శుక్రవారం 30 అక్టోబర్ 2020
Karimnagar - Sep 21, 2020 , 02:32:39

బహిరంగ మద్యపానంపై పోలీసుల ఉక్కుపాదం

బహిరంగ మద్యపానంపై పోలీసుల ఉక్కుపాదం

కరీంనగర్‌ క్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ వైపు బ్లూకోల్ట్స్‌,  పెట్రోకార్‌ విభాగాలు, డ్రోన్‌ కెమెరాలతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తిస్తూ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మందుబాబులు రహస్య ప్రాంతాలను ఎంచుకున్నా ఎటునుంచైనా పోలీసులు వచ్చి చుట్టుముట్టేస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా 2016 అక్టోబర్‌ నుంచి కొన్ని నిషేధాజ్ఞలు అమలవుతున్న విషయం విధితమే. కాగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మత్తులో చేస్తున్న ఆగడాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో ఈ నిషేధాజ్ఞలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐపీసీ 188, హైదరాబాద్‌ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.  

5,462 కేసుల్లో 9,958 మంది మందుబాబులు పట్టివేత

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తిగా నియంత్రించేందుకు బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా డ్రోన్‌ కెమెరాల సహాయంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి, నలువైపులా ముట్టడించి పట్టుకోవడానికి కమిషనరేట్‌ కేంద్రంలో ప్రత్యేక విభాగం పనిచేస్తున్నది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కమిషనరేట్‌ వ్యాప్తంగా 5,462 కేసుల్లో 9,958 మందిని పట్టుకున్నారు. ఇందులో జనవరిలో 254 కేసుల్లో 479 మందిని, ఫిబ్రవరిలో 424 కేసుల్లో 456 మందిని, మార్చిలో 854 కేసుల్లో 1,033, మేలో 673 కేసుల్లో 1,380, జూన్‌లో 1,141 కేసుల్లో 2,417, జూలైలో 753 కేసుల్లో 1,512, ఆగస్టులో 703 కేసుల్లో 1,395 మందిని, ఈ నెలలో ఇప్పటి వరకు 670 కేసుల్లో 1,395 మందిని పట్టుకొని న్యాయస్థానాల్లో హాజరుపరిచారు. కేసుల తీవ్రతను బట్టి శిక్ష, జరిమానా విధించారు. 

ఓపెన్‌ డ్రింకింగ్‌ నియంత్రణతో సత్ఫలితాలు

కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నియంత్రిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. మద్యం మత్తులో మహిళలను వేధించడం, అల్లరి చేష్టలు అదుపులోకి వచ్చాయి. కొంతమంది మద్యానికి బానిసై డబ్బుల కోసం దోపిడీ, దొంగతనాలు, మహిళల మెడల్లోంచి పుస్తెలతాళ్లు అపహరించుకుపోవడం లాంటి ఘటనలు గతంలో జరిగాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నియంత్రణలో భాగంగా చేపడుతున్న చర్యల ఫలితంగా మహిళల్లో భద్రతభావం పెరిగింది. అలాగే, నేరాలు, దొంగతనాలు సైతం తగ్గాయి. 

అధికారులదే పూర్తి బాధ్యత

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తిగా నియంత్రించడంలో సంబంధిత అధికారులదే బాధ్యత. నియంత్రించడంలో విఫలమయ్యే అధికారులపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్న అన్ని స్థాయిల అధికారులకు వెంట వెంటనే రివార్డులు అందజేస్తుండడంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంపొందించే చర్యల్లో చురుగ్గా పనిచేసే వారికి రివార్డులు అందజేస్తాం.-వీబీ కమలాసన్‌రెడ్డి, సీపీ