శనివారం 31 అక్టోబర్ 2020
Karimnagar - Sep 22, 2020 , 02:15:53

వేతనాలు వచ్చేశాయ్‌

వేతనాలు వచ్చేశాయ్‌

  • n కాంట్రాక్టు అధ్యాపకులకు  జీతాలు విడుదల 
  • n కోటీ57లక్షల 30వేల400
  • n జిల్లాలో 106 మందికి లబ్ధి

హుజూరాబాద్‌ టౌన్‌: కాంట్రాక్టు అధ్యాపకుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఒప్పంద అధ్యాపకులకు నాలుగు నెలల వేతనాలు విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన ప్రభుత్వం మూడు రోజుల క్రితం కళాశాలల వారీగా వేతనాలు విడుదల చేసింది.

ఉపాధ్యాయుల హర్షం

బోధనకు ఇబ్బంది ఏర్పడకూడదని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలల్లో 3,598 మంది ఒప్పంద అధ్యాపకులను ఫిక్స్‌డ్‌ వేతనంపై నియమించింది. గత కొన్నేళ్లుగా ఆయా కళాశాలలో వారు బోధిస్తున్నారు. ప్రభు త్వం అధ్యాపకులకు 2019-20 విద్యా సంవత్సరం మార్చి చివరి వరకు వేతనాలు అందించింది. కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోవడంతో జూన్‌, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు అందక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాలుగు నెలల వేతనాలు విడుదల చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

106మందికి వేతనాలు

జిల్లాలో 11ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఈ కళాశాలలో 106 మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలో జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి నెలకు రూ.37,100 చొప్పున ప్రభుత్వం వేతనం అందిస్తున్నది. 106 మందికి సెప్టెంబర్‌ నెల వరకు నాలుగు నెలకు కలిపి రూ.కోటీ57లక్షల 30,400 విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీ నుంచి మరుసటి సంవత్సరం మే 31 వరకు 12 నెలల ఒప్పంద పద్ధతిలో ఉద్యోగంలో కొనసాగేలా ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకులను నియమించింది.