మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 14, 2020 , 02:54:32

క్రమబద్ధీకరణ తప్పనిసరి

క్రమబద్ధీకరణ తప్పనిసరి

కార్పొరేషన్‌: శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని అనధికార, అక్రమ లే అవుట్లలోని ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వాటిని తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకోవాలని సుడా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి వై సుభాష్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌, భవన నిర్మాణ అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేసిందని గుర్తు చేశారు. ఇక నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ ఉన్న ప్లాట్లకు మాత్రమే భవన నిర్మాణ అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంకు సంబంధించి సుడా సీపీవో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

నమస్తే తెలంగాణ: సుడా పరిధిలో ఎవరెవరు, ఎక్కడ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి?

సీపీవో: అక్రమ, అనధికార లే అవుట్లు ఉన్న వారందరూ, 2020 ఆగస్టు 26కు ముందు ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ సైట్‌, సిటిజన్‌ సెంటర్‌, మీ సేవ, మొబైల్‌ యాప్‌ ద్వారా అవకాశం ఉంది.

నమస్తే: అనధికార లే అవుట్లు చేసిన డెవలపర్స్‌, వాటిల్లో కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటి?

సీపీవో: అనధికార లే అవుట్లలో కొనుగోలు చేసిన వారందరూ తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే డెవలపర్స్‌ కూడ ఉన్న ప్లాట్లన్నింటికీ కలిపి దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. వీటికి ప్లాటింగ్‌ చేసిన ప్రాంతంలో 10 శాతం భూమిని డెవలపర్స్‌ స్థానిక సంస్థలకు స్వాధీనం చేయాల్సి ఉంటుంది. 

నమస్తే: వ్యవసాయ భూముల్లోనే ఇండ్ల నిర్మాణాలు చేసుకున్న గ్రామీణులు వాటిని ఎలా క్రమబద్ధీకరించుకోవాలి?

సీపీవో: ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి దస్తావేజులు ఉన్న వారు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలాగే కాకుండా వ్యవసాయ భూముల్లోనే ఇండ్ల నిర్మాణం చేసుకున్న వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

నమస్తే: లే అవుట్లు లేని ఇండ్లను క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిందేనా?

సీపీవో: ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న వారందరూ తప్పకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకొని క్రమబద్ధీకరించుకోవాలి. అలాగే తొమ్మిది మీటర్ల రోడ్డు కూడ ఉండాలి. ఆ మేరకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేసుకున్న వారు కూడ ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. వారి ఇంటికి అనధికారికంగా ఉన్న స్థలాన్ని మాత్రం క్రమబద్ధీకరించుకోవచ్చు.

నమస్తే: గ్రామాల్లో ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు లేని, పట్టా, పాసుబుక్కులున్న ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి అవకాశం ఉందా?

సీపీవో: ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో ముఖ్యంగా ప్లాట్‌గా రిజిస్ట్రేషన్‌ అయిన వాటికి సంబంధించి మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు లేని వారిపై ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

నమస్తే: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

సీపీవో: సుడా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో టాంటాం వేయించడం, బ్యానర్ల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రాంతాలవారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ముఖ్యంగా క్రమబద్ధీకరణ చేసుకోకపోతే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను అందరికీ వివరించేలా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం.

నమస్తే: క్రమబద్ధీకరణ చేసుకోనివారిపై ఏం చర్యలు తీసుకుంటారు?

సీపీవో: ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోకపోతే ఆయా ప్లాట్లను ఇక ముందు రిజిస్ట్రేషన్‌ చేయరు. స్థానిక సంస్థల నుంచి అందే సేవలు కరెంటు, నల్లా కనెక్షన్లు, భవన నిర్మాణ అనుమతులు, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాలు వినియోగించుకునే అవకాశం ఉండదని ప్రభుత్వం సూచించింది.

నమస్తే: ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని పరిష్కరిస్తారా?

సీపీవో: గతంలో ఆయా మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలోనే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వారు కూడ ఈ పథకంలో మరోసారి దరఖాస్తు చేసుకోవడం మంచిది. తక్కువ రిజిస్ట్రేషన్‌ ఫీజు నిర్ణయించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. logo