గురువారం 26 నవంబర్ 2020
Karimnagar - Oct 24, 2020 , 02:07:08

‘సద్దుల’కు వేళాయె.. నేడు పెద్ద బతుకమ్మ

‘సద్దుల’కు వేళాయె.. నేడు పెద్ద బతుకమ్మ

ఊరూరా ఆడిపాడనున్న ఆడబిడ్డలు

పూలవనం కానున్న పల్లెలు, పట్టణాలు

వేడుకలకు పూర్తయిన ఏర్పాట్లు

నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్‌, బారికేడ్లు

వీధుల్లో విద్యుత్‌ వెలుగులు

శుక్రవారం కళకళలాడిన మార్కెట్లు

ఈ సారి పెరిగిన పూల ధరలు 

కరోనా నిబంధనలు పాటించాలని అధికారుల సూచనలు 

(కార్పొరేషన్‌/ కొత్తపల్లి/ కరీంనగర్‌ కల్చరల్‌)

బతుకమ్మ సంబురం ఈ నెల 16న మొదలైంది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధీ హోరెత్తుతున్నది. శనివారం జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే చాలాచోట్ల పూలను తెచ్చి ఇళ్లలో భద్రపరిచారు. ఉదయం నుంచే బతుకమ్మలను పేర్చి, సాయంత్రం కూడళ్ల వద్ద ఆడిపాడి, జలవనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వాయినాలు ఇచ్చిపుచ్చుకొని సత్తుపిండి పంచుకుంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఇండ్లకు చేరుకుంటారు.  

రద్దీగా మార్కెట్లు.. 

సద్ద్దుల సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాకేంద్రాలతోపాటు గోదావరిఖని, మెట్‌పల్లి, హుజూరాబాద్‌, జమ్మికుంటలో కిటకిటలాడాయి. ఉదయం నుంచే అటు అమ్మకందారులు, ఇటు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. కరీంనగర్‌లోని మార్కెట్‌ రోడ్డు, టవర్‌ సర్కిల్‌, తెలంగాణ తల్లి చౌరస్తా రోడ్లన్నీ కిటకిటలాడాయి. గోదావరిఖనిలో ప్రధాన చౌరస్తా ప్రాంతం పూల జాతరను తలపించింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి పూలను తీసుకువచ్చి విక్రయించగా, కొనుగోలు చేసేందుకు వచ్చిన నగరవాసులతో కళకళలాడింది.  

స్వల్పంగా పెరిగిన ధరలు..

ఇటీవలి వర్షాలకు ఈసారి పూలతోటలు కొంత  మేర దెబ్బతిన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుండగా, స్వల్పంగా ధరలు పెరిగాయి. మొన్నటి వరకు కిలో 70లోపు ఉన్న బంతి పూలు, ఇప్పుడు 150 నుంచి 200 వరకు పలుకుతున్నాయి. పట్టుకుచ్చులు కట్టను బట్టి 100 నుంచి 150 వరకు, గునుగు 5 నుంచి 7 కట్టలకు 100 వరకు, తంగేడు 10 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు. గుమ్మడి పూలు ఒక్కొక్కటి 10 నుంచి 15 వరకు, చామంతి 300 నుంచి 350 వరకు అమ్ముతున్నారు. 

పూర్తయిన ఏర్పాట్లు..

సద్దుల పండుగ కోసం అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా చోట్ల పిచ్చిమొక్కలను తొలగించి, బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా స్థలాలను చదును చేశారు. చెరువులు, కుంటల వద్ద లైటింగ్‌తోపాటు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతాలకు వెళ్లే వీధుల వెంట కూడా లైటింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అన్ని విధాలా సేవలందించేందుకు వీలుగా బల్దియాల సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా ఈ సారి చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులతో జోరుగా పనులు                                        కొనసాగిస్తున్నారు. 

కరీంనగర్‌ బల్దియా పరిధిలో అన్ని ఏర్పాట్లూ చేశారు. నగర శివారులోని మానేరు తీరం, గార్లకుంట, వేదభవన్‌ ప్రాంతాలతోపాటు రేకుర్తి, కొత్తపల్లి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌, సీతారాంపూర్‌, అల్గునూర్‌, సదాశివపల్లి, మానకొండూర్‌ చెరువు.. మొత్తం 15కుపైగా పాయింట్లలో నిమజ్జన కోసం సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి డివిజన్‌లో బతుకమ్మ ఆడేందుకు ఏర్పాటు చేసిన పాయింట్‌ వద్ద లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకే పనులన్నీ దాదాపుగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కొవిడ్‌ నిబంధనలను పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, పండుగ సురక్షితంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు, మోతె చెరువు, గొల్లపల్లి రోడ్డులోని వాగు, తారకరామనగర్‌లోని ఎస్సారెస్పీ కెనాల్‌ వద్ద మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చింతకుంట, మోతె, గొల్లపల్లి రోడ్డులోని వాగు వద్ద విద్యుద్దీపాలను అమర్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి చెరువుల వద్ద పనులను పరిశీలించారు. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరంలో చేస్తున్న ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, కమిషనర్‌ రాజలింగం పరిశీలించారు. మున్సిపల్‌ సిబ్బంది గోదావరి ఒడ్డున, గోదావరికి వెళ్లే దారిలో పారిశుధ్య పనులు పూర్తి చేశారు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉన్నందున గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.  

రాష్ట్రంలోనే అతిపెద్ద బతుకమ్మ ఘాట్‌ రాజన్న సిరిసిల్ల మానేరు తీరంలో ఉన్నది. ఎప్పట్లాగే ఈ సారి సద్దుల వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. చెత్తా చెదారం లేకుండా ముస్తాబు చేశారు. మానేరు తీరం వెంట లైటింగ్‌ సిద్ధం చేశారు. 

వేడుకలకు పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, కుంటల వద్ద విద్యుద్దీపాలను అమర్చారు. పెద్దపల్లిలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిరెడ్డి మమతారెడ్డి, గోదావరిఖని సమక్క సారక్క గద్దెల వద్ద గోదావరి తీరంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, నగర మేయర్‌ బింగి అనీల్‌కుమార్‌, మంథనిలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, సుల్తానాబాద్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీతగౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు.