గురువారం 22 అక్టోబర్ 2020
Karimnagar - Sep 19, 2020 , 02:20:52

ఇంటి పర్మిషన్‌ ఇక ఈజీn నగరాలు, పట్టణాల్లో టీఎస్‌ బీ-పాస్‌

ఇంటి పర్మిషన్‌ ఇక ఈజీn నగరాలు, పట్టణాల్లో టీఎస్‌ బీ-పాస్‌

  • n భవన నిర్మాణ అనుమతులు సులభం
  • n దరఖాస్తు చేసిన 21రోజుల్లోనే ..
  • n స్వీయ ధ్రువీకరణతో తప్పనిసరి
  • n నిబంధనలకు విరుద్ధంగా  నిర్మాణం చేపడితే చర్యలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ‘ఇంటి ముందుకు పాలన.. కంటి ముందు అభివృద్ధి’ అనే నినాదంతో వెళ్తున్న రాష్ట్ర ప్రభు త్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ అతీగతీ లేకుండా ఉన్న భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ టీఎస్‌ బీ-పాస్‌ (టీఎస్‌ బిల్డింగ్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం)ను అమల్లోకి తెచ్చింది. నూతన మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం.. యజమాని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఎవరినీ కలువాల్సిన పనే లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే పర్మిషన్‌ వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకు రాగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు

ఇప్పటి వరకు ఇల్లు, భవన నిర్మాణాల అనుమతి కోసం నెలల తరబడిగా వేచిచూడాల్సి వచ్చేది. లైసెన్స్‌డ్‌ ఇంజినీర్‌ వద్ద ప్లాన్‌ తీసుకొని, దరఖాస్తు చేసుకొని కాళ్లరిగేలా తిరిగితే తప్ప అనుమతులు వచ్చేవి కావు. సంబంధిత అధికారులు నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్న సందర్భాలుండేవి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా సులభంగా అనుమతులు వచ్చేలా టీఎస్‌ బీ-పాస్‌ను తీసుకువచ్చింది. యజమానులు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్‌లైన్‌లోనే సంబంధిత పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకునేలా వెబ్‌సైట్‌ను తీసుకువచ్చింది. యజమాని స్వయంగా గానీ, ఇంజినీర్‌ ద్వారా గానీ tsbpass.telangana. govt.inలో నిబంధనల మేర దరఖాస్తు చేసుకుంటే చాలు. మన విస్తీర్ణాన్ని బట్టి అందులోనే ఫీజులు నిర్ధారించి, అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజుల్లోనే అనుమతి తీసుకోవచ్చు. 

ఇదీ బీపాస్‌ ప్రత్యేకత..

టీఎస్‌ బీపాస్‌తో నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణాలకు అనుమతి సులభంగా దొరుకుతుంది. స్వీయ ధ్రువీకరణతోనే తక్షణ అనుమతి లభిస్తుంది. అయితే 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో నిర్మించే భవనాలు పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సదరు యజమాని ఇచ్చే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో జారీ చేస్తారు. అలాగే నివాసేతర భవనాలకు కూడా ఆర్కిటెక్ట్‌తో అటెస్ట్‌ చేయించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఇస్తారు.  

n 75 చదరపు గజాలలోపు స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు అనుమతులూ అవసరం లేదు. నామమాత్రంగా రూపాయి చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. 

n 75 నుంచి 239 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో ఏడు మీటర్ల ఎత్తు వరకు (జీ ప్లస్‌ 1)నివాస భవనాలకు తక్షణ అనుమతి పొందే వీలుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగానే పర్మిషన్‌ వస్తుంది. 

n 239 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో పది మీటర్ల ఎత్తు వరకు (జీ ప్లస్‌2) వరకు నివాస భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) ఆధారంగా అనుమతులు ఇస్తారు.  

n 598 చదరపు గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం, జీ ప్లస్‌ 2 కంటే ఎక్కువ అంతస్తులు ఉండే ప్లాట్లలో నివాసేతర భవనాలకు సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులు ఇస్తారు. ఎన్‌వోసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. దరఖాసుల్తను పరిశీలించి 21 రోజుల్లో పర్మిషన్‌ ఇస్తారు. ఏదైనా కారణంతో ఆ గడువులోపు అనుమతులు రాకుంటే దరఖాస్తుదారుడు అనుమతి వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. 22వ రోజు ఆన్‌లైన్‌లో అనుమతి పత్రం పొందవచ్చు.

లేఅవుట్లకు 21 రోజుల్లో.. 

స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తాత్కాలిక లే అవుట్‌ ప్లాన్‌ అనుమతిని ఆన్‌లైన్‌లో 21 రోజులో జారీ చేస్తారు. లే అవుట్‌ పూర్తిచేసిన తర్వాత లైసెన్స్‌ కలిగిన సాంకేతిక సిబ్బందితో అటెస్ట్‌ చేయించి, జిల్లా కమిటీలు పరిశీలించాక లే అవుట్‌ తుది అనుమతులను జారీ చేస్తారు. మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ల వద్ద తనఖా రూపంలో పెట్టిన ప్లాట్లను లే అవుట్‌ తుది అనుమతి ఇచ్చిన 21 రోజుల తర్వాత విడుదల చేస్తారు. 

అతిక్రమిస్తే జరిమానా.. 

బీ- పాస్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు పొందుపరిచారు. సెల్ఫ్‌ సర్టిఫికేషన్స్‌ ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే ఒకే. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. అనుమతులు పొందిన భవనాల వివరాలను బీ-పాస్‌ యాప్‌లో నమోదవుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఇంజినీరింగ్‌ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం భవన నిర్మాణం జరుగుతున్నదా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షిస్తారు. ఏమైనా తేడాలున్నా.. అనుమతి లేకున్నా.. ప్లాన్‌కు విరుద్ధంగా జరిగే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారు. ఎలాంటి నోటీసులూ లేకుండానే నిర్మాణాలను కూలుస్తారు. లేదా సీజ్‌ చేస్తారు. జరిమానా వేస్తారు. ఇక అనుమతులు తీసుకోకుండా భూమిని అభివృద్ధి చేసిన డెవలపర్‌కు ఆ భూమి విలువలో 25 శాతం ఫైన్‌ వేస్తారు. అక్రమ లే అవుట్‌ వివరాలను సబ్‌రిజిస్ట్రార్‌కు సర్వే నంబర్‌తో సహా నివేదికలను అందజేస్తారు. దీంతో లే అవుట్‌ లేని స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ నిక్షిప్తం కాకపోవడంతో భవన నిర్మాణాలకు అనుమతులు లభించవు.logo