మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Oct 19, 2020 , 03:20:24

శరన్నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

శరన్నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

మేయర్‌ వై సునీల్‌రావు

దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు

కార్పొరేషన్‌: దేవీశరన్నవరాత్రోత్సవాలను భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని మేయర్‌ వై సునీల్‌రావు కోరారు. నగరంలోని భగత్‌నగర్‌లో చైతన్య యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో, అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో, టవర్‌సర్కిల్‌లో ప్రతిష్ఠించిన అమ్మవార్లను ఆయన దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దేవీశరన్నవరాత్రోత్సవాలను కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు. మండపాల్లో శానిటైజర్లు ఉంచి, భక్తులు భౌతికదూరం పాటించేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అమ్మవారి కరుణతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.  నాయకుడు ధన్‌రాజ్‌, తదితరులున్నారు. 

వైభవంగా చండీహోమం 

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌లోని దుర్గా భవానీ ఆలయంలో దేవీశరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు పవనకృష్ణ ఆధ్వర్యంలో చండీహోమం, కుంకుమార్చన, పూర్ణాహుతి, అమ్మవారికి విశేష హారతులు ఇచ్చారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ వంగల లక్ష్మణ్‌, ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, శానగొండ మధుసూదన్‌, కార్పొరేటర్‌ వంగల శ్రీదేవి, పవన్‌కుమార్‌, భక్తులు పాల్గొన్నారు. 

బాలా త్రిపురా సుందరిదేవీగా అమ్మవారు

గంగాధర: మండలంలోని ర్యాలపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఉప్పరమల్యాల గ్రామాల్లో కొలువుదీరిన దుర్గామాత ఆదివారం బాలా త్రిపురా సుందరి దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి, మొక్కలు చెల్లించారు. logo