బుధవారం 25 నవంబర్ 2020
Karimnagar - Oct 31, 2020 , 01:02:57

సన్నరకాన్ని ‘ఏ’ గ్రేడ్‌ కింద కొంటాం

సన్నరకాన్ని ‘ఏ’ గ్రేడ్‌ కింద కొంటాం

దేశంలోనే రైతుకు అండగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

కమలాపూర్‌: సన్న వడ్లను ‘ఏ’ గ్రేడ్‌ కింద కొనుగోలు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలోని గూడూరు పీఏసీఎస్‌, కమలాపూర్‌ సబ్‌ మార్కెట్‌ యార్డులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలకు చెందిన 2 కోట్ల 70 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు  తెలిపారు. రేషన్‌ బియ్యం సగం మంది తినడం లేదని, కిలో పది రూపాయలైనా సన్నబియ్యమే ఇవ్వాలని ప్రజల నుంచి డిమాండ్‌ వస్తున్నదని పేర్కొన్నారు. రైస్‌మిల్లర్లు సన్నవడ్లు కొనుగోలు చేయకుంటే ప్రభుత్వమే ఏటా 6 నుంచి 7 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసే అవకాశముందన్నారు. బియ్యం పట్టించి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. అన్ని రాష్ర్టాలు కలిపి కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇస్తే, ఒక్క తెలంగాణే 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇచ్చిందన్నారు. ఎప్పటికైనా దేశానికి అన్నం పెట్టే సత్తా ఒక్క తెలంగాణ రాష్ర్టానికే ఉందని నిరూపించామన్నారు.  తెలంగాణ ప్రభుత్వమే రైతులకు అండగా నిలిచిందని, అన్నదాతలకు సాయం చేసిన ప్రభుత్వాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవన్నారు. కరోనా వచ్చినా నిలదొక్కుకొని అన్ని రంగాల్లో ముందుకు పోతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నెల రోజులు రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ సన్న రకాలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు చెప్పారని, ఏ నిర్ణయం తీసుకున్నా లోతుగా ఆలోచిస్తారని, అలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే రైతు బీమా అని చెప్పారు. ఇక్కడ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్‌ జ్యోతి వరలక్ష్మి దేవి పాల్గొన్నారు.