సోమవారం 26 అక్టోబర్ 2020
Karimnagar - Oct 02, 2020 , 02:29:51

దసరాకు ధరణి ప్రారంభం

దసరాకు ధరణి ప్రారంభం

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ):భూ సమస్యలు లేకుండా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని  రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉద్ఘాటించారు. దసరా పండుగ రోజు ధరణి పోర్టల్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియం లో గురువారం కొత్త రెవెన్యూ చట్టం, ఎల్‌ఆర్‌ఎస్‌, పంచాయతీల పరిధిలో జరిగే ఆస్తుల అసెస్‌మెంట్‌పై కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండలాల ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.  తెలంగాణలో ఉన్న భూభాగం మొత్తం రికార్డుల్లో చేర్చడమే లక్ష్యంగా ధరణి పోర్టల్‌ రూపుదిద్దుకుంటున్నదన్నారు. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తె లిపారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేయడంతోపాటు ఆస్తుల అసెస్‌మెంట్‌, నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. ఈ విషయాలపై ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకునేందుకే సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 2.77 కోట్ల ఎకరాల భూమి ఉందని, ఇదంతా ధరణి పోర్టల్‌లో రికార్డు కావాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములన్నీ నమోదు చేస్తామని, ఒక్కసా రి నమోదు చేసిన తర్వాత పేరు మార్పిడికి తప్ప ఇతర అంశాలకు తావు ఉండదన్నారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా భూములు నమోదు చేస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఒక్క క్లిక్‌ ద్వారా భూముల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎలాంటి టాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా ధరణి పోర్టల్‌ రూపొందుతుందన్నారు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ప్రజలకు సమాచారం అందించి అన్ని రకాల భూముల వివరాలు నమోదయ్యేలా  చూడాలన్నారు.  గత వ్యవస్థలో భూములకు సంబంధించిన వివాదాలే ఎక్కువగా ఉండేవని, వాటన్నింటికీ అడ్డుకట్ట వే సేందుకే నూతన రెవెన్యూ చట్టమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాలు ఉండాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌  ముందుకె ళ్తున్నారని చెప్పారు. అన్నదాతల మేలు కోసమే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, వారు కనీస బాధ్యతగా ఆస్తులను నమోదు చేయించుకోవాలని సూచించారు.  పేదల పక్షాన ఉన్న ము ఖ్యమంత్రి కాబట్టే ప్రజానుకూల నిర్ణయాలు  తీసుకుంటున్నారన్నారు. పేదలపై ఎలాంటి ఆర్థిక భారం పడని విధంగా నూతన చట్టం  నియమ నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీపీలు పిల్లి శ్రీలత మహేశ్‌, తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీలు పిట్టల కరుణ, పురుమల్ల లలిత, ఫ్యా క్స్‌ చైర్మన్‌ శ్యాం సుందర్‌రెడ్డి, తహసీల్దార్లు, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


logo