సోమవారం 26 అక్టోబర్ 2020
Karimnagar - Oct 02, 2020 , 02:29:49

శ్రీగంధం సేద్యానికి సర్కారు సాయం

శ్రీగంధం సేద్యానికి సర్కారు సాయం

సాధారణ రకం పంటలతో విసిగిపోయారా..? ఆధునిక సేద్యం.. అధిక ఆదాయాన్ని ఇచ్చే శ్రీ గంధం సాగు చేయాలని అనుకుంటున్నారా..? ఆర్థిక వనరులు.. నిర్వహణ ఖర్చులు ఎలా అని చింతిస్తున్నారా..? అలాంటి భయం ఏ మాత్రం వద్దు.. శ్రీగంధం సాగుకు రాష్ట్ర సర్కారు అభయమిస్తున్నది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా  వానకాలం నుంచి ఉపాధి హామీ పథకం కింద రాయితీలు ఇస్తున్నది. ఎకరా సాగుకు అయ్యే ఖర్చులో 2.32లక్షల సబ్సిడీ.. మరో మూడేళ్లు నిర్వహణ ఖర్చులు మంజూరు చేస్తుండగా, ఉద్యానవన శాఖ రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.  

రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. ఆధునిక సేద్యానికి ప్రోత్సాహమిస్తున్నది. చిన్న, సన్నకారు  రైతులను సంప్రదాయ పంటల వైపు నుంచి ఉద్యాన పంటలు, ప్రధానంగా శ్రీ గంధం సాగు వైపు మళ్లించాలనే లక్ష్యంతో ఈ వానకాలం సీజన్‌ నుంచి ఉపాధి హామీ కింద రాయితీలు ఇస్తున్నది. శ్రీ గంధం ఒక్కటే కాదు పండ్లతోటలైన మామిడి, జామ, సీతాఫలంతోపాటు సరుగుడు, మలబారు వేప, ఆయిల్‌ పామ్‌ సాగుకు నిర్వహణ ఖర్చులను అందిస్తున్నది. ఈ మేరకు ఈ సీజన్‌లో జగిత్యాల జిల్లాలో వివిధ రకాల పంటలతోపాటు మూడు వేల ఎకరాల్లో శ్రీగంధం సాగుకు అనుమతి ఇచ్చింది. అనువైన నేలలు, నీటి వనరుల ఆధారంగా రైతులను ఎంపిక చేయాలని ఆదేశించగా, ఉద్యానవన శాఖ రంగంలోకి దిగింది. 

శ్రీ గంధంతో మంచి ఆదాయం.. 

శ్రీ గంధం ప్రపంచంలోనే అతి ఖరీదైన కలప వృక్షం. కిలోకు రూ. 6వేల నుంచి రూ. 7వేల దాకా పలుకుతుంది. నాణ్యతను బట్టి ధర పెరుగుతుంది. ఇందులో పదుల సంఖ్యలో రకాలు ఉంటాయి. దీనికి అన్ని రకాల నేలలు అనుకూలం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే దీర్ఘకాలిక పంట ఇది. సాధారణంగా ఈ చెట్టు ద్వారా 12 ఏండ్ల నుంచి లాభాలు మొదలవుతాయి. కానీ 15 నుంచి 20 ఏండ్లకు మాత్రమే తగిన ప్రతిఫలం వస్తుంది. జీవితకాలంలో ఒక్కోచెట్టు నుంచి 20కిలోలకుపైగా కలప వస్తుంది. వృక్షంలో బెరడు, కాండం, వేర్లు అన్నీ సిరులు కురిపించేవే కాగా, ఎకరాకు రూ. 4-5 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీ గంధం మొక్కలు ఇతర మొక్కల వేర్ల నుంచి పోషకాలు గ్రహించి పెరుగుతాయి. ఈ క్రమంలో వాటికి అతిథేయి మొక్కలుగా సరుగుడు, మలబారు లాంటి మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. మలబారు వేప 6-8 ఏళ్లు, సరుగుడు మూడేళ్లలోనే చేతికందుతుంది. వీటి అమ్మకం ద్వారా రైతు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సాగు ఖర్చుతో కూడుకున్నది కావడంతో సర్కారు ప్రోత్సాహమిస్తున్నది. 

ఎకరాకు రూ.2.32లక్షల సబ్సిడీ.. 

శ్రీగంధం మొక్కలు ఎకరంలో 650 దాకా పెంచవ చ్చు. అయితే మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, కలుపుతీతకు గాను కూలీలకు రూ.1,92,641, సామగ్రి, మొక్కల కొనుగోలు, నిర్వహణ ఖర్చుల కింద తొలి ఏడాది రూ.40,084 అంటే మొత్తం రూ. 2,32,725 రాయితీ అందిస్తుంది. అలాగే మరో మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చుల కింద నిధులు సమకూర్చుతున్నది.  


logo