శుక్రవారం 30 అక్టోబర్ 2020
Karimnagar - Sep 21, 2020 , 02:11:05

‘ప్రైవేట్‌'కు కట్టబెట్టేందుకే విద్యుత్‌ చట్టం

‘ప్రైవేట్‌'కు కట్టబెట్టేందుకే విద్యుత్‌ చట్టం

  • సంస్కరణల పేరిట కేంద్రం తుగ్లక్‌ నిర్ణయాలు
  • బండి సంజయ్‌ నియోజకవర్గానికి ఏం చేశారు
  • డబుల్‌ బెడ్‌ రూం వివరాలను మీడియాకు అందిస్తాం
  • దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణలో పథకాలు
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
కార్పొరేషన్‌: విద్యుత్‌ సంస్థలను ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్రం విద్యుత్‌ చట్టాన్ని తీసుకువస్తున్నదని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. సంస్కరణల పేరిట తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. ఈ విషయంలో పార్లమెంట్‌లో కలిసివచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని ప్రకటించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల విషయంలో పనికిరాని వారు చేసే వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాలను మీడియాకుఅ ఇస్తామని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ సర్కారు అమలు చేస్తున్న పథకాల ప్రాధాన్యతను వివరిస్తూనే కేంద్రం, ప్రతిపక్ష పార్టీ లు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. మోదీ సర్కా రు నిర్ణయాలతో రాష్ర్టాలు, కేంద్రం మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితి వస్తున్నదన్నారు. విద్యుత్‌ బిల్లుపై టీఎర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తారని చెప్పారు. సంస్కరణలతో ఉచిత విద్యుత్‌కు ఇబ్బందులు వస్తాయన్నారు.

అప్పు తీసుకొమ్మంటూ తప్పించుకుంటున్నది..

కేంద్రం జీఎస్టీ తీసుకువస్తే ఇష్టం లేకపోయినా అంగీకరించామన్నారు. లోటువస్తే సర్దుబాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు అప్పులు తీసుకొమ్మంటూ తప్పించుకుంటున్న దని విమర్శించారు. ఈ మూడేళ్లలో తెలంగాణ రూ.18 వేల కోట్లు నష్టపోయిందని చెప్పారు. కరోనా విషయంలోనూ ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు. కరీంనగర్‌ ఎంపీ గా బండి సంజయ్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. చిన్నపనికి కూడా నిధులు తీసుకురాలేకపోయారని అన్నారు. హైదరాబాద్‌లో కూర్చోని పిచ్చి మాటలు మాట్లాడడం తప్పా చేసిందేంలేదన్నారు. తాము ధైర్యంగా కాంగ్రెస్‌ నేతలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు చూపించామని, వారు విమర్శలు చేయడంతో భరించలేక వెళ్లిపొమ్మని చెప్పినట్లు తెలిపారు. జాబితాను అందజేస్తామని చెప్పినా వినకుండా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి పథకాలుంటే చూపాలి..

దేశంలో ఎక్కడైనా మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు వంటి పథకాలుంటే చూపాలని ఆయన వారికి సవా ల్‌ విసిరారు. సీఎం కేసీఆర్‌ స్వయం పాలనతో ఏం జరుగుతుందో ఉద్యమ సమయంలోనే చెప్పారని, ఇప్పుడు అదే సాకారం అవుతున్నదన్నారు. దేశమే గర్వపడేవిధంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పంట పొలాలు పచ్చగా కనబడుతున్నాయని, రిజర్వాయర్లు జలాలతో కళకళలాడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సాధించిన విజయాలు చెబితే గొప్ప చరిత్ర అవుతుందన్నారు. కరోనా కాలంలో కోటి రెండు లక్షల ఎకరాల్లో పంటలు వేసిన రైతులు ఉత్పత్తుల కొనుగోలుపై ఆందోళన చెందారని, సీఎం కేసీఆర్‌ పంటలన్నింటినీ కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలు గ్రామీణులకు ఆర్థిక భరోసానిచ్చా యన్నారు. సమైక్య పాలనలో దెబ్బతిన్న కులవృత్తులను కాపాడేందుకే గొర్రెలు, చేపల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గతంలోనూ హరితహారం లాంటి కార్యక్రమాలు చేశారని, కానీ ఫొటోలకే పరిమితమయ్యారని ఎద్దే వా చేశారు. ప్రస్తుతం కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. వైకుంఠధామాలు, రైతువేదికలు దసరా నాటికి ప్రారంభిస్తామని చెప్పారు. ఎవరూ ఉహించని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రసమ యి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ అధ్యక్షురాలు విజయ, నగర మేయర్‌ వై సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ల రమేశ్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, నేతలు చల్ల హరిశంకర్‌, ఐలేందర్‌ పాల్గొన్నారు.