మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Sep 28, 2020 , 02:46:19

ఐదు గంటలు నరకయాతన

ఐదు గంటలు నరకయాతన

వీణవంక: కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ శివారు లోని మానేరు వాగులో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు వరద లో చిక్కుకోగా  రెస్క్యూటీం రంగంలోకి దిగి వారిని కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. చల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సుంకరిపల్లెకు చెందిన నేదూరి రవి, నేదూరి శ్రీనివాస్‌, మానకొండూర్‌ మండలం పచ్చునూరుకు చెందిన కోమల తిరుపతి మానేరు వాగులో చేపల వేటకు వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాగులోకి దిగగా, ఎల్‌ఎండీ గేట్లు ఎత్తి ఉండడంతో వరద ఉధృతిని అంచనా వేయలేపోయారు. దీంతో వాగులో అదుపు తప్పారు. తిరుపతి, శ్రీనివాస్‌ వాగు మధ్యలోని ఎత్తయిన ప్రదేశానికి కష్టపడి చేరుకున్నారు. రవి మాత్రం వేటకు దిగిన ప్రాంతం నుంచి కొట్టుకొని పోయి అరకిలోమీటరు దూరంలో ఓ పైపును పట్టుకొని ఉండిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తహసీల్దార్‌ కనుకయ్య, ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారికి సాధ్యం కాలేదు. ఆర్డీవో బెన్‌షాలోం, ఏసీపీ శ్రీనివాస్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించి వెంటనే పై అధికారులకు  సమాచా రం అందించారు. దీంతో గంటలో ఆరుగురు రెస్క్యూటీం సిబ్బంది అక్క డికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. తెప్పలపై వెళ్లి మొదట దూర ప్రాంతంలో చిక్కుకున్న రవిని 9గంటల తర్వాత అతి కష్టంమీద ఒడ్డుకు చేర్చారు. అనంతరం మిగతా ఇద్దరిని తీసుకువచ్చారు. ఐదు గంటలపాటు వాగులో చిక్కుకున్న ముగ్గురు సురక్షితంగా బయటకు రావడంతో అధికా రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సాహసం చేసి కాపాడిన రెస్క్యూ టీంను ఏసీపీ, తహసీల్దార్‌, స్థానికులు అభినందించారు.

కలెక్టర్‌తో మాట్లాడిన ఎంపీ సంజయ్‌

మానేరు వాగులో చిక్కుకొన్న మత్స్యకారుల విషయాన్ని ఎంపీ బండి సంజయ్‌కు సమాచారం అందించగా, ఆయన కలెక్టర్‌ శశాంక దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్‌ ఘటనా స్థలంలో జరుగుతున్న వివరాలు తెలుసుకొని రెస్క్యూటీం వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు.logo