గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Sep 15, 2020 , 02:59:32

నల్లసూర్యులకు భరోసా

నల్లసూర్యులకు భరోసా

  • అసెంబ్లీ వేదికగా మరోసారి  ప్రేమ కురిపించిన సీఎం కేసీఆర్‌

గోదావరిఖని: సింగరేణి కార్మికులకు ఇప్పటికే అనేక వరాలు ఇచ్చి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ మరోసారి నల్ల సూర్యులపై తన ప్రేమను చాటుకున్నారు. సింగరేణికి సంబంధించి పలు అంశాలపై సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం వివరణ ఇచ్చారు. కారుణ్య నియామకాలలో భాగంగా ఉద్యోగంలో చేరే వారికి అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఇవ్వడం లేదని సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం స్పందించారు. ఆయన మాట్లాడుతూ వాస్తవంగా ఉన్నత విద్యను అభ్యసించిన వారికి వారి అర్హత మేరకు ఉద్యోగం లభించాల్సి ఉందని, ఇందుకుగాను ప్రయత్నాలు ప్రారంభిస్తామన్నారు. అయితే ఉన్నత అర్హతలుండి కొత్తగా కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగంలో చేరే వారికి (ప్రస్తుతం బదిలీ వర్కర్లుగా ఉద్యోగం ఇస్తున్నారు) నేరుగా జనరల్‌ మజ్దూర్లుగా నియమించేందుకు చర్యలు తీసుకుంటామని, అంతర్గతంగా ఉన్న పోస్టులను అర్హత కలిగిన వారితో భర్తీ చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీలు లేకుండా అర్హత మేరకు ఉద్యోగాలు కల్పించడం వీలుకాదని స్పష్టం చేశారు. కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారు కొంత ఓపికతో వేచి చూడాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అంతర్గత పోస్టులతో పాటు చాలా పోస్టులను వివిధ రకాల రిక్రూట్‌మెంట్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే సీఎం చెప్పిన ప్రకారంగా ప్రస్తుతం సింగరేణిలో ఉన్న ఖాళీలను అంతర్గతంగానే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం..

సింగరేణి కార్మికులకు ఇన్‌కంటాక్స్‌ను రద్దు చేయాలని తాము తీవ్రంగా కృషిచేస్తూనే ఉన్నామని, ఇప్పటికే ప్రధానికి విన్నవించామని చెప్పారు. అయితే సింగరేణిలో ఇన్‌కంటాక్స్‌ రద్దు చేస్తే కోల్‌ఇండియాలో రద్దు చేయాల్సి వస్తుందని ప్రధాని పేర్కొన్నారని సీఎం వివరించారు. మరోసారి ఈ అంశంపై టీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించి ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విరమణ పొందే కార్మికులకు రావాల్సిన మొత్తాలను అదే రోజు చెల్లించేందుకు కృషి చేస్తామని సీఎం పేర్కొన్నారు. సింగరేణి సంస్థ, ఇతర సంస్థలో దశాబ్దాల పాటు పనిచేసిన ఉద్యోగులు వారికి రావాల్సిన బకాయిల కోసం తిరగాల్సిన పనిలేకుండా ఒకేసారి చెల్లింపులు చేయాలని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అనేక హామీలు అమలు చేయడంతోపాటు తాజాగా మరిన్ని హామీలు ఇవ్వడంపై కోల్‌బెల్ట్‌ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందుతున్న వారికి బదిలీ వర్కర్లుగా పోస్టింగ్‌ ఇస్తున్నారు. ఇక నుంచి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారికి నేరుగా జనరల్‌ మజ్ధూర్లుగా ఉద్యోగం కల్పిస్తామని పేర్కొనడంపై హర్షం వ్యక్తమవుతోంది. 

బోర్డుకు దరఖాస్తు పెట్టిన

కారుణ్య నియామకాల పుణ్యమాని నేను మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు పెట్టిన. కరోనా కారణం గా బోర్డు ఆగిపోవడంతో ఒక్కటే దిగులుతో ఉన్న. ఇయ్యాల అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీతో కాస్త మనసు కుదుటపడింది. బోర్డులో అన్‌ఫిట్‌ జేత్తే నా కొడుక్కు నౌకరి అత్తదని ఎదురుసూత్తన.

- ఆకుల నారాయణ, జీడీకే-5ఏ గనిlogo