గురువారం 03 డిసెంబర్ 2020
Karimnagar - Oct 21, 2020 , 01:28:45

ధరణి వచ్చేస్తోంది

ధరణి వచ్చేస్తోంది

దసరా నుంచి అందుబాటులోకి పోర్టల్‌! 

ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధం చేసిన కలెక్టర్లు  

కొత్తగా రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేస్తున్న రెవెన్యూ శాఖ 

కరీంనగర్‌ ప్రతినిధి/ కరీంనగర్‌, నమస్తే తెలంగాణ:

దసరా సందర్భంగా ఆరంభం కానున్న ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ వ్యవహారాలను రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధి నుంచి తొలగించి, రెవెన్యూ శాఖ ఆధీనంలోని తహసీల్దార్లకు అప్పగించింది. ఇందులో భాగంగా ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే అవకాశాలున్నాయని, అధికారులు అన్నీ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీంతో శని, ఆదివారాల నుంచే రెవెన్యూ అధికారులు మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో సకల ఏర్పాట్లు పూర్తి చేసుకొని, ట్రయల్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. అలాగే గ్రామ, మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయేతర భూముల ఆస్తులు, నిర్మాణాల వివరాలను సైతం ధరణి వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారంతో గ్రామ కంఠం పరిధిలోని నిర్మాణాలు, మున్సిపాలిటీల్లోని నిర్మాణాల వివరాలను ఆన్‌లైన్‌ చేసే కార్యక్రమం ముగిసింది. ఒకవైపు ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మరో వైపు గ్రామ కంఠం, మున్సిపల్‌ పరిధిలోని వ్యవసాయేతర గుర్తింపుతో ఇక నుంచి పారదర్శక వ్యవహారాలకు మార్గం సుగమం అయ్యింది. 

ధరణితో రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలకు, మ్యుటేషన్లకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇప్పటికే కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, డీటీపీ ఆపరేటర్లకు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై శిక్షణ పూర్తి చేశారు. ఆదివారం నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా ట్రయల్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. ప్రతి రోజూ ఐదు లేదా ఆరు రిజిస్ట్రేషన్లు (డమ్మీ) చేయడంతో పాటు సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, పార్టీషన్‌ డీడ్‌, తదితర సాఫ్ట్‌వేర్‌లను సరి చూసుకుంటున్నారు. వెబ్‌ కెమరాలు బిగించారు, స్కానర్లు, ప్రింటర్లను అమర్చారు. అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డీటీపీ ఆపరేటర్లతో పాటు, మూడు నాలుగు కేంద్రాలకు ఒక సూపర్‌వైజింగ్‌ ఆపరేటర్‌ను సైతం నియమించనున్నారు. అలాగే ఇంటర్‌నెట్‌ స్పీడ్‌ సైతం రిజిస్ట్రేషన్లకు సరిపోయేలా, సిస్టమ్స్‌కు సపోర్ట్‌ చేసేలా ఏర్పాటు చే సుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెం టనే రిజిస్ట్రేషన్లు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.

మార్గదర్శకాల తర్వాత రెండో విడుత 

మున్సిపాలిటీలు, గ్రామ కంఠాల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇప్పటి వరకు 90 శాతానికి పైగా పూర్తి కాగా, మిగిలిన వాటిని ఆన్‌లైన్‌ ప్రక్రియను మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం చేపట్టే అవకాశాలున్నా యి. ఇంటి యజమానులు చనిపోవడం, రిజిస్ట్రేషన్‌ చేసుకొని సైతం మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నమోదు చేసుకోని ఆస్తులు, ఆధార్‌కార్డు లే ని వారి ఆస్తులు, విదేశాల్లో ఉన్న వారి ఆస్తుల వివరాలు ఇంత వరకు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత వాటికి అనుగుణంగా ఆయా ఆస్తుల నమోదు ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.  

కరీంనగర్‌ జిల్లాలో..

జిల్లాలోని 313 పంచాయతీల్లో 2,04,153 ఇండ్లు ఉండగా 1,93,711 ఇండ్ల వివరాలను ఈ పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేసి, 94.88 శాతం పూర్తి చేశారు. ఇందులో 10,442 ఇండ్లు పెండింగ్‌లో ఉన్నట్లు డీపీవో వీర బుచ్చయ్య తెలిపారు. కాగా, 6,601 ఇండ్లకు తాళాలు వేసి ఉన్నట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఇండ్ల వివరాలు, విదేశాల్లో ఉన్న వారి ఇండ్ల వివరాలు, అందుబాటులో లేని వారు, ఆధార్‌ కార్డులు లేని వారు, రెండేసి నంబర్లు వచ్చిన వారి వివరాలు నమోదు చేయలేదు. ఇక మున్సిపాలిటీల్లో చూస్తే కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 75,712 ఇండ్లు ఉండగా 68,670 ఇండ్ల సర్వే పూర్తయింది. అంటే దాదాపు 90 శాతానికి పైగా కరీంనగర్‌ కార్పొరేషన్‌లో అసెస్‌మెంట్‌ పూర్తయింది. జమ్మికుంటలో 12,446 ఇండ్లకు 11,382 ఇండ్లు, హుజూరాబాద్‌లో 8,364 ఇండ్లకు 7,991 ఇండ్లు, కొత్తపల్లిలో 3,354 ఇండ్లకు 3,300, చొప్పదండిలో 4,608 ఇండ్లకు 4,370 ఇండ్ల అసెస్‌మెంట్‌ పూర్తయింది. ఈ వివరాలన్నీ ధరణి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.


అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన వెంటనే సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. గత శనివారం నుంచి తహసీల్దార్లు ట్రయల్‌ రిజిస్ట్రేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. తహసీల్దార్లు ఏం చేయాలి, ఆపరేటర్లు ఏం చేయాలనే విషయమై క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు అవసరమైన ఏర్పాట్లన్నీ తాసిల్ధార్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేశాం. సైట్‌ను ప్రారంభించడమే ఆలస్యం సేవలకు ఉపక్రమిస్తాం. - జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, 

అదనపు కలెక్టర్‌, కరీంనగర్‌

ప్రజలకు చాలా ఉపయోగం

ఆస్తులనేవి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తే ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కలెక్టర్‌ శశాంక నేతృత్వంలో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో విజయవంతంగా ఆస్తుల అసెస్‌మెంట్‌ పూర్తి చేశాం. అందుబాటులో ఉన్న యజమానులందరి వివరాలు, ఆస్తుల వివరాలను సేకరించాం. దాదాపు 17 రోజుల పాటు ఈ అసెస్‌మెంట్‌ జరిగింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇందుకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం..

- వీర బుచ్చయ్య, డీపీవో, కరీంనగర్‌