బుధవారం 02 డిసెంబర్ 2020
Karimnagar - Oct 23, 2020 , 04:45:13

ఎముల వాడ పూలవనం

ఎముల వాడ పూలవనం

  • రాజన్న క్షేత్రంలో కనుల పండువలా సద్దుల బతుకమ్మ
  • ఆనవాయితీ ప్రకారం ఏడు రోజులకే వేడుక
  • ఆడబిడ్డల ఆటాపాటలతో మార్మోగిన కూడళ్లు
  • ‘పోయిరా గౌరమ్మా ..’ అంటూ ఘన వీడ్కోలు 
  • బొమ్మకల్‌లోనూ హోరెత్తిన సంబురం

రాజన్న క్షేత్రం ఎములాడ పూల వనాన్ని తలపించింది. ఆనవాయితీ ప్రకారం ఏడు రోజులకు నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఆడబిడ్డల సందడితో మూలవాగు మురిసిపోయింది. గురువారం ఉదయాన తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, సాయంత్రం పట్టణంలోని కూడళ్ల వద్ద ఉంచి చీకటి పడేదాకా సంబురంగా ఆడిపాడారు. ఆ తర్వాత మూలవాగుకు తీసుకొచ్చి ఆటాపాటలతో హోరెత్తించారు. ఆ తర్వాత వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఉత్సవాల్లో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, వేములవాడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి పాల్గొన్నారు.

- వేములవాడ/ వేములవాడ కల్చరల్‌ 

వేములవాడ/ వేములవాడ కల్చరల్‌/ కొత్తపల్లి/ కరీంనగర్‌ రూరల్‌: వేములవాడ రాజన్న క్షేత్రంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మూలవాగులో ఎటుచూసినా రంగు రంగుల పూలు వికసించాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు.. ఆడబిడ్డల ఆటపాటలతో వాగు పరిసర ప్రాంతం జాతరను తలపించింది. ఉదయం నుంచి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పట్టణంలోని కూడళ్లలో పెట్టి ఆడబిడ్డలు ఆడిపాడారు. అక్కడి నుంచి మూలవాగుకు వెళ్లి ఆడారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్పవద్ద నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా  అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, మున్సిపల్‌ ఆధ్వర్యంలో మూలవాగు వద్ద ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించారు. చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవిరాజు, కమిషనర్‌ మట్ట శ్రీనివాసరెడ్డి, వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌, కౌన్సిలర్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాజన్న ఆలయ మాజీ చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యారు.

పలు గ్రామాల్లోనూ వేడుకలు

సద్దుల బతుకమ్మ వేడుకలను పలు గ్రామాల్లోనూ ఏడో రోజు నిర్వహించుకున్నారు. వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభాష్‌పల్లి, తిప్పాపూర్‌, జయవరం, వట్టెంల, శాత్రాజుపల్లి, ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి, బోయినపల్లి మండలం వరదవెల్లి, మానువాడ, కరీంనగర్‌రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌ గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.

వేములవాడలో ఏడో రోజు, మిగతా ప్రాంతాల్లో తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ పండుగ జరుగుతుందని, ఇక్కడి ఆడబిడ్డలు తల్లిగారింట, అత్తగారింట జరుపుకోవచ్చని, ఇది వేములవాడ మహిళల అదృష్టమని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి తెలిపారు. బతుకమ్మ సంబురాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆమె మాట్లాడారు. సద్దుల బతుకమ్మకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం తాను ఎక్కడా చూడలేదని, ఇలాంటి వేడుకకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన అధికారులు, మున్సిపల్‌ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ ఇక్కడి మహిళలు సద్దుల బతుకమ్మ పండుగను పుట్టినింట, మెట్టినింట జరుపుకుంటారని, మరెక్కడా ఇలాంటి అవకాశం  ఉండదని అన్నారు. కాగా, వేడుకలను డీఎస్పీ చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.