గురువారం 03 డిసెంబర్ 2020
Karimnagar - Nov 22, 2020 , 01:37:25

రైతు ముచ్చట్లకు వేదికలు

రైతు ముచ్చట్లకు వేదికలు

  • ముస్తాబవుతున్న రైతు వేదికలు
  • ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా డిజైన్లు
  • గంగాధర మండలంలో ఐదు వేదికల నిర్మాణం

గంగాధర: గ్రామాల్లో రైతులంతా ఒక చోట కూర్చొని సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, సాగుకు సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మండలంలోని ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కొక రైతు వేదిక నిర్మాణానికి రూ. 22 లక్షల చొప్పున సర్కారు కేటాయించింది. గంగాధర మండలంలో ఐదు క్లస్టర్లు ఉండగా ఐదు రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఐదు వేదికల్లో నాలుగు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా, మరొకటి 95 శాతం పనులు పూర్తయ్యాయి.  సాగు సమస్యలపై మాట్లాడుకోవడానికి వేదిక లేకపోవడంతో గ్రామ  పంచాయతీ కార్యాలయాల వద్ద, ఇతర ప్రదేశాల్లో సమావేశాలు  నిర్వహించాల్సి వచ్చేదని, ప్రభుత్వం ప్రత్యేకంగా వేదికలు నిర్మిస్తుండడంపై మండల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సర్వాంగ సుందరంగా వేదికల నిర్మాణం

మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఇందులో గర్శకుర్తి, కురిక్యాల, మల్లాపూర్‌, గంగాధర, బూరుగుపల్లి గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి రైతు వేదికల నిర్మాణానికి రూ. కోటి 10 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. గర్శకుర్తి, కురిక్యాల, మల్లాపూర్‌, గంగాధర క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండగా, బూరుగుపల్లిలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేదికల్లో సమావేశ మందిరం, మందిరం ముందు వేదికను ఏర్పాటు చేశారు. క్లస్టర్‌ వ్యవసాయాధికారి, కార్యాలయం కోసం గది నిర్మించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి సైతం ఉపయోగించుకునేలా రైతు వేదికల నిర్మాణం చేపట్టారు. 

వ్యవసాయ ప్రాధాన్యతను చాటేలా చిత్రాలు

వ్యవసాయ ప్రాధాన్యతను తెలియజేసేలా రైతు వేదిక బయట, లోపల ప్రత్యేకమైన చిత్రాలు వేయించారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించేలా చక్కని డిజైన్లు వేశారు. వేదిక లోపల వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, పచ్చదనంతో కళకళలాడుతున్న తెలంగాణ రాష్ట్రం చిత్రపటాన్ని గీశారు. నాగలి ఎత్తుకున్న రైతు, వరికంకి గొలకలతో సంతోషం వ్యక్త చేస్తున్న రైతుల బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను గురించి వివరించేలా చిత్రాలు వేశారు. అంతేకాకుండా రైతు వేదికకు హరిత సొగసులు అద్దడానికి వేదిక చుట్టూ మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, వేదికలను త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. 

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది

రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక వేదికను నిర్మించడం తెలంగాణలో తప్ప మరెక్కడ లేదు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధితో పాటు అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రైతు వేదికలు నిర్మిస్తున్నారు. గర్శకుర్తిలో ఇప్పటికే రైతు వేదిక నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాం. 

 -అలువాల నాగలక్ష్మి, సర్పంచ్‌, గర్శకుర్తి

ప్రత్యేక ఆకర్షణగా రైతు వేదిక 

వ్యవసాయ క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  కురిక్యాలలో నిర్మించిన రైతు వేదిక గోడలపై రైతు బంధు, రైతు బీమా పథకాలపై అవగాహన కల్పించేలా చక్కని చిత్రాలు గీయించాం. లోపల వేదిక వద్ద వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, నాగలి ఎత్తిన రైతు, వరికంకి గొలకలతో రైతు దంపతుల చిత్రాలను ఆకర్షణీయంగా వేయించాం.   

-మేచినేని నవీన్‌రావు, సర్పంచ్‌, కురిక్యాల

వినూత్న ఆలోచనతో వేదికల నిర్మాణం

 వ్యవసాయాభివృద్ధికి వినూత్న ఆలోచనలు చేయడంలో సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడు ముందుంటారు. దేశంలో మరెక్కడ లేని విధంగా రైతుల కోసం వేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. మల్లాపూర్‌లో రైతు వేదిక నిర్మాణం పూర్తి చేశాం. వేదికను ప్రారంభిస్తే అన్నదాతలంతా సమావేశమై సాగుకు సంబంధించిన విషయాలు చర్చించుకోవచ్చు. 

-ఆకుల శంకరయ్య, సర్పంచ్‌, మల్లాపూర్‌