మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 16, 2020 , 03:10:01

మా‘నీటి’ పరవళ్లు

మా‘నీటి’ పరవళ్లు

  • n భారీ వర్షాలు.. పోటెత్తుతున్న వరద
  • n మూడు ప్రాజెక్టులకూ జలకళ
  • n ఎగిసిపడుతున్న ఎగువమానేరు 
  • n ఎస్సారార్‌ జలాశయం 6 గేట్ల ద్వారా పరుగులు
  • n ఎల్‌ఎండీ 20 గేట్ల నుంచి ఉరకలు

తిమ్మాపూర్‌/ బోయినపల్లి/ గంభీరావుపేట : భారీ వర్షాలతో మానేరు వాగు వరదతో పోటెత్తుతున్నది. ఎగువ నుంచి కూడెల్లి, పాల్వంచ వాగులు పరుగులు తీస్తూ గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి చేరుతుండడంతో మత్తడి ఉధృతంగా దూకుతున్నది. రెండు టీఎంసీల సామర్థ్యం గల ఎగువ మానేరు నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండింది. మూడు రోజుల నుంచి మత్తడి దుంకుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా 2,280 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,688 క్యూసెక్కులు అవుట్‌ ఫ్లో రూపంలో బయటకు వెళ్తున్నది.   

 నిండుకుండలా ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం..

బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం నిండుకుండలా మారింది. వరద కాలువ ప్రవాహం రావడం, ఎగువ నుంచి వరద పోటెత్తడంతో 25.87 టీఎంసీల సామర్థ్యానికి 24 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అధికారులు మంగళవారం సాయంత్రం మొత్తం 25 గేట్లకు 6 గేట్లు ఎత్తారు. మొదట ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌తో కలసి కలెక్టర్‌ 13 గేట్‌ నుంచి ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత ఒక్కో గేట్‌ నుంచి ఒక క్రమ పద్ధతిలో ఆరు గేట్ల ద్వారా రాత్రి వరకు 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 11, 12, 13, 14, 15, 16 నంబర్‌ గేట్ల ద్వారా దిగువకు నీరు వెళ్తున్నది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా జలాశయానికి 13,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.

ఎల్‌ఎండీకి భారీ వరద

ఎల్‌ఎల్‌ఎండీ జలాశయానికి వరద పోటెత్తడంతో మంగళవారం దశల వారీగా జలాశయానికి ఉన్న మొత్తం 20 గేట్లను ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని మానేరులోకి వదులుతున్నారు. జలాశయంలోకి మోయతుమ్మెద వాగు నుంచి 26 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంటే, మంగళవారం సాయంత్రం మధ్యమానేరు గేట్లను తెరిచి అక్కడి నుంచి 15 వేల క్యూసెక్కులు వదిలారు. దీంతో ప్రస్తుతం ఎల్‌ఎండీలోకి సుమారు 42 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, సాయంత్రం 23.602 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లోను బట్టి జలాశయంలో నీటి మట్టం పెరగకుండా గేట్ల ద్వారా 40 వేలు, కాకతీయ కాలువ ద్వారా 2 వేలు విడుదల చేస్తున్నారు. 

20 గేట్ల ఎత్తివేత..

ఎల్‌ఎండీకి భారీ వరద రావడంతో ఎస్సారెస్పీ ఏఈలు కాళిదాసు, వంశీ సోమవారం రాత్రి 10 గంటల తర్వాత ఒక గేటు ఎత్తి నీటిని వదిలారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు రిజర్వాయర్‌కు 8,978 క్యూసెక్కులు రాగా, 4 గేట్లను ఎస్సారెస్పీ జీవీసీ-4 ఎస్‌ఈ శివకుమార్‌, ఈఈలు శ్రీనివాస్‌లు ఎత్తారు. ఉదయం 9 గంటలకు 20,329 క్యూసెక్కులు రావడంతో అధికారులు మరో 4 గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 26,309 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ్లకొనసాగడంతో కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు, ఎస్సారెస్పీ అధికారులతో కలిసి మరో నాలుగు గేట్లను ఎత్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మిగతా 7 గేట్లను ఎత్తి మొత్తం 20 గేట్ల ద్వారా దిగువకు 40వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటి విడుదల దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో ఆధారంగా రిజర్వాయర్‌ నీటిమట్టాన్ని పరిశీలిస్తూ గేట్లను మరింత పైకెత్తనున్నట్లు వెల్లడించారు. 

నెలలో మూడోసారి.. 

ఎల్‌ఎండీ జలాశయం గేట్లను నెల వ్యవధిలో మూడు సార్లు ఎత్తారు. గత నెల 22న మంత్రి గంగుల కమలాకర్‌ చేతుల మీదుగా మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఆ తర్వాత ఇన్‌ఫ్లో తగ్గడంతో మూసి వేశారు. తిరిగి గత నెల 28న ఎస్‌ఆర్‌ఎస్‌పీ సీఈ శంకర్‌ మరోసారి మూడు గేట్లు తెరిచి నీటిని వదిలారు. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి మరోసారి వరద పెరగడంతో జలాశయానికి ఉన్న 20 గేట్లను ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 2016లో మధ్యమానేరుకు గండి పడిన సందర్భంలో ఒకే సారి భారీ వరద వచ్చి చేరగా పూర్తి గేట్లను ఎత్తి నీటిని వదిలారు.  

రైతును రాజు చేయడమే లక్ష్యం : మేయర్‌ 

రైతును రాజుగా చేయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రాజెక్టులు, పథకాలు చేపడుతున్నారని నగర మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. మంగళవారం రిజర్వాయర్‌ వద్ద ఇరిగేషన్‌ అధికారులతో కలిసి గేట్లను ఎత్తారు. అనంతరం మానేరు అందాలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. ప్రాజెక్టులు నిండుకుండలా మారడం శుభ సూచికమన్నారు. రాబోయే మూడు సంవత్సరాలు తాగు, సాగునీటికి ఢోకా ఉండదన్నారు. logo