలు
అవకాశాలున్నాయి..
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి, వారు స్వయంగా ఎదిగేందుకు అవగాహన కల్పిస్తున్నాం. కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ముందుకు వస్తున్నారు. వారికి ఉపాధి చూపుతూ ప్రోత్సహిస్తున్నాం. - కే రాంమోహన్, సెర్ప్ ఏపీఎం