ఆదివారం 01 నవంబర్ 2020
Karimnagar - Sep 28, 2020 , 02:41:28

ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

గ్రామ పంచాయతీల పరిధిలోని ఆస్తులన్నింటినీ అసెస్‌మెంట్‌ (అంచనా) రిజిస్టర్‌లో నమోదు చేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు అందాయి. అనుమతి ఉన్న, లేని ప్రతి ఆస్తినీ ఈ-పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలని, ఐదు రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని కమిషనరేట్‌ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని పంచాయతీల్లో సోమవారం పాలకవర్గ సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని డీపీవోలు ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. - కరీంనగర్‌, నమస్తే తెలంగాణ

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ:  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 1,215 గ్రామ పంచాయతీలుండగా, కరీంనగర్‌ లో 313, జగిత్యాలలో 380, పెద్దపల్లిలో 267, రాజన్న సిరిసిల్లలో 255 ఉన్నాయి. ఇందులో ఇండ్లు, ఫాం హౌస్‌ లు, పశువుల కొట్టాలు, ఇతర నిర్మాణాలన్నింటినీ ఈ-పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో ధరణి యాప్‌ను ఆక్టివేట్‌ చేసి, ఈ ఆస్తుల వివరాలన్నింటినీ క్రమంగా నమోదు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ-పంచాయతీ పోర్టల్‌లో పంచాయతీ పరిధిలోని ఆస్తులన్నింటినీ నిక్షిప్తం చేయాలని నిర్ణయించారు. ప్రతి ఇంటి యజమాని నుంచి ఆధార్‌కార్డు నంబర్‌, ఫోన్‌ నంబర్‌, పట్టాదారు పాసు పుస్తకం ఉంటే దాని వివరాలు, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మంది వివరాలు సేకరిస్తారు. నాలా కన్వర్షన్‌ లేని ఆస్తుల వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. ఇంటి యజమానులు మరణించినా ఇప్పటికీ అలా గే ఉన్న ఆస్తుల వివరాలు, వారి వారసులకు మ్యుటేషన్‌ చేసే ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు అందాయి. వివాదాస్పద ఆస్తుల వివరాలను కూడా సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు అసెస్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదు కాని ప్రతి ఆస్తి వివరాలు కచ్చితంగా సేకరించి, ఈ-పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గ్రామాల్లో విస్తృత ప్రచారం

ఇప్పటి వరకు అనుమతి లేకుండా జరిగిన నిర్మాణాలపై ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు గ్రామాల్లో అనుమతులు లేని నిర్మాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు ముందే ఈ విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. తద్వారా పంచాయతీ పరిధిలో అనుమతి లేని నిర్మాణాల లెక్క కూడా తేలే అవకాశం ఉన్నది. ఇప్పటికే దాదాపు అన్ని పంచాయతీల్లో అనుమతి ఉన్న నిర్మాణాలన్నింటినీ ఈ-పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు అనుమతి లేని వాటికి కచ్చితమైన అసెస్‌మెంట్‌ చేసి ఆన్‌లైన్‌లో నమో దు చేయనున్నారు. తదుపరి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేర కు ఈ ఆస్తులను క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసే బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు డీపీవోలు మండలాల వారీగా పంచాయతీ అధికారులు, కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిఒక్కరూ కచ్చితమైన అంచనాలు వేయాలని, వీటిని తనిఖీ చేసేందుకు రాష్ట్ర స్థాయిలోని ఫ్లయింగ్‌ స్కౌడ్స్‌ కూడా వస్తున్నాయని వెల్లడించారు.

నేడు అన్ని చోట్ల సమావేశాలు

ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో పంచాయతీ కార్యదర్శులకు జిల్లా స్థాయిలో అవగాహన కల్పించారు. కార్యదర్శులు పంచాయతీ పాలకవర్గాలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 28న అన్ని పంచాయతీలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించడంతోపాటు అనుమతి లేని ఆస్తులు, అనుమతి ఉండి ఇంకా ఆన్‌లైన్‌లో చేరని ఆస్తులన్నింటినీ ఈ-పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలని డీపీవోలు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో కారోబార్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థాయిలో ఉన్న ఇతర సిబ్బంది సహాయాన్ని తీసుకుని గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ధరణి యాప్‌లో నిక్షిప్తమైన తర్వాత వ్యవసాయేతర భూముల ఆస్తులన్నింటికీ ప్రత్యేకంగా పాసు పుస్తకం కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి పంచాయతీల పరిధిలోని ప్రతి ఆస్తి వివరాలను ఆన్‌లైన్‌లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.