బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Sep 25, 2020 , 02:28:00

రుణాల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

రుణాల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

  •  28వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి
  • కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యాపారులకు అందజేయాల్సిన రుణాల మంజూరులో నిర్లక్ష్యం చేసే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శశాంక హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం బ్యాంకర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా అధికారులతో రుణాల మంజూరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో కొంతమంది బ్యాంకర్లు నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించామని, బ్యాంకుల వారీగా పట్టణ జనాభా ప్రకారం నిర్దేశించిన రుణాలను ఈనెల 28లోగా అందించాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాంకర్ల పనితీరుపై ఆయా యాజమాన్యాలకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకునేలా లేఖలు రాయాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. రుణాల మంజూరు గురించి మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.  ఈనెల 30వ తేదీ చివరి గడువు ఉన్నందున త్వరగా మంజూరు చేయాలని ఆదేశించినా బ్యాంకర్లు నిర్లక్ష్యం చేస్తూ పేదలకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి ఈనెల 28లోగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. రెండు రోజుల్లో లబ్ధిదారులను గుర్తించి, రుణాలు ఇవ్వాలని మున్సిపల్‌ కమిషన్లు, మెప్మా అధికారులకు సూచించారు.  డీజీఎంలు, ఏజీఎంలు రోజు వారీగా బ్యాంకుల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిశీలించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, పెండింగ్‌కు గల కారణాలను సేకరించి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, ట్రైనీ కలెక్టర్‌ అంకిత్‌, అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా ఏపీడీ, జీడీఎం ప్రసాద్‌, అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. logo