గురువారం 03 డిసెంబర్ 2020
Karimnagar - Oct 28, 2020 , 01:01:15

ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

పరిష్కార మార్గాలు చూపాలి 

డీజీపీ మహేందర్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం : ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తూ వేగవంతంగా విచారణలు చేపట్టి పరిష్కార మార్గాలను చూపాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతివారం సమీక్ష నిర్వహించాలన్నారు. వేగంగా సేవలందించడం ద్వారా పోలీస్‌శాఖ ప్రతిష్ట పెంపొందుతుందనే విషయాన్ని ప్రతిస్థాయి అధికారి గుర్తించాలన్నారు. విద్యార్థినులపై ఎలాంటి నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నేరాలను వేగంగా ఛేదించాలన్నారు. అన్ని రకాల కేసులను నిర్ణీత గడుపులోగా దర్యాప్తు చేయాలన్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. పెండింగ్‌ కేసులు తక్కువగా ఉండడంతో దరఖాస్తుల పరిష్కారంలో కమిషనరేట్‌ రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతుండడంపై సీపీ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డి వివిధ రకాల కేసుల స్థితిగతులను వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీజీపీలు జితేందర్‌, గోవింద్‌సింగ్‌, అభిలాష్‌ బిస్త్‌, నార్త్‌జోన్‌ ఐజీపీ వై నాగిరెడ్డి, అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, టౌన్‌ ఎసీపీ అశోక్‌, రూరల్‌ ఏసీపీ విజయసారథి పాల్గొన్నారు.