మంగళవారం 26 జనవరి 2021
Karimnagar - Nov 26, 2020 , 00:45:54

టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి

  • మంత్రి ఈటల రాజేందర్‌  
  • మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రచారం

హుజూరాబాద్‌ టౌన్‌: టీఆర్‌ఎస్‌ పాలనలోనే హైదరాబాద్‌ పట్టణం మహానగరంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉద్ఘాటించారు. బుధవారం మంత్రి ఈటల రాజేందర్‌ మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆరేళ్లలో అభివృద్ధిని మరిచి దేశాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ, ఉద్యోగులను గాలికి వదిలేస్తున్న బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఉద్యోగాలు కల్పిస్తామని, అభివృద్ధి చేస్తామని ప్రగల్భా లు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పేదల, రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ చర్యలు చేపడుతున్నారన్నారు. ఎలాంటి గొడవలు, అల్లర్లు, బంద్‌లు లేని హైదరాబాద్‌ నగరం ఉండాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్‌పై గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు.  మల్కాజిగిరి 140వ డివిజన్‌ అభ్యర్థి జగదీశ్‌గౌడ్‌కు మద్దతుగా హుజూరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు గడపగడపకూ తిరుగుతూ నగర అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంచుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ పట్టణ, మండల శాఖల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్‌, గోపు కొంరారెడ్డి, సీనియర్‌ నాయకులు గందె శ్రీనివాస్‌, చొల్లేటి కిషన్‌రెడ్డి, మండల సాయిబాబా, గంట మధూక ర్‌, పంజాల రేవంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo