శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 17, 2020 , 02:52:39

జలసోయగం

జలసోయగం

  • lజోరువాన.. పోటెత్తిన వరద  lప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో
  • l‘ఎగువ’ నుంచి ‘దిగువ’కు మానేరు పరవళ్లు
  • lరెండో రోజూ ఎస్సారార్‌ జలాశయం, ఎల్‌ఎండీ గేట్లు ఎత్తి నీటి విడుదల
  • lఎల్లంపల్లి రిజర్వాయర్‌, పార్వతీ బరాజ్‌ గేట్లూ ఎత్తివేత  lసందర్శకుల తాకిడి

(తిమ్మాపూర్‌/బోయినపల్లి/ గంభీరావుపేట/ కరీంనగర్‌ కల్చరల్‌)

రెండు మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఏకధాటిగా దంచికొట్టింది. మంగళవారం రాత్రి కూడా అక్కడక్కడా వాన పడింది. దీంతో అంతటా వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులూ వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. ఇటు అన్ని ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. రెండో రోజూ కూడా శ్రీరాజరాజేశ్వర జలాశయం, లోయర్‌ మానేరు డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో గోదారి ఉప్పొంగుతుండగా, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మానేటి పరవళ్లు..

వరప్రదాయిని మానేరు నది పరవళ్లు తొక్కుతున్నది. భారీగా కురిసిన వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉరకలెత్తుతున్నది. గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువమానేరు వరదతో ఎగిసిపడుతున్నది. రెండు టీఎంసీల సామర్థ్యం గల ఈప్రాజెక్టు నాలుగేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నిండింది. నాలుగైదు రోజుల నుంచి మత్తడి దుంకుతున్నది. అలాగే బోయినప ల్లి మండలంలోని ఎస్సారార్‌ జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ఎస్సారెస్పీ వరదకాలువ ద్వారా బుధవారం 1,376 క్యూసెక్కులు, ఎగువ నుంచి 5,313 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం సామర్థ్యం 25.873 టీఎంసీలు కాగా, బుధవారం 25.68 టీఎంసీలకు చేరింది. దీంతో 6 గేట్ల ద్వారా 19,234 క్యూసెక్కుల నీటిని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. జలాశయాన్ని ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు పరిశీలించారు. ప్రవాహన్ని అంచనా వేశారు. వారి వెంట ఎస్‌ఈ రామకృష్ణ, డీఈలు అంజయ్య, రాజు, మనోహర్‌ తదితరులు ఉన్నారు.  

ఎల్‌ఎండీ 18గేట్ల ద్వారా దిగువకు.. 

కరీంనగర్‌ శివారులోని ఎల్‌ఎల్‌ఎండీ జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నది. ఎగువ న కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదకు తోడు మధ్యమానేరు గేట్లు ఎత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద అనునిత్యం నీటి మట్టాన్ని పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం 20గేట్లు ఎత్తిన అధికారులు, బుధవారం 18 గేట్లు ఎత్తారు. జలాశయానికి ప్రస్తుతం ఎగువన మోయతుమ్మెద వాగు నుంచి 40,835 క్యూసెక్కులు, ఎస్సారార్‌ నుంచి 19,060 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 18 గేట్లు ఎత్తి 72,624 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా 2,500 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 309 క్యూసెక్కులు మొత్తం 75,433 క్యూసెక్కులను అవుట్‌ ఫ్లో రూపంలో బయటకు వదులుతున్నామని ఎస్సారెస్పీ   అధికారులు తెలిపారు. 

సందర్శకుల తాకిడి..

మానేరు పరవళ్లు తొక్కడంతో ప్రాజెక్టుల వద్ద సందడి నెలకొన్నది. ఎగువ, మధ్య మానేరుతోపాటు ఎల్‌ఎండీ వద్ద సందర్శకు తాకిడి కనిపిస్తున్నది. బుధవారం కూడా గేట్లు ఓపెన్‌ ఉన్న విషయం తెలుసుకున్న నగరవాసులు ఎల్‌ఎండీ పరిసరాలకు చేరుకుని సందడి చేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మానేరు అందాలను తిలకించారు. మానేరు వంతెన మీదుగా చాలా మంది నీటి పరవళ్లను చూసి ఆనందంతో మురిసి పోయారు. 

ఎల్లంపల్లి, పార్వతీ బరాజ్‌కు భారీగా వరద 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/అంతర్గాం: ఇటీవలి వర్షాలకు తోడు ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో అం తర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భా రీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. మొత్తం 3,01,873 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 62గేట్లకు 28 గేట్లు ఎత్తి, 4,10,484 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లిలో ప్రస్తుతం 18.6 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఎల్లంపల్లి గేట్లు ఎత్తడం, మధ్యలో వాగుల నుంచి వస్తున్న వరదతో దిగువన మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌కు 4,16,373 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఈ బరాజ్‌ నిల్వ సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా, బుధవారం సాయంత్రం వరకు 7.4టీఎంసీలు నిల్వ ఉన్నది. మొత్తం 74 గేట్లకు 60 గేట్లు ఎత్తి, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.


logo