సోమవారం 30 నవంబర్ 2020
Karimnagar - Oct 27, 2020 , 05:15:22

ప్రతి గింజా కొంటాం

ప్రతి గింజా కొంటాం

  • నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం 
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

హుజూరాబాద్‌ రూరల్‌: రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సోమవారం పట్టణ సమీపంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దసరా సందర్భంగా రెండ్రోజులు సెలవులు రావడం, హమాలీల కొరతతో కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ఆలస్యమైందని, కానీ నేటి నుంచి ప్రతి గ్రామంలో కొనుగోళ్లు మొదలు పెడతామని చెప్పారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రెండ్రోజుల కింద రైస్‌ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాలతో నల్లబడిన ధాన్యాన్నీ కొనాలని, తిప్పి పంపకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన 24 గంటల్లోనే ధాన్యాన్ని కొనాలని సూచించారు.

రైతులు వర్షాలతో ఇబ్బందులు పడుతుండడం, ఇదే అదనుగా ట్రాక్‌ మిషన్‌ ఏజెంట్లు ఎక్కువ రేట్లు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలా జరుగకుండా సర్పంచ్‌, ఎంపీటీసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఏ విషయంలోనూ రైతాంగానికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సలహాదారు బండ శ్రీనివాస్‌, హుజూరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమ, సింగిల్‌ విండో చైర్మన్‌ కొండల్‌రెడ్డి, నాయకులు గందె శ్రీనివాస్‌, కొలిపాక శ్రీనివాస్‌ ఉన్నారు.