నేటి నుంచే అందుబాటులోకి పోర్టల్

యావత్ ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచే అందుబాటులోకి రానున్నది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలో మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా, ఆ మరుక్షణం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని తహసీల్ కార్యాలయాల్లో పక్కాగా అమలు చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక నుంచి అర గంటలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకం చేతికి అందనుండగా, రైతుల దశాబ్దాల బాధలు తీరనున్నాయి. భవిష్యత్తులో భూవివాదాలకు అడ్డుకట్ట పడడమే కాదు, యజమానులకు సంపూర్ణ హక్కు, పూర్తిస్థాయి భద్రత దొరకనున్నది. భూ క్రయ విక్రయాల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
- కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో సరికొత్త విధానానికి నేటి నుంచి అంకురార్పణ జరుగబోతున్నది. ధరణి పోర్టల్ గురువారం నుంచే అందుబాటులోకి వస్తున్నది. ఇందులో సమస్త భూముల వివరాలను ప్రభుత్వం నిక్షిప్తం చేసింది. ఇప్పటికే ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ ఇక నుంచి తహసీల్ కార్యాలయాల్లోనే చేయనున్నారు. అందుకు ఉమ్మడి జిల్లాలోని 61 మండలాల్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రతి తహసీల్ కార్యాలయంలో అన్ని పరికరాలు, యంత్రాలు అమర్చారు. రెండు కంప్యూటర్లు, రెండు సీసీ కెమెరాలు సహా ఫుటేజీల పరిశీలన కోసం పెద్ద టీవీ, ఒక స్కానర్, ప్రింటర్, బయోమెట్రిక్ మిషన్, ఐరిస్ కెమెరాతోపాటు ప్రభుత్వ నెట్, ప్రత్యామ్నాయంగా మరో నెట్ సౌకర్యాన్ని కల్పించారు. ఇవేకాదు, అదనంగా మరిన్ని సౌకర్యాల కల్పన కోసం ప్రతి ఆఫీసుకు 10 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తప్పనున్న తిప్పలు..
గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తర్వాత దస్తావేజులు తీసుకోవడం, మ్యుటేషన్, పహాణీల్లో మార్పులు చేయించుకోవడం పెద్ద ప్రహసనంగా ఉండేది. రోజుల తరబడి తిరిగినా పని పూర్తయ్యేది కాదు. కానీ, కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లతో ఈ ఇబ్బందులన్నీ తప్పనున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్దేశిత సమయం ప్రకారం అర గంటలోనే జరుగుతుంది. ఆ వెంటనే దస్తావేజులు, పట్టాదారు పాసు పుస్తకం, మ్యుటేషన్ ఉత్తర్వులు ఇస్తారు. కొనుగోలుదారు కొన్న భూమిని అతని పట్టాదారు పాసుపుస్తకంలో చేర్చి ప్రింట్ తీసి సంతకం చేసి ఇస్తారు. విక్రయదారుడి పట్టాదారు పుస్తకం నుంచి తొలగిస్తారు. ఇలా క్రయ విక్రయాలకు సంబంధించిన అన్ని హక్కులు సంబంధిత పత్రాల్లో మారడంతోపాటు అదే సమయంలో మ్యుటేషన్ కూడా జరిగిపోతుంది. ఇక నుంచి వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మ్యుటేషన్‌కు, పట్టాదారు పాసు పుస్తకాలకు, దస్తావేజులకు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అన్నీ ఒకే చోట పూర్తి చేసి, అరగంటలోనే క్రయవిక్రయ దారులకు దస్తావేజులు, అవసరమైన పత్రాలు అందిస్తారు. దీని ద్వారా వ్యయ ప్రయాస తగ్గడమేకాదు, ప్రతి పనిలో అవినీతికి తెర పడి, పారదర్శకత పెరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆపరేటర్లకు ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కాగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఇలా..
వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవడానికి దరఖాస్తులో కోరే అన్ని వివరాలు నమోదు చేయాలి.
ఈ-చలాన్ ద్వారా స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను చెల్లించాలి.
అపాయింట్మెంట్ బుక్ అవుతుంది
సాక్షి వివరాలను డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) నమోదు చేస్తారు.
అమ్మకం, కొనుగోలుదారు, సాక్షుల ఫొటో, బయోమెట్రిక్ వివరాలను నమోదు చేస్తారు.
రిజిస్ట్రేషన్‌ను తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అప్రూవ్ చేస్తారు.
డాట ఎంట్రీ ఆపరేటర్ పత్రాలను స్కాన్ చేసి, అప్లోడ్ చేస్తారు.
డాక్యుమెంట్లు, మ్యుటేషన్‌పై తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం చేస్తారు.
పీపీబీ/ఈ-పీపీబీ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ విశ్లేషణ పత్రం ప్రింట్‌ను ఆపరేటర్ ఇస్తారు.
జిల్లాల వారీగా సౌకర్యాల కల్పనకు వచ్చిన నిధులు
జిల్లా పేరు మండలాలు విడుదలైన నిధులు
జగిత్యాల 18 1.80 కోట్లు
కరీంనగర్ 16 1.60 కోట్లు
పెద్దపల్లి 14 1.40 కోట్లు
రాజన్న సిరిసిల్ల 13 1.30 కోట్లు
మొత్తం 61 6.10 కోట్లు
వివాదాల్లేని ఊళ్లను చూస్తం
గురువారం నుంచి ధరణి పోర్టల్ స్టార్ట్ అవుతున్నది. పారదర్శకత, సత్వర సేవలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధరణి ద్వారా త్వరలోనే వివాదాల్లేని ఊళ్లను చూస్తాం. ఇక నుంచి మా కార్యాలయాల్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తాం. కొద్ది రోజుల నుంచి ధరణిపై శిక్షణ తీసుకున్నాం. ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు చేశాం. ధరణి పోర్టల్ చాలా ఈజీగా ఉన్నది. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. స్లాట్ బుకింగ్ ఉంటది. ఇచ్చిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దస్తావేజుల ప్రక్రియ పారదర్శకంగా సాగుతది. ధరణి పోర్టల్‌లో భూమి పాసు పుస్తకం, ఆధార్ నంబర్ ఇలా ఎంటర్ చేయగానే.. అలా మార్కెట్ విలువ, ఈసీ, తదితర వివరాలన్నీ వస్తాయి. మార్పులు, చేర్పులకు అవకాశముండదు. క్రయవిక్రయాల సందర్భంగా ఇరువర్గాలు వస్తే వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అమ్మిన వ్యక్తి భూమి, పాస్ బుక్ నుంచి డిలీట్ అవుతుంది. కొన్నవారి బుక్కులో నమోదవుతుంది. ఎవరి చుట్టూ తిరుగుడు ఉండదు. మనం చూస్తుండగానే.. అక్కడికక్కడే పని పూర్తిగా అయిపోతది.
- డాక్టర్ కే నారాయణ, తహసీల్దార్(జమ్మికుంట)
ఎల్లారెడ్డిపేట: ధరణి పోర్టల్‌ను పరిశీలిస్తున్న సిబ్బంది
క్షణాల్లో రికార్డుల్లోకి..
ధరణి ద్వారా క్రయవిక్రయాలు అయిపోగానే కొనుగోలు చేసిన వారి పేరిట క్షణాల్లో రికార్డుల్లోకి ఎక్కుతుంది. గతంలో రిజిస్ట్రేషన్ తర్వాత సదరు పత్రాలతో తమ వద్దకు వచ్చే విధానం ఉండేది. రికార్డుల్లో ఎక్కించేందుకు 15 నుంచి 30 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి మీసేవలో స్లాట్ బుక్ చేసుకునే సమయంలోనే అన్ని వివరాలు నమోదు చేయించుకోవాలి. ఫీజు కూడా అక్కడే చెల్లించి, సమయం ఇచ్చిన రోజున కొనుగోలు, అమ్మకం దారులు, ఇద్దరు సాక్షులతో ఆఫీసుకు వస్తే సరిపోతుంది. అమ్మకందారు భూమిని విక్రయించిన వెంటనే వివరాలు నమోదు చేసి కొనుగోలుదారుకు పాస్‌బుక్ ఇస్తాం. పాస్‌బుక్ అందుబాటులో లేకపోతే విక్రయించినట్లు పత్రాన్ని అందజేస్తాం. కొత్త బుక్కును ఇంటికే కొరియర్ చేస్తాం.
- మునీందర్, తహసీల్దార్ (వేములవాడ)
ఎంతో ప్రయోజనం..
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తున్న ధరణి పోర్టల్ ఎన్నో మార్పులకు వేదిక అవుతుంది. ప్రక్రియ సులభతరంగా ఉండడమే కాదు సేవల్లో పారదర్శకత ఉంటుంది. అర గంటలోనే క్రయ విక్రయాలకు సంబంధించిన అన్ని పనులతోపాటు పత్రాలు ఇచ్చే పని కూడా పూర్తయ్యేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే సంబంధిత వ్యక్తి పూర్తి హక్కులను పొంది, నిశ్చింతగా ఇంటికి వెళ్లవచ్చు. ఏ దస్త్రం కోసం ఎవరి వద్దకు తిరగాల్సిన అవసరం ఉండదు. స్లాట్ బుక్‌చేసుకునే విధానం కూడా చాలా సులువుగా ఉన్నది. మా అనుభవం ప్రకారం చూస్తే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనే ఈ విధానం కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడమే ఆలస్యం ఆ వెంటనే పని మొదలుపెడతాం.
- శ్రీనివాస్, తహసీల్దార్ (కొత్తపల్లి)
ఎన్నో సౌకర్యాలు..
రెవెన్యూలో రిజిస్ట్రేషన్లలో అనేక ఇబ్బందులు దూరం కానున్నాయి. గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. అత్యంత సులభంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కూర్చున్న చోటు నుంచే అన్ని వివరాలు నమోదు చేసుకోవచ్చు. వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ దాకా మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుంది. ప్రధానంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇదే సమయంలో ఫొటోలు, బయోమెట్రిక్ వేలి ముద్రలతో పకడ్బందీగా రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. నమోదుకు ఓటీపీ సిస్టమ్‌ను సైతం అమలు చేస్తున్నారు. అంతేకాదు, గతంలో మాదిరిగా బ్యాంకులకు వెళ్లి చలాన్లు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే ఆన్లైన్లో మార్కెట్ విలువను పేమెంట్ చేసే వెసులు బాటు కూడా కల్పించారు.
పౌరుల చేతుల్లోనే..
రెవెన్యూ వ్యవహారాలన్నీ పౌరులచేతుల్లోనే ఉండేలా నూతన చట్టాన్ని రూపొందించారు. క్రయవిక్రయాల కోసం అర్జీదారు ముందుగా ‘మీ సేవ’కు వెళ్లి తమ భూమి వివరాలు పక్కాగా సాక్షులతోసహా నమోదు చేయించుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ స్లాట్ (టైం) కేటాయిస్తారు. అర్జీదారు నమోదు చేసిన వివరాలే ఫైనల్‌గా ఉంటాయి. ఎక్కడైనా పొరపాటు జరిగితే వివరాలు నమోదు చేయించుకున్న అర్జీదారే బాధ్యుడవుతాడు. సర్వేనంబర్ ఎంటర్ చేస్తే ఎంత స్టాంపు డ్యూటీ కట్టాలో కూడా ప్రత్యక్షమవుతాయి. ఈ చాలన్ ద్వారా చెల్లించి బుక్ చేసుకున్న స్లాట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను గంటలో పూర్తిగా చేయవచ్చు.
- శ్రీకాంత్, తహసీల్దార్ (ఎల్లారెడ్డిపేట)
నమ్మకాన్ని నిలబెడుతాం..
ధరణి పోర్టల్‌తో ‘రెవెన్యూ’ సేవలు సులభతరం కానున్నాయి. తహసీల్దార్ విధులతోపాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసి, సర్కారు నమ్మకాన్ని నిలబెడుతాం. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకంలో ముద్రిస్తాం. పాస్ పుస్తకం లేని రైతులకు కొత్తది తయారు చేసి వారంలో ఇంటికే పంపిస్తాం.
- నరేశ్, తహసీల్దార్ (చందుర్తి)
పది నిమిషాల్లోనే పట్టా బుక్కు
ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి తహసీల్దార్ ఆఫీసులో అన్ని ఏర్పాట్లూ చేశాం. ఇప్పటికే 28 ట్రయల్ రిజిస్ట్రేషన్లను విజయవంతంగా కంప్లీట్ చేశాం. ధరణి పోర్టల్‌ను గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించిన అనంతరం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలు పెడతాం. అన్నీ వివరాలు నమోదు చేసిన తర్వాత 10 నిమిషాల్లోనే కొనుగోలు చేసిన వారికి పట్టా దారు పాసు పుస్తకం, డాక్యుమెంట్లు ఇస్తాం.
- పీ సంపత్, తహసీల్దార్ (ధర్మారం)
తిరిగే బాధ ఉండదు..
ధరణితో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు సులభతరమవుతాయి. గతంలో భూమి కొనాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుకు, రికార్డుల్లో చేర్చేందుకు రెవెన్యూ కార్యాలయానికి వచ్చేవారు. దీంతో ఖర్చులు, సమయం వృథా అయ్యేది. కానీ ఇప్పుడా బాధ ఉండదు. రెవెన్యూ కార్యాలయంలోనే గంటలోపే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకం చేతికి వస్తుంది. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావుండదు. పారదర్శక సేవలు అందుతాయి.
- శ్రీనివాస్, తహసీల్దార్ (గంగాధర)
అంతా సిద్ధం చేశాం..
జిల్లా రెవెన్యూ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం చేశాం. సర్వాంగ సుందరంగా కార్యాలయా లను తీర్చిదిద్దాం. మూడుచింతలపల్లిలో సీఎం ప్రారంభించగానే జిల్లాలో మొదలు పెడతాం. ఇది రెవెన్యూ చరిత్రలో సరికొత్త అధ్యాయమనే చెప్పాలి. పోర్టల్‌తో ఎలాంటి అవకతవకలు జరుగకుండా సేవలందుతాయి. రైతులు, ప్రజలు అధికారులకు సహకరించాలి.
- జయంత్‌కుమార్, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోషియేషన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు (ఎల్లారెడ్డిపేట)
అక్రమాలకు తావుండదు..
ధరణి పోర్టల్‌తో పౌరులకు వందశాతం పారదర్శకమైన సేవలు అందుతాయి. ఇది పూర్తిగా ఆన్లైన్లో చేసే ప్రక్రియ కావడంతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు తావుండదు. స్లాట్ బుకింగ్ విధానంతో క్రయవిక్రయాలు చేసే రైతులకు సమయం ఆదా కావడంతోపాటు ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియతో మున్ముందు ఎలాంటి సమస్యా రాదు. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తుండడంతో లావాదేవీలకు సంబంధించి పూర్తి బాధ్యత క్రయ విక్రయదారులపై ఉంటుంది.
- నడిమెట్ల సత్యనారాయణ, తహసీల్దార్ (కోరుట్ల)
వివాదాలు తలెత్తవు..
ధరణి పోర్టల్, భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. దీంతో అనేక డౌట్స్ క్లియర్ అయ్యాయి. కొత్త రెవెన్యూ చట్టంతో అందరికీ మేలు జరుగుతుంది. అగ్రికల్చర్ భూములను మండలస్థాయిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరం. భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి వివాదాలు తలెత్తవు. భూములు కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో నమోదు అవుతుంది. ఆ వెంటే మ్యుటేషన్ కూడా అయిపోతుంది.
- రాజమనోహర్‌రెడ్డి, తహసీల్దార్ (పెగడపల్లి)
రిజిస్ట్రేషన్లకు అంతా రెడీ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం కానుంది. జిల్లాలోని 14 రెవెన్యూ మండలాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వం సిద్ధం చేశాం. యంత్రాలు, ఇతర సామగ్రిని ఏర్పాటు చేశాం. సిబ్బందినీ కేటాయించాం. కొత్త చట్టానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులకు ఇప్పటికే మార్గ నిర్దేశం చేశాం. సీఎం ప్రారంభించిన తర్వాత జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తాం.
- లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్(పెద్దపల్లి)
అంతా సిద్ధం చేశాం..
నూతనంగా అమలు చేస్తున్న ధరణి వెబ్ సేవల ప్రారంభం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆఫీసులో ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించి, కంప్యూటర్లు, స్కానర్లతో పాటు అన్ని రకాల మిషనరీ పరికరాలను సిద్ధం చేసి పెట్టాం. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మొదలు పెడతాం. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు సంబంధిత పత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలి.
- వేణుగోపాల్, తహసీల్దార్ (మంథని టౌన్)
గొప్పగా ఉండబోతున్నది..
కొత్త రెవెన్యూ చట్టం చాలా గొప్పగా ఉండబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇప్పటికే మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వెబ్‌సైట్‌ను చాలా గొప్పగా.. సులభతరంగా రూపొందించారు. అది గొప్ప ఫలితాలనిస్తుంది. ఎలాంటి అవినీతి, అవకతవకలకు తావుండదు. రిజిస్ట్రేషన్ రోజే మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకం వస్తుంది. అమ్మిన వారికి తన భూమి ఎంత ఉందో కూడా చూపిస్తుంది. ఇలా అన్ని రకాల ప్రత్యేకతలు ఈ పోర్టల్‌లో ఉన్నాయి.
- దుర్శెటి శ్రీనివాస్, తహసీల్దార్ (పెద్దపల్లి)
తాజావార్తలు
- కత్తితో పొడిచి.. గొంతు కోశాడు
- సుశాంత్ సింగ్‌కు దక్కిన గొప్ప గౌరవం
- తెలంగాణ యాదిలో.. అమృతవర్షిణి.. అచ్చమాంబ
- సబ్సిడీ ఎరువు.. ఇకపై నెలకు 50 బస్తాలే
- పది లక్షల మందికి కొవిడ్ టీకా
- ప్రమాదమెరుగని ఆర్టీసీ డ్రైవర్లు వీరు
- స్టైలిస్ట్‌తో మరీ ఇంత చనువుగానా.. సమంత పిక్ వైరల్
- నేటినుంచి లాసెట్ రెండో విడుత కౌన్సెలింగ్
- పాఠాలతో పాటే పంటలూ...
- రైతులతో కేంద్రం నేడు 11వ విడత చర్చలు