శుక్రవారం 04 డిసెంబర్ 2020
Karimnagar - Oct 23, 2020 , 04:45:16

పుస్తక పఠనంతో అపార విజ్ఞానం

పుస్తక పఠనంతో అపార విజ్ఞానం

  • రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • ‘రేకొండ సామాజిక చైతన్యం- గ్రామీణ స్థితిగతులు’ పుస్తకావిష్కరణ  

చిగురుమామిడి: పుస్తక పఠనంతో అపార విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉద్ఘాటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తన చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభూతులను ప్రస్తుతిస్తూ పుస్తకాన్ని రచించడం గొప్ప విషయమన్నారు. మండలంలోని రేకొండ పాఠశాలలో చాడ రచించిన ‘రేకొండ సామాజిక చైతన్యం-గ్రామీణ స్థితిగతులు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకం గ్రామీణ జీవనవిధానానికి అద్దంపడుతున్నదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాడ వెంకట్‌రెడ్డితో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలకు రూపకల్పన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతికి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ఆయన మరణం తనను బాధించిందన్నారు. రాష్ట్రం నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందన్నారు. 

రేకొండ ఎదుగుదలకు తోడ్పడింది: చాడ

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ ఎదుగుదలకు రేకొండ ఎంతో దోహదపడిందన్నారు. ఇక్కడి ప్రజల సహకారంతోనే అనేక పదవులను పొందానని చెప్పారు. 1972లో ది రేకొండ హలిక్‌ శ్రమజీవి కో ఆపరేటివ్‌ సోసైటీని ఏర్పాటు చేశానని గుర్తు చేసుకున్నారు.  

చాడ పుస్తకం స్ఫూర్తిదాయకం: కలెక్టర్‌ శశాంక

గ్రామాల్లోని సామాజిక చైతన్యం ఆర్థిక స్థితిగతులపై సీపీఐ రాష్ట్ర నేత చాడ రాసిన పుస్తకం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కలెక్టర్‌ శశాంక అన్నారు. వ్యక్తులు శాశ్వతంగా కాదని, చరిత్రే శాశ్వతమని వ్యాఖ్యానించారు. పుస్తక పఠనంతో మేథోశక్తి పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ జంగ రమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సర్పంచ్‌ పిట్టల రజిత, ఎంపీటీసీలు కొత్తూరి సంధ్య, చాడ శోభ, కవి, రచయిత అన్నవరం దేవేందర్‌, ఎంపీడీవోలు కరివేద మల్లారెడ్డి, ఖాజా మొయినొద్దీన్‌, తహసీల్దార్‌ ముబిన్‌ అహ్మద్‌, మండల ప్రత్యేకాధికారి బాల సురేందర్‌, జిల్లా ఆరోగ్య పిల్లల వైద్య నిపుణుడు అజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నేత కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్‌ చాడ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.