శుక్రవారం 30 అక్టోబర్ 2020
Karimnagar - Sep 21, 2020 , 02:05:35

జీవరాశికి జీవం

జీవరాశికి జీవం

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం పొందిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా పర్యావరణంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. నిండు వేసవిలోనూ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకడంతో అంతరించాయనుకున్న జీవరాసులు మళ్లీ దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు హరితహారం కార్యక్రమం.. మరోవైపు అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటుండడంతో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరిగి వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. పెద్దపులులు, చిరుతలు, హైనాలు, నక్కలు, జింకలు, అడవిపందులు, గుడ్డెలుగులు వంటి జంతువులు తిరుగుతున్నాయి. మరోవైపు పర్యావరణ సమతుల్యత ఏర్పడి ఆరేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. పుష్కలమైన నీటి వనరులతో కరువు నేలలో సైతం భూగర్భ జలాలు ఉబికి వచ్చి బంగారు పంటలు పండుతున్నాయి. మత్స్యసంపద పెరగడంతో మత్స్యకారులకు ఉపాధి మార్గాలు మెరుగయ్యాయి.  - కరీంనగర్‌, నమస్తే తెలంగాణ

కనిపిస్తున్న వన్యప్రాణులు..

నాడు ఒక్క తూర్పు అటవీ ప్రాంతంలోనే కనిపించిన వన్యప్రాణులు, ఇప్పుడు అనేక చోట్ల దర్శనమిస్తున్నాయి. కొండ గొర్రె, కృష్ణ జింక, కొండముచ్చు, రెచ్చుకుక్క, చుక్కల పిల్లి, మెకం, వాలుగ, దుప్పి, అడవి పంది లాంటి జంతువులు సందడి చేస్తున్నాయి. అనేక గుట్టలపై అడవి పందులు, ఎలుగుబంట్లు, ఇతర ప్రాణులు కనిపిస్తున్నాయి. అంతరించి పోయానుకున్న నక్కల కూతలు వినిపిస్తున్నాయి. రాత్రయితే చాలు అనేక ప్రాంతాల్లో కూతలు పెడుతున్నాయి. అక్కడక్కడా తోడేళ్లు కూడా కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పులుల సంచారం పెరిగింది. ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, పెద్దపల్లి, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో కొద్ది రోజుల నుంచి అలజడి కనిపిస్తున్నది. గన్నేరువరం మండలం మైలారం గుట్టలపై అడవి పందులు, ఎలుగుబంట్లు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. యాస్వాడలో పశువుల మందతో ఒక జింక పిల్ల కూడా సందడి చేస్తున్నది. ఇక జంగపల్లి ప్రాంతంలో గతంలో చిరుత పులులు కూడా సంచరించాయి. చిగురుమామిడి మండలంతోపాటు సైదాపూర్‌ మండలంలోని ఆకునూరు, రాయికల్‌, సర్వాయిపేట, పర్వత శ్రేణిలోని కోటగిరిగట్లు, భూషణగట్లు, పాపన్న గుట్టలు, ఇనుపరాతి గుట్టల్లోనూ హైనాల సంచారం పెరిగింది. చిరుత పులులు కూడా సంచరిస్తున్నాయి. 
కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఎక్కడ జలం అధికంగా ఉంటుందో అక్కడ జీవరాసులు పరిఢవిల్లుతాయనేందుకు కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనం. గత వేసవి నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను కాళేశ్వర జలాలు సస్యశ్యామలం చేస్తున్నాయి. ప్రాజెక్టుతో నిండు వేసవిలోనూ అనేక చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దునికాయి. వాతావరణంలో తేమ శాతం పెరిగింది. దీనికి తోడు గత ఐదారేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది నాటిన మొక్కలతోపాటు గతంలో నాటినవి చెట్లుగా ఎదుగుతున్నాయి. అంతకు ముందు నుంచే మిషన్‌ కాకతీయ కింద చెరువులు, కుంటలను పునరుద్ధరించడంతో నీటి నిల్వలు పెరిగి భూగర్భ జలాలు పైపైకి వస్తున్నాయి. ఫలితంగా గత వేసవిలో ఉష్ణోగ్రతల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఎండల తీవ్రత తగ్గింది. ఇటు కాళేశ్వరం జలాలతో నిండిన చెరువులు, అటు హరితహారంతో పెరిగిన పచ్చదనంతో ఈసారి రుతుపవనాలు కూడా సకాలంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా భూమిపై నీరే కనిపిస్తోంది.

దర్శనమిస్తున్న వృక్షజాలం

జిల్లాల్లో జీవజాలానికి మూలాధారమైన వృక్షజాలం సైతం వికసిస్తోంది. జిల్లాలో గతంలో ఇబ్బడిముబ్బడిగా వృక్షాలు ఉన్నప్పటికి, కొన్ని వృక్షాలు, తీగలు కానరాకుండాపోయాయి. నేడు మళ్లీ అవి క్రమంగా పెరుగుతున్నాయి. హరితహారంలో భాగంగా పండ్ల మొక్కలను నాటడంతో పాటు, భారీ వృక్షజాలాన్ని సైతం వృద్ధి చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రస్తుతం జిల్లాల్లో నరేపా చెట్లు (ధ్వజస్తంభాలకు వాడుతారు), జిట్రేగి చెట్లు, ఇప్ప చెట్లు, మద్ది చెట్లు, జమ్మి, ఎర్రచందనం తిప్పతీగ, శ్రీగంధం, మారేడు, అడవి ఉసిరి లాంటి చెట్ల పెంపకం మొదలైంది. ఇవి త్వరలోనే పెద్ద వృక్షాలుగా మారే అవకాశాలున్నాయి. అలాగే జగిత్యాలకు దేశ వ్యాప్తంగా పేరు రావడానికి కారణమైన టేకు చెట్ల పెంపకం సైతం జోరుగా సాగుతోంది.

పెరుగుతున్న అటవీ విస్తీర్ణం

మొత్తం భూభాగంలో 33 శాతం అడవులు ఉన్నప్పుడే పర్యావరణం సరిగా ఉంటుందని ప్రకృతి రంగ నిపుణులు, బయోడైవర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి జిల్లాలో అడవుల నరికివేత విచ్చలవిడిగా సాగింది. దీంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 21 శాతం భూమిలోనే అడవులు ఉన్నాయని, ఇది ప్రకృతి సమతుల్యానికి తీవ్రమైన నష్టం వాటిల్ల జేస్తుందని ఆందోళన వ్యక్తమైంది. తెలంగాణ సాధన అనంతరం సీఎం కేసీఆర్‌ చేపట్టిన చర్యల ఫలితంగా అటవీ శాతం పెరగడం ఆరంభమైంది. మరోవైపు నీటి వనరులు పెరగడంతో అటు మైదాన ప్రాంతంలో, ఇటు అటవీ ప్రాంతంలో నీటి ఊటలు పెరిగిపోయాయి. దీంతో చెట్లకు సమృద్ధిగా నీరందుతున్నది. 

పెరిగిన భూగర్భ జలాలు 

కాళేశ్వరం నీళ్లతో భూగర్భ జలాలు పెరిగాయి. వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఒకప్పడు గంగాధర మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది. మండలానికి ఒకవైపు మధ్యమానేరు జలాశయం, మరో వైపు నారాయణపూర్‌ జలాశయాలు ఉండడం, చుట్టూ 28 కిలో మీటర్ల పరిధిలో నిత్యం సజీవంగా ఉండే వరద కాలువ విస్తరించి ఉండడంతో ఈ ప్రాంత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఎక్కడో 20-30 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండేవి. ఇప్పుడు ఏ బావిలో చూసినా చేతికి అందేలా అందుబాటులోకి వచ్చాయి. కాళేశ్వరం జలాలు ఎక్కడెక్కడికి వెళ్లాయో అక్కడక్కడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గన్నేరువరం, చిగురుమామిడి వంటి కరువు ప్రాంతాల్లోనూ ఇప్పుడు పుష్కలంగా జల వనరులు అందుబాటులోకి వచ్చాయి. 

తీరం వెంట ఆటర్స్‌.. మొసళ్లు..

గోదారి తీరం వెంట అరుదైన జలచరాలు సందడి చేస్తున్నాయి. సీల్స్‌, మొసళ్లు ఇప్పటికే పెద్దసంఖ్యలో దర్శనమిస్తుండగా, గత మార్చిలో మెట్‌పల్లి మండలంలోని వేంపేట పెద్దాపూర్‌ చెరువులో స్మూత్‌ ఇండియన్‌ ఆటర్స్‌ (నీటి కుక్కలు) కనిపించాయి. సముద్ర ప్రాంత తీరాల్లో మాత్రమే కనిపించే ఇవి గోదావరి తీరంతోపాటు చెరువులు, కుంటల్లో సైతం దర్శనమిస్తున్నాయి. మంథని గోదారి తీరంతోపాటు చెరువుల్లోనూ కనిపించాయి. ఇవి అంతరించే పోయే దశలో ఉన్నట్లు తెలుస్తుండగా, జలవనరులు పెరగడంతో ఇప్పుడు మన జిల్లాల్లో సందడి చేస్తున్నాయి. నీటిపై అప్పుడప్పుడూ తేలుతూ కనిపించే ఈ నీటి కుక్కలు, మనుషుల అలికిడి కాగానే నీట మునుగుతాయి. అలాగే మల్లాపూర్‌ మండలంలోని వేంపెల్లి, వెంకట్రావుపేట, సారంగాపూర్‌, జన్నారం మండలాల మధ్య ఉన్న కమ్మునూరు, కలమడుగు, మంథని వద్ద ఉన్న ఎల్‌ మడుగు తదితర చోట్ల మొసళ్ల సంతతి వృద్ధి చెందుతున్నది.  

అరుదైన చేపలు..

కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదారి సముద్రాన్ని తలపిస్తున్నది. ఇటు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. మిషన్‌ కాకతీయతో జీవం పోసుకున్న చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. పుష్కలంగా నీటి వనరులు ఉండడంతో ఈసారి పుష్కలమైన మత్స్యసంపద చేతికి వస్తున్నది. రవ్వులు, బొచ్చె, మ్రిగాల, బంగారు తీగ, గ్యాస్‌కట్‌, జెల్లలు, మార్పులు, వాలుగ మస్తుగా దొరుకుతున్నాయి. మంథని గోదారి తీరప్రాంతంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో రవ్వు, బొచ్చె అయితే ఒక్కొక్కటి 20 నుంచి 30 కిలోల వరకు ఉంటున్నాయి. ఎలిగేడు, మంథని, శంకరపట్నం మండలాల్లో అరుదైన బంగారు తీగలు చిక్కాయి. కాషాయ వర్ణంలో కనువిందు చేశాయి. కాకిచిత్ర రకం కూడా లభ్యమయ్యాయి. దాదాపుగా కనుమరుగైన పరకలు, పర్కలు, మొయ్యలు, కొడిపెలు, చెప్పుతట్టలు, ఉలిసెలు, పాపెర్లు, ఇసుక మొట్టలు, పంకిరిగాళ్లు, కొంగమూతి చేపలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. 

అడవుల్లో జీవరాశుల సందడి.. 

అడవుల్లో జీవరాశుల సందడి మొదలైంది. గతం కంటే భిన్నంగా ఇప్పుడు జీవరాశి అడవుల్లో ఉంది. జంతువుల సంఖ్య పెరిగిపోయింది. అలాగే వృక్షాల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. అడువుల్లో ఉండే నీటి విస్తీర్ణం గతంతో పోలిస్తే చాలా పెరిగింది. అలాగే భూగర్భ జలాలు పైకి వచ్చాయి. దీంతో అడవుల్లో అన్ని క్రిమికీటకాలు, సరీసృపాలు, భారీ జంతువుల సంచారం మొదలైంది....అలాగే వాతావరణంలోనూ మార్పులు వస్తున్నాయి. జిల్లాలో చెరువులన్నీ నేడు జీవరాశి వృద్ధి కేంద్రాలుగా మారిపోయాయి. జలం పెరగడంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. 
- వెంకటేశ్వర్‌రావు, జిల్లా అటవీశాఖ అధికారి (జగిత్యాల)