బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Sep 29, 2020 , 02:11:15

నాలుగు వసంతాల బతుకమ్మ సారె

నాలుగు వసంతాల బతుకమ్మ సారె

  • నాలుగేండ్లలో  నాలుగు కోట్ల  చీరలు పంపిణీ
  • ఉపాధి కేంద్రంగా నిలిచిన సిరిసిల్ల  
  • ఆడబిడ్డలకు కానుక.. నేత కార్మికులకు ఉపాధి 
  • చీరల తయారీకి 1,250 కోట్లు వెచ్చింపు  
  • కూలీ రూపంలో  320 కోట్లు చెల్లింపు   
  • ముంబై, భీవండి నుంచి  తిరిగొస్తున్న నేతన్నలు 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సమైక్య పాలనలో ‘ఉరి’సిల్లగా పేరుగాంచిన సిరిసిల్ల స్వరాష్ట్రంలో ‘సిరిశాల’గా మారింది. దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోస్తున్నది. బతుకమ్మ పండుగ పూట సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన రాష్ట్ర సర్కారు.. నాలుగేండ్లుగా ఆడబిడ్డలకు పుట్టింటి సారెను అందిస్తూ మురిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన చీరల తయారీని అప్పగించి నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. ప్రత్యక్షంగా ఏటా 15 వేల మంది నేతన్నలకు.. పరోక్షంగా 15 నుంచి 20 వేల మందికి బతుకునిస్తున్నది. గడిచిన నాలుగేండ్లలో నాలుగు కోట్ల చీరలను అతివలకు అందించగా.. రూ.320 కోట్లను కూలీ రూపంలో నేత కార్మికులకు చెల్లించి వారి భవిష్యత్తుకు బాటలు వేసింది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కల్వకుంట్ల తారకరామారావు చొరవ సిరిసిల్లను ఉపాధి ఖిల్లాగా మార్చగా.. గతంలో ఇక్కడినుంచి ముంబై, భీవండి వలస వెళ్లిన కార్మికులను తిరిగి సొంతగడ్డకు రప్పిస్తున్నది. 

20వేల మరమగ్గాలు..   15వేల మంది నేత కార్మికులు 

బతుకమ్మ చీరల తయారీ ద్వారా నేత కార్మికులకు శాశ్వత ఉపాధి లభిస్తున్నది. ఏటా ఐదు నుంచి ఆరునెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. చీరల తయారీ ద్వారా ఒక్కో కార్మికుడు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కూలీ పొందుతున్నాడు. అధికారుల గణాంకాల ప్రకారంచూస్తే.. ఏటా చీరలపై వెచ్చించే ఖర్చులో దాదాపు రూ.80కోట్ల వరకు కూలీలకే వెళ్తున్నాయి. అంటే నాలుగేళ్లలో రూ.320 కోట్ల వరకు నేతకార్మికులకు కూలీ రూపంలో అందింది. వీరితోపాటు ప్యాకింగ్‌, ట్రాన్స్‌పోర్టు వంటి అంశాల్లో మరో 15 వేల మందికి లబ్ధిచేకూరుతున్నది. చీరల తయారీలో నాణ్యత లోపించకుండా చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ నేతృత్వంలో 50 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంతో గతంలో ముంబై, భీవండికి ఉపాధి కోసం వెళ్లిన ఎంతోమంది తిరిగి సిరిసిల్లకు తరలివస్తున్నారు. ఈసారి కొవిడ్‌ సమయంలోనూ ఇక్కడి నేతన్నలకు ఉపాధి కల్పించడం గమనార్హం. 

ఏటా కోటి చీరలు

ఆడబిడ్డల పండుగ బతుకమ్మ సందర్భంగా మహిళలకు సారె(చీర) పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2017లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏటా కోటి చీరలను అందిస్తున్నది. తొలి ఏడాది సమయం సరిపోకపోవడంతో 40 శాతం చీరలను సిరిసిల్లలో తయారుచేయగా మిగతావి వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారు. 2018లో వంద డిజైన్ల తో బంగారు రంగు జరీ అంచు ప్లెయిన్‌ చీరలను మొత్తం సిరిసిల్లలోనే ఉత్పత్తిచేశారు. 2019లోనూ వంద రకాల డిజైన్లతో బంగారు జరీ అంచు, లైనింగ్‌తో వందశాతం సిరిసిల్లలోనే ఉత్పత్తి చేశారు. ఈసారి గోల్డ్‌, సిల్వర్‌ జరీతో 225 రకాల చీరలు ఉత్పత్తి చేసి ఆయా జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 95 శాతం పూర్తయింది. మిగిలిన చీరలు నెలాఖరులోగా పూర్తిచేయనున్నారు. ఇప్పటికే 75 శాతం చీరలను జిల్లాలకు సరఫరా చేశారు. ఈ ఏ డాది రూ.350కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది.logo