శనివారం 31 అక్టోబర్ 2020
Karimnagar - Sep 22, 2020 , 02:15:55

శానిటరీ న్యాప్కిన్స్‌ మేడిన్‌ లచ్చక్కపేట

శానిటరీ న్యాప్కిన్స్‌ మేడిన్‌ లచ్చక్కపేట

  • lతయారీలో ‘చిట్యాల’ దంపతులు 
  • lనాణ్యతకు పెద్దపీట.. బ్రాండెడ్‌కు దీటుగా ఉత్పత్తి
  • l‘జీ శానిటరీ ప్యాడ్స్‌' పేరిట తక్కువ ధరకే విక్రయం
  • lప్రతి నెలా 20వేలకు పైనే నికర ఆదాయం 

శానిటరీ న్యాప్కిన్స్‌ను మహిళలు పట్టణాల్లో అయితే షాపుల వద్దకు వెళ్లి తెచ్చుకోగలుగుతున్నారు. కానీ, పల్లెల్లో..? నేటికీ ఇబ్బందే. అవగాహన లేక, ఉన్నా ఎక్కువ ధర ఉండడం, షాపుల్లో అందుబాటులో లేకపోవడం.. వంటి కారణాలతో ఎక్కువ శాతం గ్రామీణ మహిళలు నాప్కిన్స్‌కు దూరంగా ఉంటున్నారు. ఎంతోమంది అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. వీటన్నింటినీ గమనించిన చిట్యాల దంపతులు, మహిళల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా లచ్చక్కపేటలో శానిటరీ న్యాప్కిన్స్‌ తయారీకి శ్రీకారం చుట్టారు. నాణ్యతకు పెద్దపీట వేసి, తక్కువ ధరకే బ్రాండెడ్‌కు దీటుగా అందిస్తున్నారు. - సారంగాపూర్‌

సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేటకు చెందిన చిట్యాల లావణ్య, భూమారెడ్డి దంపతులు. గ్రామంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. కాలానికి అనుగుణంగా పంటలు వేస్తుంటారు. లావణ్య గ్రామంలోని శ్రీవైష్ణవి మహిళా సంఘంలో సభ్యురాలు. ఆదాయాభివృద్ధికి ఏదైనా కొత్తగా చేయాలని ఆ భార్యాభర్తలు భావించారు. కానీ, సామాజిక కోణంలో ఉండాలనుకున్నారు. అప్పుడు శానిటరీ న్యాప్కిన్స్‌ తయారీ వారి దృష్టికి వచ్చింది. పట్టణాల్లో అయితే మహిళలు షాపుల వద్దకు వెళ్లి తెచ్చకుంటున్నారు. కానీ, పల్లెల్లో ఎంతో మంది మాత్రం పూర్తి స్థాయి అవగాహన లేక, ఉన్నా షాపుల వద్దకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ఇద్దరూ చర్చించి, మహిళల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా శానిటరీ న్యాప్కిన్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పల్లెల్లోనూ ప్యాడ్స్‌ తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నారు. గ్రామైక్య సంఘం, మండల సమాఖ్య సహకారంతో 2లక్షలు, ‘ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ పథకం’ కింద మరో 5లక్షలు రుణం తీసుకున్నారు. నాప్కిన్స్‌ తయారీపై ఆన్‌లైన్‌తోపాటు బెంగళూర్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో శిక్షణ తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్‌ నుంచి 5లక్షల విలువ చేసే యంత్రాలను తెప్పించారు. ఎనిమిది నెలల క్రితం గ్రామంలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పి, ‘జీ శానిటరీ ప్యాడ్స్‌' పేరిట న్యాప్కిన్స్‌ను తయారు చేస్తున్నారు. 

 నాణ్యత.. తక్కువ ధర.. 

లావణ్య దంపతులు న్యాప్కిన్స్‌ను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో బ్రాండెడ్‌ కంపెనీలకు దీటుగా తయారు చేస్తున్నారు. సెంటర్‌లో నిత్యం ఎనిమిది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. రోజుకు 6వేల దాకా న్యాప్కిన్స్‌ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గుర్తింపు పొందిన కంపెనీల ఆరు న్యాప్కిన్స్‌ ప్యాకెట్‌ ధర 50 నుంచి 75 మధ్యలో దొరుకుతుండగా, వీరు మాత్రం 35కే విక్రయిస్తున్నారు. స్థానిక మహిళా సంఘాలను సమన్వయం చేసుకొని జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నాణ్యత, తక్కువ ధర ఉండడంతో వీరి ఉత్పత్తులకు చాలా పేరు వచ్చింది. అయితే క్వాలిటీకి పెద్దపీట వేస్తుండడంతో లాభాలు పెద్దగా లేవని, ప్రస్తుతం నెలకు 20వేల నికర ఆదాయం వస్తున్నదని దంపతులు చెబుతున్నారు. తక్కువ ధరకే అందిస్తున్నామనే సంతృప్తి మాత్రం ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

నాణ్యతకే ప్రాధాన్యం.. 

మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా నేను, నా భర్త కలిసి గ్రామంలో శానిటరీ న్యాప్కిన్స్‌ తయారీ కేంద్రం పెట్టినం. తయారీలో నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నం. అందుకే మా ఉత్పత్తులకు తక్కువ టైంలోనే మంచి పేరు వచ్చింది. సెంటర్‌తో మేం ఆర్థికంగా ఎదగడమే కాదు మరో ఎనిమిది మందికీ ఉపాధి కల్పిస్తున్నం. 

- చిట్యాల లావణ్య, శ్రీవైష్ణవి సంఘ సభ్యురాలు (లచ్చక్కపేట)