మంగళవారం 01 డిసెంబర్ 2020
Karimnagar - Nov 21, 2020 , 01:57:29

పల్లెకు అందం ప్రకృతి వనం

పల్లెకు అందం ప్రకృతి వనం

  • పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కల పెంపకం
  • క్రీడాపరికరాలు, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు 

గంగాధర: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనాలతో పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. గ్రామాల్లో సహజంగా కనిపించే ప్రకృతి సౌందర్యానికి, సహజత్వానికి మరింత కొత్త అందాలను అద్దడానికి ప్రభుత్వం ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన పార్కులను ప్రకృతి వనాల పేరుతో పల్లెల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ప్రకృతి వనంలో అన్ని రకాల పూల, పండ్ల మొక్కలతో పాటు భారీ వృక్షాలకు సంబంధించిన మొక్కలను నాటారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేసిన కొత్త ఆలోచన ఈ ప్రకృతి వనం.


వరుస క్రమంలో మొక్కల పెంపకం

మండలంలో 33 గ్రామాలు ఉండగా 29 గ్రామాల్లో  ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి, 28,265 మొక్కలు నాటారు. వరుస క్రమంలో మొక్కలు నాటగా, నిత్యం నీళ్లు పడుతూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వనానికి హద్దులు నిర్ణయించి నాటిన  మొక్కలను పశువులు మేయకుండా చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కంచె లోపల హద్దుల వద్ద ప్రజలు నడవడానికి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. వాకింగ్‌ ట్రాక్‌ హద్దుల పక్కన వేప, మర్రి, కానుగ, బాదం, రావి వంటి నీడనిచ్చే మొక్కలను నాటారు. లోపలి భాగంలో జామ, దానిమ్మ, సీతాఫలం, నేరేడు వంటి పండ్ల మొక్కలతో పాటు మందారం, గులాబీ, మల్లె, గన్నేరు,  వంటి పూల మొక్కలు నాటారు. ప్రకృతి వనం వద్దకు వచ్చే పిల్లలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు, కూర్చొవడానికి వీలుగా సిమెంట్‌ బేంచీలు ఏర్పాటు చేశారు.


ప్రకృతి వనంతో మానసికోల్లాసం 

గంగాధర సమీపంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే వారు విశ్రాంతి తీసుకోవడానికి, గ్రామస్తులకు ఆహ్లాదం పంచేందుకు 18 గుంటల స్థలంలో 1,650 మొక్కలు నాటాం. మొక్కలు ఎండిపోకుండా నిత్యం సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలు ఆడుకోవడానికి క్రీడాపరికరాలు ఏర్పాటు చేశాం. ఉదయం పూట గ్రామస్తులు నడవడానికి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశాం     .-మడ్లపెల్లి గంగాధర్‌, సర్పంచ్‌, గంగాధర

జీవ వైవిద్యానికి మొక్కలు అవసరం

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జీవ వైవిద్యాన్ని కాపాడడానికి మొక్కల పెంపకం అవసరం. చెట్లు లేకుంటే రాబోయే రోజుల్లో పక్షులు, ఇతర జీవాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. పల్లె ప్రకృతి వనంలో గ్రామస్తులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 700  మొక్కలు నాటి, పిల్లలు ఆడుకోవడానికి క్రీడాపరికాలు ఏర్పాటు చేశాం. ఉదయం పూట గ్రామస్తుల నడక కోసం వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశాం.

 -కంకణాల విజేందర్‌రెడ్డి, సర్పంచ్‌, గట్టుభూత్కూర్‌

మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన ప్రకృతి వనంతో గ్రామానికి పచ్చని అందం వచ్చింది. గ్రామ పంచాయతీ పరిధిలో 15 గుంటల ప్రభుత్వ స్థలంలో 1,480 మొక్కలు నాటగా ఏపుగా పెరుగుతున్నాయి. నిత్యం నీళ్లు పడుతూ, సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. మొక్కలను పశువులు మేయకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశాం. గ్రామస్తులు వెళ్లి సేదతీరుతున్నారు.

-వేముల లావణ్య, సర్పంచ్‌, మధురానగర్‌