శనివారం 05 డిసెంబర్ 2020
Karimnagar - Oct 28, 2020 , 01:01:16

సమన్వయంతోనే కొవిడ్‌ నియంత్రణ

సమన్వయంతోనే కొవిడ్‌ నియంత్రణ

కరీంనగర్‌ హెల్త్‌ : వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడంతోనే కొవిడ్‌-19 నియంత్రణలోకి వచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సయ్యద్‌ అలీ ముర్తాజా పేర్కొన్నారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారులతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సుమారు 70 శాతం బాధితులకు లక్షణాలు లేవని, వారితోనే ఇతరులకు వ్యాప్తి చెందుతుందన్నారు. కొవిడ్‌ లక్షణాలున్న వారికి నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు.  పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ కేసులు తక్కువగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, కేసులు పెరిగిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా మాస్క్‌లు ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదన్నారు. ఇలాగే అజాగ్రత్తగా ఉంటే రానున్న చలికాలంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు ఇప్పటి నుంచి జనవరి వరకు కరోనాపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. వైద్య,ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య సిబ్బంది కరోనా నియంత్రణకు ఎంతో కృషి చేశారని, ఇదే స్ఫూర్తితో వ్యాక్సిన్‌ వచ్చే వరకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పని చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, డీడబ్ల్యూవో శారద, టీబీ అధికారి రవీందర్‌రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.