బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Sep 25, 2020 , 02:27:58

సంజయ్‌.. చేసిందేందో చెప్పు

 సంజయ్‌.. చేసిందేందో చెప్పు

  • బీజేపీ నాయకుల తీరు హాస్యాస్పదం 
  • మేయర్‌ సునీల్‌రావు ధ్వజం

కార్పొరేషన్‌: నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీగా బండి సంజయ్‌ చేసిందేందో చెప్పు.. నిధులు తేవడం చేతగాకే అడ్డగోలు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని మేయర్‌ సునీల్‌రావు ధ్వజమెత్తారు.  కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులు, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి  తీసుకువచ్చిన నిధుల వివరాలు ఇవ్వాలని, వీటిపై తాము చర్చకు సిద్ధమని  సవాల్‌ చేశారు. స్థానిక ‘ఎస్‌బీఎస్‌' ఫంక్షన్‌ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొవిడ్‌-19 నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు ఇచ్చిందని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తప్పుడు ప్రచారం చేశారని ఆక్షేపించారు.  బీజేపీ నేతలు బియ్యం, పప్పులు, రైతులు, జన్‌ధన్‌ ఖాతాలకు నిధులు ఇచ్చామంటూ అర్థం లేని మాటలు చెబుతున్నారని విమర్శించారు. కనీసం వార్డు సభ్యుడిగా ఎన్నిక కాని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నరగా సంజయ్‌కుమార్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకువచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. పీపీఈ కిట్లు, మందులు, నిధులు ఎన్ని ఇచ్చారో చర్చకు రావాలన్నారు. తీగలగుట్టపల్లి వద్ద రైలు వస్తే గేటు వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేయించలేని చేతగాని ఎంపీ ఉన్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు బల్దియాపై కనీస అవగాహన లేకుండా  మాట్లాడుతున్నారని  దుయ్యబట్టారు.  తమ ఆరు నెలల పాలనలో రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను ఇక్కడే ఏర్పాటు చేశామన్నారు.  పారిశుద్ధ్యం మెరుగునకు రూ. 1.70 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశామన్నారు. రూ. కోటితో 20 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేశామని, రూ. 60 కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు కూడా ఇచ్చామన్నారు. వీటిలో బీజేపీ కార్పొరేటర్ల డివిజన్లలో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో రూ. 17 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పార్కులను సుందరీకరణ చేస్తున్నామని, వాకింగ్‌ ట్రాక్స్‌ అభివృద్ధికి రూ. 80 లక్షలు, రూ. 1.30 కోట్లతో 30 ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి డివిజన్‌లో మినీ హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని తెలిపారు. నగరంలో భారీ వర్షాలు పడితే తాము ప్రజల మధ్య  ఉంటున్నామని, బీజేపీ నాయకులు, ఎంపీ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఐలేందర్‌ యాదవ్‌, దిండిగాల మహేశ్‌, తోట రాములు, కంసాల శ్రీనివాస్‌, గందె మాధవి మహేశ్‌, గుగ్గిళ్ల జయశ్రీ, చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, బోనాల శ్రీకాంత్‌, సరిళ్ల ప్రసాద్‌, నాయకులు గంట శ్రీనివాస్‌, అర్ష మల్లేశం, ఆకుల నర్సయ్య, కాశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo