గురువారం 22 అక్టోబర్ 2020
Karimnagar - Oct 18, 2020 , 03:02:11

కరీంనగర్‌ రూపురేఖలు మార్చాం

కరీంనగర్‌ రూపురేఖలు మార్చాం

హైదరాబాద్‌ తర్వాతి నగరంగా అభివృద్ధి చేస్తాం 

భారీ వర్షాలు పడినా నీళ్లు నిలువకుండా చేశాం 

మంత్రి గంగుల కమలాకర్‌ డీఆర్‌ఎఫ్‌ వాహనాలు ప్రారంభం

కార్పొరేషన్‌ : గత ఆరేళ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి కరీంనగర్‌ రూపురేఖలు మార్చామని, రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాతి నగరంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన డీఆర్‌ఎఫ్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌)కు చెందిన వివిధ వాహనాలను మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం భారీ వర్షాలతో దేశంలోని అనేక నగరాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కరీంనగర్‌లో మాత్రం చిన్న సమస్య కూడా రాలేదన్నారు. ఎంత వర్షం వచ్చినా రోడ్లపై నిలిచిన నీరంతా 15 నిమిషాల్లోనే మురికికాల్వల ద్వారా వెళ్లిపోతున్నదని చెప్పారు. దీనికి ముఖ్య కారణం రోడ్ల అభివృద్ధేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో 14.5 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్ల కోసం అభివృద్ధి రూ.110 కోట్లను విడుదల చేసిందన్నారు. రోడ్లను, మురికికాల్వలను నాణ్యతతో నిర్మించడం, సీఎం ఆక్యూరెన్స్‌ కింద డివిజన్లలో రెండు వైపులా కాల్వలు, సీసీ రోడ్లు నిర్మించడం వల్ల వరదనీరు ఆటంకం లేకుండా వెళ్లిపోయిందని చెప్పారు. నగర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న లక్ష్యంతో 40 మంది శిక్షణ పొందిన సిబ్బందితో డీఆర్‌ఎఫ్‌ టీంను ఏర్పాటు చేశామని, భారీ వర్షాలు పడినప్పుడు నీరు నిలిచినా, చెట్లు విరిగినా, విద్యుత్‌ సమస్యలు వచ్చినా ఈ బృందం తక్షణమే స్పందిస్తుందని తెలిపారు. డీఆర్‌ఎఫ్‌ కోసం రూ.56 లక్షలు వెచ్చించామని, రెండు మొబైల్‌ వ్యాన్లు, పెద్ద వ్యాన్‌ అందుబాటులో ఉంచామన్నారు. రూ.10 లక్షలు యూనిఫాం కోసం వెచ్చించినట్లు చెప్పారు. దీనికి ట్రోల్‌ ఫీ నంబర్‌ (0878-2200100) ఏర్పాటు చేశామని, టీం 24 గంటలు పని చేస్తుందని, ఒక్కో షిఫ్ట్‌లో 12 మంది బృందం సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఆర్టీసీ వర్క్‌షాపు నుంచి గ్రావిటీ ద్వారా డ్రైనేజీ వ్యవస్థ ఉందని, దీనిని మరింత మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు వాల రమణరావు, బండారి వేణు, చాడగోండ బుచ్చిరెడ్డి, గందె మాధవి, నేతికుంట యాదయ్య, తోట రాములు, కో ఆప్షన్‌ సభ్యుడు పుట్ట నరేందర్‌, నాయకులు లెక్కల వేణు, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. logo