బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Sep 20, 2020 , 03:02:10

శ్మశాన వాటికల్లో సకల సౌకర్యాలు

శ్మశాన వాటికల్లో సకల సౌకర్యాలు

  •  n మేయర్‌ వై సునీల్‌రావు
  • n స్మార్ట్‌సిటీ పనుల్లో జాప్యంపై  అసంతృప్తి
  • nయూజీడీ లెవల్స్‌ లేకపోవడంపై ఆగ్రహం
  • n పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

కార్పొరేషన్‌: నగరంలోని శ్మశాన వాటికల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. నగరంలోని 7, 16వ డివిజన్లలో శనివారం ఆయన పర్యటించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో చేపడుతున్న స్మార్ట్‌సిటీ పనుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్న స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ ఆర్వీ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. దీంతో పాటు ఈ ప్రాంతంలోని భూగర్భ డ్రైనేజీ పనుల లెవల్స్‌ సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఈ పనులన్నీ సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ పనుల్లో సక్రమంగా లెవల్స్‌ పాటించి, త్వరగా పూర్తి చేయాలన్నారు. లెవల్స్‌ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్మార్ట్‌ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఈ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కేటాయించిన రూ. 1.75 కోట్లతో చేపడుతున్న శ్మశాన వాటిక పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.  నగరంలోని అన్ని శ్మశాన వాటికల్లో సౌకర్యాలు కల్పించి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పనులు డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని సూచించారు. మానేరు వాగు ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో అంతర్గత రోడ్లు, గ్రీనరీ, సెక్యూరిటీ గది, మరుగుదొడ్లు, కర్మకాండ గదులు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించిన ప్రణాళికలను తయారు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద రూ. 2.50 కోట్లు మంజూరు చేసిందని, శ్మశాన వాటికలు, పార్కులను సుందరీకరణ చేస్తామన్నారు. నగరంలో వాకింగ్‌ ట్రాక్స్‌, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆకుల ప్రకాశ్‌, అధికారులు ఉన్నారు.


logo